నటనా సమ్మోహనం చంద్రమోహన్

by Ravi |   ( Updated:2023-11-12 00:30:24.0  )
నటనా సమ్మోహనం చంద్రమోహన్
X

చంద్ర మోహన్.. ఒకప్పటి హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. క్యారెక్టర్లన్నీ ఆయనవే. ఆయన 55 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్నారు. ‘రంగుల రాట్నం’తో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్.. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది తెలుగు సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న చంద్ర మోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు.

మహా గట్టివాడు

అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్‌ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు. అలా పలు ప్రశంసలు అందుకుంటూనే చంద్రమోహన్ తనదైన అభినయంతో జనాన్ని పరవశింపచేశారు. ఇక ఈయన పొట్టిగా ఉండటం వల్లే.. మేము స్టార్ హీరోలుగా ఎదిగినట్టు పలు సందర్భాల్లో కృష్ణ, శోభన్ బాబు వెల్లడించడం నటుడిగా చంద్ర మోహన్ సమర్థతకు నిదర్శనం. ఆయన కొన్ని చిత్రాలలో కథానాయకుని గానూ అలరించారు. అనేక సినిమాల్లో అభినయ ప్రాధాన్యమున్న పాత్రల్లో మురిపించారు. నటుడిగా ఒక మూసకే పరిమితం కాలేదు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో రాణించారు. ఈయనకు ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, అన్న వరుస అవుతారు. విశ్వనాథ్ చిత్రాల్లో చంద్రమోహన్‌కు తగ్గ పాత్రలుంటే తప్పక అతణ్ణే పిలిపించేవారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం , శుభోదయం” వంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్. ప్రతినాయకుని పాత్రలో రెండు మూడు చేశారు. అందులో ‘గంగ మంగ’ సినిమాను ప్రధానంగా చెప్పుకోవాలి. అలాగే, జయసుధ సినిమా ‘లక్ష్మణరేఖ’లో నెగెటివ్ రోల్. తమిళంలో ఐదు చిత్రాలు… మలయాళ, కన్నడ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించారు. తమిళంలో ఎంజీఆర్‌తో ‘నాళై నమదై’లో నటించారు. అది ‘అన్నదమ్ముల అనుబంధం’ రీమేక్. తెలుగులో బాలకృష్ణ పోషించిన పాత్రను తమిళంలో చంద్రమోహన్ చేశారు. శివాజీ గణేశన్‌తో ‘అండమాన్ కాదలై’ సినిమా చేశారు. తెలుగులో ‘అండమాన్ అమ్మాయి’గా రీమేక్ చేశారు తొలినాళ్లలో ‘కొత్త నీరు’ వంటి చిత్రాలతో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ తర్వాత తన పంథా మార్చుకున్నారు.

తండ్రి పాత్రకు మారుపేరుగా..

అలాగే ‘బంగారు పిచుక’ వంటి సినిమాల నుంచీ ఆయనలోని కామెడీ యాక్టర్ బయటికొచ్చారు. ‘గంగ మంగ’ వంటి కొన్ని చిత్రాల్లో విలనిజం చూపించారు. సినిమాలో తనది హీరో కేరెక్టరా.. కాదా అని చూసుకున్నదే లేదు. వచ్చిన పాత్రకు తగిన న్యాయం చేయడమనే సూత్రాన్ని పాటించి విజయాన్ని సాధించారు. చంద్రమోహన్ నటించిన ‘ఓ సీత కథ’తో వేటూరి గీతరచయితగా పరిచయం కావడం విశేషం. ఇటు హీరోగా.. అటు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా అనేక హిట్లు అందుకున్నారు. ‘రెండు రెళ్లు ఆరు’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో కామెడీ హీరోగా టాలెంట్ చూపారు. అల్లుడు గారు’ మూవీతో ఫుల్ టైం కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు చంద్రమోహన్. తర్వాత వచ్చిన ‘గులాబీ’తో తండ్రి పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచీ వరుస సినిమాలు. నువ్వు నాకు నచ్చావ్, 7జీ బృందావన్ కాలనీ, అతనొక్కడే వంటి చిత్రాల్లో హీరో ఫాదర్‌గా 100 శాతం ఫిట్ అనిపించుకున్నారు. అంతేకాదు చిరంజీవి హీరోగా నటించిన ‘ఇద్దరు మిత్రులు’, బాలకృష్ణ హీరోగా నటించిన ‘యువరత్న రాణా’, నాగార్జున హీరోగా నటించిన ‘సీతారామరాజు’, వెంకటేష్ హీరోగా నటించిన ‘గణేష్’ సినిమాల్లో టాలీవుడ్ సీనియర్ హీరోలకు తండ్రిగా నటించి మెప్పించారు. ’రాఖీ’ లో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు అనే చెప్పాలి. దూకుడు, యముడికి మొగుడు, చివరగా అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇన్నేళ్ల కెరీర్‌లో తమిళంలో ఐదు, కన్నడ, మలయాళ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించారు. మొత్తంగా 55 ఏళ్లకు పైగా కెరీర్‌లో 930 చిత్రాల్లో నటించారు. అందులో 175 చిత్రాల్లో హీరోగా నటించడం విశేషం.

తనతో సినిమా కలిసొస్తుందని..

ఆయన సినిమాల్లో నటించడానికి పోటీ పడతారు హీరోయిన్స్ . సిరిసిరి మువ్వలో జయప్రద, పదహారేళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో ఆయనతో నటించి అగ్రకథానాయికలుగా వెలిగారు. అప్పట్లో చాలా మంది హీరోయిన్స్ ఆయన సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగు పెడితే మంచి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు వస్తుందని భావించేవారు. ఆయన చేత్తో ఒక్క రూపాయి తీసుకుని దాంతో తమకు కలిసి వస్తుందని హీరోయిన్లు భావించేవారు. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లు, నటీనటులు కూడా కొత్త సంవత్సరం తొలి రోజునే ఇంటికి వచ్చి అలా డబ్బులు తీసుకుంటూ ఉంటారట.

తనతరం హీరోలైన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిత్రాలలోనూ ముఖ్య పాత్రలు ధరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఒకానొక దశలో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. ఈయన నటించిన చివరి చిత్రం 'ఆక్సిజన్‌'.1966లో రంగులరాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. చంద్రమోహన్ తన కెరీర్లో 2 ఫిలింఫేర్‌, 6 నంది అవార్డులు అందుకున్నారు. 'పదహారేళ్ల వయసు', 'సిరిసిరిమువ్వ' సినిమాల్లో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. 2005లో 'అతనొక్కడే' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1987లో 'చందమామ రావే' సినిమాకు ఉత్తమ కమెడీయన్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఆయన మృతితో తెలుగు సినిమా ఒక మంచి నటుడిని కోల్పోయింది.

- వాడవల్లి శ్రీధర్

99898 55445

Advertisement

Next Story

Most Viewed