- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంద వసంతాల స్కూల్
జాగీర్దారీ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు నాయకత్వ లక్షణాలు వారిలో విరివిగా పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్‌లో వందేళ్ల క్రితం 1924లో బ్రిటిష్ అధికారులు, నిజాం ప్రోత్సాహంతో ఏర్పడింది. అందులో జాగీర్దార్ల పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉండేది. స్వాతంత్ర్యానంతరం 1951లో హైదరాబాద్‌లో పబ్లిక్‌స్కూల్‌గా పునర్ వ్యవస్థీకరించబడినది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి మంచి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులను అందించాలన్న లక్ష్యంతో గత వందేళ్ల నుండి నుండి ఈ స్కూల్ ఎనలేని కృషి చేయడం హర్షణీయం.
సరిగ్గా నేటికి వందేళ్ల కిందట నిజాం హైదరాబాద్ సంస్థానంలోని రెవెన్యూ డైరెక్టర్ జనర్ వెక్‌ఫీల్డ్‌కు ఓ ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. వెక్‌ఫీల్డ్ ఒకరోజు తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాల జాగీర్దారి పిల్లవాడిని పరామర్శించడానికి వెళ్లినప్పుడు, నీ పేరేంది బాబూ అని ఆ 9 ఏండ్ల పిల్ల జమిందారును వెక్‌ఫీల్డ్ పదేపదే అడిగినా ఆ పిల్లాడు బిడియంతో తనవెంట ఉన్న ఆయా చాటున దాక్కుని ఆయాతో తన పేరు చెప్పమని బ్రతిమిలాడడాన్ని గమనించిన వెక్‌ఫీల్డ్ ఆశ్చర్యపోయాడు. తొమ్మిదేండ్ల ప్రాయంలో కూడా తనపేరు చెప్పడానికి సిగ్గుపడే వ్యక్తి చేతికి రేపు సంస్థానం బాధ్యతలు అప్పగిస్తే దాని భవిష్యత్తు ఏంటని విస్తుపోయాడు. తర్వాత వెక్ ఫీల్డ్ విద్యాశాఖ కార్యదర్శి రోజ్ మసూద్‌ను జాగీర్దారీ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు నాయకత్వ లక్షణాలు వారిలో విరివిగా పెంపొందించే లక్ష్యంతో ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలని సూచించాడు. వీరిద్దరి ఆలోచనలకు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆమోదం లభించడంతో జూన్ 1923 నాడు జాగీర్ధార్ కాలేజీ బేగంపేటలో పురుడుపోసుకుంది.
జాగీర్దార్ పిల్లల స్కూల్
పాయోగా రాజకుటుంబీకుల ఆర్థిక సహాయంతో లండన్‌లోని ఈటెన్ కాలేజీ నమూనాతో పూర్తి రెసిడెన్షియల్ స్కూలుగా 1924 జూన్‌లో జాగీర్దార్ కాలేజి ప్రారంభమయింది. ఐదుగురు విద్యార్థులు ఆరుగురు ఉపాధ్యాయులతో ఆంగ్లేయుడు షాక్రాన్ తొలి ప్రిన్సిపల్‌గా ఇంగ్లీషు, ఉర్దూ మాధ్యమాలతో ప్రారంభమైన ఈ స్కూల్లో గుర్రపు స్వారి, కత్తిసాము, విలువిద్యలు, చిత్రలేఖనం, గోల్ఫ్, పోలో, ఈత, సంగీతం, వివిధ క్రీడలు చదువులతోపాటు నేర్పించెడివారు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం విశేషం. ఆ రోజుల్లో తొలిబ్యాచ్ విద్యార్థులు సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలకు వెళ్లడం జంటనగరాలలో ఓ పెద్ద వార్త. జాగీర్దారి పిల్లలకోసం మాత్రమే ఏర్పడిన మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ ఇది. పాఠశాల భవనాల నిర్మాణానికి, క్రీడామైదానాలకు 89 ఎకరాల స్థలాన్ని ఐదవ నిజాం నవాబు అఫ్జల్ ఉద్దౌలా కుమార్తెకు తన భర్త వికార్ ఉల్ ఉమ్రా రాసిచ్చిన బేగంపేటలోని స్థలాన్ని దానమిచ్చారు. దీనికితోడుగా 7వ నిజాం తన సర్ఫేఖాస్ భూముల నుండి కొంత భాగం ఈ పాఠశాలకు దానమిచ్చారు. ప్రస్తుతం 152 ఎకరాల్లో విస్తరించివున్న ఈ పాఠశాల అభివృద్ధికి నాటి హైదరాబాద్ సంస్థానంలోని పలువురు జమీందార్లు కృషిచేశారు. ఒకప్పుడు ఐదుగురు విద్యార్థులతో ఆరుగురు అధ్యాపకులతో ప్రారంభమైన ఈ పాఠశాల నేడు 152 ఎకరాల్లో విస్తరించి, 155 మంది అధ్యాపకులతో 3,200 మంది విద్యార్థులతో ప్రపంచస్థాయి పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. విశాలమైన భవనాలు పచ్చికబయళ్లు, పచ్చని చెట్లు, వందకుపైగా విశాలమైన తరగతి గదులు, 44 క్రీడామైదానాలు, డిజిటల్ క్లాస్‌రూంలూ, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఈ లైబ్రరీలతో విరాజిల్లుతోంది.
