- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందని ద్రాక్షగా ఐఐటీలు..
గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు దేశంలోని అత్యంత నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అందని ద్రాక్షగా ఉంది. ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే ఐఐటీ విద్య అందుతుందనే విమర్శ కూడా ఉంది. కోచింగ్ సెంటర్లలో లక్షలు వెచ్చిస్తే గాని విద్యార్థులు ఐఐటీలలో చేరే అవకాశం లేదు. పేద విద్యార్థులకు ఐఐటీలలో చేరడం ఒక కలగానే మిగిలిపోతోంది.
భవిష్యత్తు తరాలకు కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో భారతీయ ఐఐటీల పాత్ర ప్రముఖమైనది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకి సీఈఓలని, దేశానికి రాజకీయ నాయకులను, శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను, అధికారులను అందించిన ఘనత ఐఐటీలకే దక్కుతుంది.
ఐఐటీలకు క్రేజ్ ఇందుకే!
2023 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో అత్యున్నత ఇంజనీరింగ్ విద్యను అందించే కళాశాలల్లో మొదటి పది స్థానాల్లో 8 ఐఐటీలకే దక్కాయి. మొదటి మూడు ర్యాంకుల్లో ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ఉన్నాయి. అందుకే ఐఐటీ విద్యార్థులపై కార్పొరేట్ కంపెనీల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో చదివే విద్యార్థుల సరాసరి జీతం సంవత్సరానికి 30 నుండి 40 లక్షల వరకు ఉంటుంది. ఐఐటీలకి అంత క్రేజీ ఇందుకే! వీటిలో చదివి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో ఎందరో ఉన్నారు.
ప్రస్తుతం భారతదేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. ఈ ఐఐటీలలో కేవలం 17,385 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసించే అవకాశం ఉంది. కానీ, ఈ ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో సీటు సంపాదించడానికి ఎంతో పోటీ ఉంటుంది. గత సంవత్సరం 11,13,325 మంది విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరయ్యారంటే దీన్నిబట్టి ఐఐటీలో సీట్ కోసం విద్యార్థుల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అవగతం అవుతుంది. ఇంత పోటీ ఉన్న ఈ ఐఐటీలను గత దశాబ్ద కాలంలో కేవలం ఏడింటిని మాత్రమే కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అత్యధిక జనాభాకు సరిపడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణలను అందించాలి. అందుకే పెరిగిన జనాభాకు అనుగుణంగా ఐఐటీలను పెంచాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
మేధోవలసను ఆపాలి
గత కొన్ని సంవత్సరాలలో ఐఐటీల్లో చేరే విద్యార్థులను పరిశీలిస్తే 95% మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్న వారు మాత్రమే ఐఐటీలలో చేరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి దేశంలోని అత్యంత నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అందని ద్రాక్షగా ఉంది. ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే ఐఐటీ విద్య అందుతుందనే విమర్శ కూడా ఉంది. కోచింగ్ సెంటర్లలో లక్షలు వెచ్చిస్తే గాని విద్యార్థులు ఐఐటీలలో చేరే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యల్లో ఐఐటీ కోచింగ్ సెంటర్లు తెరవడం, వాటిలో విద్యార్థుల కోచింగ్ కోసం తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు చేయడం జరుగుతోంది. విద్యార్థులపై మానసిక ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. పేద విద్యార్థులకు ఐఐటీలలో చేరడం ఒక కలగానే మిగిలిపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రభుత్వ ఆధీనంలోని విద్యార్థులకు ఐఐటి, జేఈఈ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి అత్యున్నత ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశాలు కల్పించేలా చేయడం ఆవశ్యకం. తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఒక నివేదిక ప్రకారం, 1953 నుండి ఇప్పటివరకు ఇక్కడి ఐఐటీల్లో చదివిన 25వేల మంది అమెరికాలో స్థిరపడ్డారని తెలియజేసింది. ఈ మేథోవలసలను ఆపాలి. వీరి సామర్థ్యాన్ని దేశం ఉపయోగించుకునేలా ప్రణాళికలు రచించాలి.
- పాకాల శంకర్ గౌడ్
98483 77734