బంగారు తల్లులకు బాత్ రూమ్‌లు కట్టరా?

by Ravi |   ( Updated:2024-06-12 17:15:42.0  )
బంగారు తల్లులకు బాత్ రూమ్‌లు కట్టరా?
X

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మౌలిక వసతులు చేపట్టడానికి ఇచ్చిన ఉత్తర్వులు GO Ms No -5 జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఈ కమిటీలు పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించటం కోసం పది అంశాలుగా శ్రీకారం చుట్టాయని చెబుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎంతో ప్రశంసనీయమైనదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది కానీ రాష్ట్రంలో నిన్నటి నుండి బడి గడప తొక్కుతున్న బంగారు తల్లులకు బాత్‌రూమ్ సౌకర్యాలు కల్పించడానికి ముఖ్యమంత్రికి మనసేందుకు రావడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలు -25,331, మాధ్యమిక పాఠశాలలు 6883, ప్రాథమిక & మాధ్యమిక పాఠశాలలు 123, మాధ్యమిక & హైస్కూల్ 202, మాధ్యమిక & సెకండరీ స్కూల్స్ 9937, ప్రాథమిక మాధ్యమిక & మాధ్యమిక సెకండరీ స్కూల్స్ 817... మొత్తం 43,293 వేల వరకు ఉన్న పాఠశాలల్లో 35 వేలకు పైగా పాఠశాలలకు మూత్రశాలలు లేవు. మూత్రశాలలు ఉన్నా వాటిని ఉపయోగించడానికి ఏమాత్రం పనికిరాకుండా తయారైనవి. నీటి సౌకర్యం లేని కారణంగా అనేక విద్యాసంస్థల్లో మూత్రశాలకు తాళాలు పడివున్నాయి. మూత్రశాలలు, నీటి సౌకర్యం కలిగివున్న విద్యా సంస్థలకు స్కావెంజర్ పోస్ట్ లేని కారణంగా తీవ్రమైన దుర్వాసనలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్‌లో సుమారు 30 లక్షల మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మాత్రమే మూత్రశాలల సౌకర్యం ఉన్నదని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.

మూత్రశాలలు దిక్కులేని దేశం

పట్టణ, నగర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థినులకు మూత్రశాలలు లేని కారణంగా వారు చెప్పుకోలేని బాధలకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థినులు చెట్టు పుట్టలు చాటున చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కొన్ని చోట్ల విద్యార్థినులు గోనె బస్తాలతో తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్ధినులకు సైతం తగినన్ని మూత్రశాలు లేవు. రాష్ట్రంలో రెండు వేల హాస్టల్స్ ప్రైవేటు భవనంలో నడుస్తున్నాయి. ఈ భవనాలలో 200 మంది విద్యార్థులకు రెండు బాత్‌రూములు మాత్రమే ఉంటున్నాయి. కొన్నిహాస్టల్స్‌లో విద్యార్థినులు పాత చున్నీలతో మూత్రశాలలను నిర్మించుకుంటున్నారు. మరికొన్నిచోట్ల కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కోడి కూతకన్న ముందే లేచి చెరువులు, వాగులు చెంతకు చేరుతున్నారు. ఇలా ఆరు బయటకు వెళుతున్నప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థినులు విష సర్పాల కాటుకు గురై, నీటి ప్రవాహంలో పడి చనిపోతున్నారు. కొన్ని జిల్లాలలో పాఠశాలలకు వస్తున్న మహిళా టీచర్లకు సైతం మూత్రశాలల సౌకర్యం లేక కేవలం మూత్రశాలల కొరకే స్కూల్ పక్కన గల ఇంటిని అద్దెలకు తీసుకుంటున్నారు 77 సంవత్సరాల పాలనలో భావి పౌరులు మరుగుదొడ్లు లేక, బహిరంగ ప్రదేశాలలో కాలకృత్యాలు తీర్చుకోవడం స్వతంత్ర భారతదేశంలో సిగ్గుపడాల్సిన విషయం.

పేదింటి బిడ్డలకు కనీస సౌకర్యాలు ఏవి?

పాఠశాలలకు హాజరవుతున్న బాలికల సంఖ్య తక్కువ. ఆ కాస్త మంది కూడా చదువు నుండి జారిపోవడానికి మూత్రశాలల సౌకర్యం లేకపోవడం ఒక ప్రధాన కారణం అని అనేక సర్వేలు తెలుపుతున్నాయి అయితే మన పాలకులకు మూత్రశాలలు నిర్మించాలనే స్పృహ కలగడం లేదు. పిడికెడు మంది కొలువుదీరిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండే భవనంలో ముత్రశాలలకు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. కోట్ల నిధులు వెచ్చించి మూత్రశాలలు నిర్మించినట్లు ఈ మధ్య మీడియాలో ప్రసారమైంది. కొంతమంది కోసం ప్రజా ధనాన్ని మంచినీళ్లులాగా ఖర్చు చేసే పెద్దలు. లక్షలాది మంది పేదింటి బిడ్డలకు మూత్రశాలలు నిర్మించటానికి మనసు ఒప్పడం లేదు. విద్యాసంస్థలలో మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోతే కోర్టు తీవ్రంగా మందలిస్తూ ఆరు నెలల్లో అన్ని విద్యాసంస్థలకు మూత్రశాలలూ, మంచినీటి సౌకర్యం కల్పించాలని మళ్లీ ఆదేశించింది.అయినా ప్రభుత్వం కాళ్లు కదపలేదు. ఆడపిల్లగా పుట్టినందుకా మాకు ఇంత 'ఘోష అంటూ విద్యార్థినీలు నిలదీస్తున్నా స్పందించే నాధుడే లేదు. మన పక్కనే తమిళనాడు, పంజాబ్ ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం విద్యా సంస్థలలో మౌలిక వసతులు కల్పించడంలో బాగా వెనకబడిపోయిందని జాతీయ సర్వేలు తెలుపుతున్నాయి.

బాలికల విద్యా భవిష్యత్తుపై శీతకన్ను

విద్యా హక్కు చట్టం వస్తే మన విద్యా సంస్థలకు సకల సౌకర్యాలు వస్తాయని ప్రభుత్వాలు చెప్పాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చి 14 సంవత్సరాలు పూర్తయింది. అయినా పాఠశాలల్లో ఈ మౌలికమైన మార్పులు జరగలేదు. మూత్రశాలల సౌకర్యం మెరుగుపడలేదు. పాలకులకి ఓట్లు రాల్చే పథకాల పైన ఉన్న ప్రేమ బాలికల విద్యా భవిష్యత్తుపై లేకపోవడం దురదృష్టకరం. మన మూత్రశాలల్లో చిట్టి తల్లులకు చింతలు తీర్చేవారు లేకపోవడం ఘోరం. మూత్రశాలల సమస్యల పరిష్కారం కోసం బంగారు తల్లులందరూ భద్రకాళులు కావాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీపై ఒత్తిడి తెచ్చి కనీస సౌకర్యాలకై పోరాడాలి..!

శోభ రమేష్

కాకతీయ విశ్వవిద్యాలయం

89786 56327

Advertisement

Next Story

Most Viewed