తాత్వికతే పునాదిగా...
స్వాతంత్ర్యానంతరం 1950లో జాగీర్దారి వ్యవస్థ రద్దు పిదప సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్టు ప్రకారం హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ సొసైటి ఏర్పడ్దది. అప్పటివరకు కొనసాగుతూ వచ్చిన జాగీర్దార్ కాలేజీ 1951లో హైదరాబాద్‌లో పబ్లిక్‌స్కూల్‌గా పునర్ వ్యవస్థీకరించబడిరది. జాగీర్దార్ కాలేజీగా ఉన్నప్పుడు అందులో కేవలం జాగీర్దార్ల పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉండేది. సామాన్యులకు ప్రవేశం ఉండేది కాదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా పరిణామం చెందిన పిదప అందులో అందరికీ ప్రవేశం కల్పించారు. హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ మొదటి అధ్యక్షులు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు. దాని మొదటి ప్రిన్సిపల్‌గా 1952లో జాన్.డబ్లూ.ఆర్ కెంఫె నియమితులైనారు. 1961లో ఈ పాఠశాలను కో ఎడ్యుకేషన్ స్కూలుగా మార్చారు. ఇది స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ పాఠశాల గొప్ప తాత్త్విక పునాదుల మీద ఏర్పడ్డది. దాని పుట్టుకలోనే దార్శనికత ఇమిడి ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి మంచి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులను అందించాలన్న లక్ష్యంతో గత వంద సంవత్సరాల నుండి ఇది ఎనలేని కృషి చేయడం హర్షణీయం. విద్యార్థుల అభిరుచికి తగిన స్వేచ్ఛ ఇవ్వడం వారిలోని ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించడం ఈ పాఠశాల ప్రత్యేకత.
సీఈఓల నుంచి సీఎంల దాకా..
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌పాల్ సింగ్ బంగా, మైక్రోసాఫ్ట్ సిఈవో సత్యనాదెళ్ల లాంటి ఎందరో ప్రపంచ ప్రఖ్యాత సిఈవోల, సినీనటుల, క్రీడాకారుల, రాజకీయ నాయకుల మొదటి అడుగు మొదలైంది ఈ పాఠశాల ప్రాంగణంలోనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, అససుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, అశోక్ గజపతిరాజు, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, పి.సుధీర్ కుమార్ లాంటి నాయకులంతా ఇక్కడి పూర్వవిద్యార్థులే. ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రతినిధులంతా ఇక్కడి పూర్వవిద్యార్థులే.
ఇదే లక్ష్యంతో…
చరిత్ర పుటల్లో జాగీర్ధార్ కాలేజీగా ప్రారంభమై మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ క్రమంగా ఎదిగి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా పరిణామం చెంది శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ పాఠశాల అధికారుల లక్ష్యం వంద కోట్ల నిధిని సమకూర్చి పాఠశాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒలంపిక్ సైజు స్విమ్మింగ్ పూల్‌ను, మల్లీస్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించడంతోపాటు ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి రోబోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులలో అవగాహన కల్గించి వారిలో పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించడం. ఇక్కడి అధ్యాపకులు చేస్తున్న కృషి అభినందనీయం. ఇక్కడి విద్యార్థులు, అధ్యాపకుల ఆకాంక్షలు, ఆశయాలు సాకారమవుతాయని ఈ సందర్భంగా మనమంతా ఆశిద్దాం.ఈ వ్యాస రూపకల్పనలో ఈ స్కూల్ పూర్వ విద్యార్థి మందుల సూర్య కిరణ్ సమాచారం ఇచ్చి సహకరించారు ఆయనకు కృతజ్ఞతలు.
(హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా)
- ప్రొ.జి.లక్ష్మణ్,
98491 36104