- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Chandrayaan-3: అందరి చూపు.. చందమామ వైపు
అలనాటి రామచంద్రుడి నుంచి నేటి ఆధునిక రోబో వరకు.. అందాల చందమామ ఎప్పుడూ మానవాళికి ఆకర్షణీయమైన అద్భుతం. దీనిని చేరుకోవాలని అందరూ కోరుకుంటారు. దీనికోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని విజయవంతం అయ్యాయి. 2008 అక్టోబర్ 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ -1ను ప్రయోగించింది. 2019, ఆగస్టు 14న చంద్రయాన్ – 2ను ప్రయోగించి, ఆగస్టు 20, 2019 న చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు కానీ చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తులో ఉండగా, ల్యాండరుకు భూమితో సంబంధం తెగిపోయింది. అయితే, ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.
తక్కువ ఖర్చుతో కూడుకున్న మిషన్లకు పేరుపొందిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్ -3తో మరోసారి చంద్రుడిపైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇస్రో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ నీటి మొత్తాన్ని ఆవిరి రూపంలో ఉన్న ట్రేస్ గుర్తించి చంద్రయాన్ -1తో అపారమైన విజయాన్ని సాధించింది. అందుకే మరోసారి చంద్రయాన్ -3తో చంద్రుని ఉపరితలంపై మరింత అధ్యయనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బిలియన్ సంవత్సరాలలో సూర్యరశ్మిని చూడని చంద్రుని చీకటి వైపు దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో మంచు, విస్తారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని పరిశోధకులు నమ్ముతారు. చంద్రుడి నిగూఢ రహస్యాలు ఛేదించడానికి ఇస్రో చేపట్టిన మూడో ప్రయోగం ఇది.
చంద్రయాన్ - 3 ఎందుకు?
ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ..అగ్రదేశాల జాబితాల్లో చేరిపోయింది భారత్. సాంకేతిక పరంగా పరంగా ఎన్నో వినూత్న ప్రయోగాలకు చిరునామా ఇస్రో చిరునామాగా నిలుస్తుంది. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో భారత్ చేస్తున్న ప్రయోగాలకు అన్ని దేశాలు ఫిదా అవుతున్నాయి. ఇప్పుడు అంతరిక్ష రంగంలో ఇస్రో మరో ఘనతను సాధించనుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక ఘట్టాన్ని చేరుకోనుంది. చంద్రయాన్-3 ద్వారా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా, పర్యావరణం, ధర్మో ఫిజికల్ లక్షణాలు, భూకంప అవకాశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన సైంటిఫిక్ పరికరాల్ని పంపనున్నారు. దీనికోసం ఇస్రో అన్ని ప్రయత్నాలు చేసి, నేడు ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించబోతుంది. ఇది 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇది ఆగస్టు 23వ తేదీ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. దీనికోసం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3ని వినియోగించనుంది.
చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చంద్రయాన్-2 కంటే తక్కువ ఖర్చుతో ప్రయోగిస్తుంది. దీనికి కారణం చంద్రయాన్-2లో పంపిన ఆర్బిటర్ ఇప్పిటికి విజయవంతంగా కక్ష్యలో తిరుగుతూ.. చంద్రుడి ఉపరితలాన్ని చాలా వరకూ స్కాన్ చేసి విలువైన సమాచారాన్ని భూమికి పంపించింది. ఈ ఆర్బిటర్ జీవితకాలం ఏడున్నరేళ్లు అని ఇస్రో నిర్ధారించింది. ఆ ఆర్బిటర్ ఇప్పటికి విజయవంతంగా సేవలు అందించడంతో చంద్రయాన్-3 ప్రయోగంలో ఆర్బిటర్ పంపించడం లేదు. చంద్రయాన్-2లో పంపించిన ఆర్బిటర్‌నే దీనికి ఉపయోగించుకోనున్నారు.
దీనివల్ల చంద్రయాన్-3 ప్రయోగానికి తక్కువ ఖర్చయ్యింది.
చంద్రయాన్-3లో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ను చంద్రుని కక్ష్యలో తీసుకెళ్లడం... ఆపై ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపై దించేందుకు ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ ఉంటుంది. దాని నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరుపడి, చంద్రుడి ఉపరితలంపైకి దిగుతుంది. ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి ఉపరితలం మీద దిగిన తర్వాత దాని నుంచి ర్యాంప్ బయటకు వచ్చి, రోవర్ కూడా బయటకు వస్తుంది. ఇది చంద్రుడి మీద కలియ తిరుగుతూ చంద్రుడి ఉపరితలాన్ని విశ్లేషిస్తుంది. ఆ విశ్లేషించిన సమాచారాన్ని దగ్గర్లో ఉన్న ల్యాండర్‌కి పంపితే, ల్యాండర్ తాను సేకరించిన సమాచారంతో పాటు, రోవర్ నుంచి సేకరించిన సమాచారాన్ని... చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రయాన్- 2 ఆర్బిటర్‌కి పంపిస్తుంది. అక్కడి నుంచి ఆ సమాచారం భూమ్మీద ఉన్న ఇస్రో బేస్ స్టేషన్లకు చేరుతుంది.
అంతరిక్ష పరిజ్ఞానం సాంకేతిక పరికరాల తయారీ లాంటి కీలక రంగాలలో ప్రపంచ దేశాలతో పోటి పడుతూ.. స్వావలంబన దిశగా సాగుతూ అత్మనిర్బరంతో వినువీధులలో త్రివర్ణ కాంతులని వెదజిమ్ముతోంది ఇస్రో. తక్కువ ఖర్చుతో ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేరుకుంటుంది ఇస్రో. చంద్రయాన్-3 ప్రయోగ ఫలితాలు రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలకు దిశానిర్దేశం చేయగలగాలి. ఈ ప్రయోగం సఫలం కావాలని యావత్ భారతం కోరుకుంటోంది. జయహో ఇస్రో.. జై భారత్, జై విజ్ఞాన్.
వాడవల్లి శ్రీధర్
99898 55445