ఆహార కల్తీని కట్టడి చేయలేమా!

by Ravi |   ( Updated:2023-06-22 00:01:12.0  )
ఆహార కల్తీని కట్టడి చేయలేమా!
X

నిషిని నాశనం చేసేది అతని బుద్ధి. అందులో ఉద్భవించే ఆలోచనలే, శత్రువులు కానేకాదు. నాలుకకు ఇష్టమైన ఆహారం కాకుండా శరీరానికి అవసరమైన బలవర్థకమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కానీ నేడు మనిషి ఉరుకులు పరుగుల జీవితం మూలంగా రెడీమేడ్ బయటి ఆహారానికి అలవాటు పడిపోవడంతో ఆ ఆహారానికి గిరాకీ పెరిగిపోతోంది. మహా నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆహార పదార్థాల విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. ఎంతగా పెరిగిపోయాయి అంటే అడుగడుగునా రహదారుల వెంట ఎక్కడపడితే అక్కడ బిర్యాని, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు, బార్ల ముందు తినుబండారాల సెంటర్లతో వినియోగదారులకు ఎలాంటి శ్రమ, ప్రయాస లేకుండా డబ్బులు పడేస్తే రెడీమేడ్ గా తయారైన ఆహారాన్ని రాత్రి పగలు అనే తేడా లేకుండా అందిస్తున్నాయి. వినియోగదారులు అది కల్తీదని తెలిసో, తెలియకో మొత్తం మీద తింటున్నారు. ఈ తయారీదారులు ఏ జీవనోపాధి లేకపోవడంతో వినియోగదారుల విపరీత జిహ్వ చాపల్యం (నాలుక రుచి) కోరికల మేరకు అందిస్తున్నారు.

గాల్లో కలిసిన ఆహార నాణ్యత

ఇది ఇలా ఉంటే! మహా నగరాలు, పట్టణాల ప్రజానీకం నిత్యం ఇంట్లో వంటలకు స్వస్తి పలికి ఉదయం టిఫిన్లు, సాయంత్రం మందు రాయుళ్లకు వేడి వేడి బజ్జీలు, మిర్చీలు, గారెలు, తదితర జంక్ ఫుడ్, వెజ్, నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్లతో కాలం వెళ్ళదీస్తున్నారు. వీకెండ్ పార్టీల పేరిట కుటుంబ సమేతంగా రెస్టారెంట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇంతగా ప్రజలు ఆహారం కోసం ఇంట్లో తయారు చేసుకోకుండా రెడీమేడ్ స్పైసీ జిహ్వ చాపల్యం (నాలుక రుచి) కోసం నాణ్యతను పట్టించుకోకుండా ఆహారానికి అలవాటు పడుతూ.. ఈ విక్రయ కేంద్రాల వద్ద నిలబడి బార్లు కడుతుంటే పొట్ట గడవడం కోసం ఈ వ్యాపారం చేస్తున్న వారు కొందరైతే, వినియోగదారుల కోరికలే వ్యాపారంగా ఎంచుకొని ఆహార భద్రతకు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తూ పొట్టకొడుతున్న వారు ఉన్నారు. పాలకులకు ప్రజా ఆరోగ్యంపై, వినియోగదారులకు ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల మీద కనీస స్పృహ లేకుండా పోతుంది. బతుకుదెరువు కోసం వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఏ వ్యాపారం చేయాలన్నా ఆ పరిధిలోని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల వద్ద లైసెన్సులు, అనుమతులు తీసుకోవాలి. అంతే కాదు మరీ ఆహార పదార్థాల తయారీలో కల్తీ లేని నాణ్యమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత ఆహార పదార్థాల వ్యాపారస్తులపై మెండుగా ఉంది. అలాగే వినియోగదారులకు పాలకులు ఆహార భద్రతను కల్పిస్తూ, కల్తీ ముప్పు నుండి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది.

