టీచర్లపై సర్వే భారం.. విద్యార్థులకు శిరోభారం

by Ravi |   ( Updated:2024-11-28 01:00:42.0  )
టీచర్లపై సర్వే భారం.. విద్యార్థులకు శిరోభారం
X

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర ఇంటింటి కుటుంబ) సర్వే చివరి అంకానికి చేరుకుంది. ఈ సర్వే ఉద్దేశం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ అంశాలను మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేయడం. వాటిని అమలు చేయడానికి ఈ సర్వే దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ, ఈ విద్యా సంవత్సరం మధ్య భాగంలో ఈ సర్వేను చేపట్టడం, అందులో ఎస్‌జీటీ ఉపాధ్యాయులనే ఈ సర్వేలో పాల్గొనేలా చేయడం జరిగింది. దీనివల్ల ప్రాథమిక విద్య నష్టపోతుందని చెప్పడంలో ఫోర్త్ ఎస్టేట్, ప్రతిపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు, పేరెంట్స్ కమిటీలు సరైన పాత్రను పోషించలేదనేది వాస్తవం.

ప్రభుత్వ ఆదేశానుసారం ఎస్‌జీటీ ఉపాధ్యాయులు సర్వేలో అనేక కష్టాలు పడుతూ పలుచోట్ల ఎన్యుమరేటర్లకు ఎదురు ప్రశ్నలు వేసినా, ఛీత్కారాలు, చీవాట్లు, అమానుషం గా వారిపై కుక్కలతో దాడి చేయించినా, కూర్చోవడానికి కుర్చీలు ఇవ్వకున్నా, 75 ప్రశ్న లను బుక్‌లోని కోడ్లతో క్రోడీకరిస్తూ ఫార్మ ట్ నింపడం జరిగింది. ఒకపూట బడి చెప్తూ మిగతా కాలంలో సర్వేను పూర్తి చేసి చివరి అంకానికి చేరారు. వాస్తవంగా ఉపాధ్యాయులను బడికి, బోధనకు దూరం చేయరాదనే నిబంధన ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా వారిపై అదనపు భారం మోపారు.

సర్వే అయిపోయిందనుకుంటే..

ఏదేమైనా ఒక వ్యవస్థను అంచనా వేయడానికి ఇంకో వ్యవస్థను బలిపీఠం ఎక్కించడం భావ్యం కాదు! ఇలాంటివి వేసవి సెలవుల్లో చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు వాస్త వాలు గ్రహించి ప్రాథమిక విద్య పటిష్టతకు పూనుకొని ముందుకు సాగాలి. ప్రాథమిక పాఠశాలలు గత కొన్ని రోజులుగా సర్వే పేరుతో ఒంటిపూట బడులు మాత్రమే నడుస్తున్నాయి. ఇక సర్వే చివరి దశకు చేరుతోంది. ఇక పూర్తి సమయం చదువులకు కేటాయించుకోవచ్చు అని ఊహించుకునే తరుణంలో ఆన్లైన్ డేటా కూడా ఉపాధ్యాయులు దగ్గరుండి చేయించాలంటున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే "మూలిగే నక్కపై తాటి పండులా" మారుతుంది పరిస్థితి. ప్రాథమిక పాఠశాల విద్య పటిష్టతకు ఇవన్నీ భంగకరంగా మారతాయి. దీనివల్ల మళ్లీ కొన్ని రోజుల పాటు బడులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి తప్పదు. తద్వారా ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులు శాశ్వతంగా దూర మయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రమాదపుటంచున ప్రాథమిక విద్య

వీటిపై ఏ ఉపాధ్యాయ సంఘం నోరు మెదపకపోగా, ఖాళీగా ఏర్పడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పోటీ పడి ఓటర్ల నమోదు, ప్రచారంలో తలమునకలై ఉన్నా రు. కంటితుడుపు చర్యగా పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఊరుకుంటున్న తీరు బాధ్యతారాహి త్యం కాదా? ఎస్‌జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడమే నిర్లక్ష్యానికి కారణమా? పైపెచ్చు ప్రాథమిక విద్య ప్రమాదపుటంచుల్లో ఉన్నా.. అంతే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రాథమిక పాఠశాలలు మూసివేస్తే రేపు ఉన్నత పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని ఏ సంఘం కూడా ఆలోచించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంఘ నాయకులందరూ కళ్లు తెరవండి. పాలకులారా.. ప్రాథమిక విద్యకు రాబోవు ప్రమాదాన్ని గుర్తించి డేటా ఎంట్రీ వర్క్‌ను ఉపాధ్యాయులకు కేటాయించకుండా చూ డాల్సిన బాధ్యతనైనా భుజాలపై వేసుకోండి.

చేయని నేరాలకు టీచర్లకు శిక్షలా?

ఒకవైపు సర్వే జరుగుతున్నప్పుడే గ్రామ కార్యదర్శి, సూపర్ వైజర్లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, విద్యాధికారులు, ఎంపీడీవో, కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు సర్వేపై ట్రైనింగ్‌లో సరైన అవగాహన కల్పించకపోగా, పర్యవేక్షణ పేరుతో దినవారీ టార్గెట్ పెంచుకుంటూ వేగంగా చేయాలంటూ ఎస్‌జీ‌టీ‌లపై మానసిక ఒత్తిడి చేసినది కాదనలేని నిజం. ఒకవైపు విద్యార్థులను, ఉపాధ్యాయులను చదువులకు దూరం చేసి పర్యవేక్షణ పేరుతో ఎస్‌జీటీలను మనోవేదనకు గురిచేయబోతుంది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి విద్యార్థుల అభ్యసన స్థాయి పర్యవేక్షణకు పూనుకోబోతుంది. ఎస్‌జీటీ ఉపాధ్యాయులు చేయని నేరానికి శిక్షలు అనుభవించాల్సిందేనా! ఇలా విద్యా సంవత్సరంలో అనేక బోధనేతర పనులను అప్పగిస్తూ ఉపాధ్యాయులను బలిపీఠం ఎక్కించడం భావ్యం కాదు? వెంటనే ప్రభుత్వం ప్రాథమిక విద్యను పటిష్ట పరచడానికి ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించి పూర్తి సమయాన్ని బోధన వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది.

- మేకిరి దామోదర్

95736 66650

Advertisement

Next Story

Most Viewed