ఒకవైపు వాతావరణంలో కాలుష్య కారకాలు పెరిగిపోయి ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారింది. మరోవైపు పాలకుల ఉదాసీనత, వినియోగదారుల విచ్చలవిడి రెడీమేడ్ ఫుడ్‌కు అలవాటు పడుతున్న తీరుతో కట్టడి లేని కల్తీ శృతి మించిపోయి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే విధంగా వ్యాపారస్తులు తెగబడుతున్నారు. ఆహార పదార్థాల తయారీలో, నిలువలో, ప్యాకింగ్లో వాటిలో వాడే నూనెలు, కారం పొడి, పిండి పదార్థాలు, పసుపు, మసాలా లాంటి వాటిలో కల్తీ కరాళ నృత్యం చేస్తుంది. అధికారులు నిబంధనలకు పాతరేస్తూ నామమాత్రపు తనిఖీలు, పరిశీలించకుండానే లైసెన్సులు ఇవ్వడాలు జరుగుతుంది. లైసెన్సు లేకుండా నడుస్తున్న ఆహార పదార్థాల వ్యాపార జోరును ఆపలేని పాలకుల కళ్ళు ఉండీ చూడలేని విధానాలతో కల్తీ ఆహార పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. సోమరితనం, అమాయకత్వం, ఆరోగ్యంపై నిర్లక్ష్యంతో మూడించుల నాలుక రుచికి బానిసలై ప్రజలు కుమ్మే(తినే)స్తున్నారు. పోనీ అవి తినేవారికైనా ఆహార పదార్థాల నాణ్యత గురించి తెలుసుకోవాలనే ధ్యాస లేదు. ఎందుకంటే వాళ్లకు అంత టైము లేదు, ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. ఉంటే ఇంట్లోనే తయారు చేసుకునేవారు కదా!.

ఆహార నాణ్యతలో అథోగతి

ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వారు ఆహార భద్రతకు సంబంధించి ఆహార నాణ్యత సూచీలో దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 15వ, ఆంధ్రప్రదేశ్ 17వ, స్థానంలో నిలిచాయి. ఈ ఆహార నాణ్యత సూచీలో వంద మార్కులకు గాను తెలంగాణకు 34.5% మార్కులు వచ్చాయి. అంటే ఆహార నాణ్యత ప్రమాణాలు 34.5% ఉన్నట్లు లెక్క. ఆహార పదార్థాల తయారీలో నాసిరకం సరుకులు, కల్తీ నూనెలు వాడి నాణ్యత లేని వాటిని తక్కువ ధరలకు అమ్ముతూ ఆఫర్లు పెట్టడంతో ఎక్కువమంది వినియోగదారులు ఆకర్షితులై ఇంట్లో వంటలు మానేసి ఎగబడి తింటూ రోగాల బారిన పడుతున్నారు. ఇలా కల్తీ ఆహారం మూలంగా గుండె, కాలేయం, చర్మ, మూత్రపిండాలు, స్పైసీ-జంక్ ఫుడ్ లాంటి వాటితో జీర్ణాశయ వ్యాధులు, అల్సర్లు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు అంటున్నారు.

కోటి విద్యలు కూటికే.. కల్తీకి కాదు

ఆహార తనిఖీ రంగంలో సిబ్బంది కొరత మూలంగా కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ముప్పై ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. మన దేశంలో ఆహార నాణ్యత సూచీలో తొలి స్థానంలో ఉన్న తమిళనాడులో తనిఖీ వ్యవస్థ పక్కాగా పనిచేస్తుంది. వారి విధానాల నుండి తెలుగు రాష్ట్రాల పాలకులు స్ఫూర్తిని పొంది, ఆహార నాణ్యత ప్రమాణాలను పెంచాలి. ప్రయోగశాలలు, శాంపిల్ పరీక్షలు పెంచి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి. ఆహార నాణ్యత ప్రమాణాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విస్తృతంగా అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. తనిఖీలు తూతూ మంత్రంగా కాకుండా కల్తీకి పాల్పడిన వ్యాపారులపై కఠిన శిక్షలు పడేలా చేయాలి. అలాంటప్పుడే ఇంకొకరు కల్తీకి పాల్పడకుండా ఉంటారు. రాష్ట్రాల్లో సాగుతున్న ఆహార పదార్థాల సంస్థలైన స్టార్ హోటల్ నుండి రోడ్ల వెంట, కూడళ్లలో పెట్టుకునే సంచార బండ్ల వరకు అన్నింటికి సంబంధిత శాఖ లైసెన్సులు, అనుమతులు తీసుకునేలా చూడాలి. లేని వాటిపై ఫైన్లు వేసి అన్నింటిని క్రమబద్ధీకరించాలి. అప్పుడే వ్యాపారులకు భరోసా, వినియోగదారులకు భద్రత కలిపిస్తూ.. కల్తీని కట్టడి చేయవచ్చు. వినియోగదారులు కూడా ఇంటి ఆహారాన్ని (హోమ్ ఫుడ్) తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కోటి విద్యలు కూటి కోసమే కదా.. ఆ కూడే కల్తీ దాన్ని తినడమా! ఇదేం చేటు కాలం. ప్రభుత్వాలు ఆహారభద్రత, నాణ్యతకు భరోసా కల్పించాలి. వినియోగదారులారా మీరు మారండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

మేకిరి దామోదర్

సామాజిక విశ్లేషకులు

95736 66650

Advertisement

Next Story