దేశ భవిష్యత్ తరగతి గదిలోనే...!

by Ravi |   ( Updated:2024-07-23 01:15:39.0  )
దేశ భవిష్యత్ తరగతి గదిలోనే...!
X

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది' అన్నారు. విద్యావేత్త కొఠారి, మరి దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? విద్యను ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రభుత్వాలు దానిని నిర్వీర్యం చేస్తూ విద్యకు కనీసం ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు. విద్య ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటేనే సమాజం అభివృద్ధి చెంది అక్షరాస్యత శాతం పెరుగుతుంది.

'తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థ రూపురేఖలే మార్చేస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక నూతన విధానాన్ని ఆవిష్కరిస్తాం' అని తెలంగాణ ఉద్యమ సమయంలో గొప్పగా ప్రకటించారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు విద్యను పట్టించుకోవడం లేదని, తెలంగాణ వస్తే విద్య అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పదేళ్లు సీఎంగా పరిపాలించిన కేసీఆర్ ఏ ఒక్క బడ్జెట్‌లోనూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 25వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అయినా విద్యకు నిధుల కేటాయింపు ఏ విధంగా చేస్తుందోనని విద్యార్థి లోకం ఎదురు చూస్తోంది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014-15లో 10.89% నిధులు విద్యకు కేటాయించారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం దానిని తగ్గించుకుంటూ గత బడ్జెట్ నాటికి విద్యకు 6.5%కు కుదించారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా బడ్జెట్‌లో విద్యకు 30% నిధులు కాకున్నా కనీసం 15% నుంచి 20% వరకు కేటాయిస్తే ప్రభుత్వ విద్య బలపడుతుంది. నిధుల కొరతతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లు లేక, స్కావెంజర్లు లేక, పారిశుద్ధ్యం లోపించి, విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తాగునీటి సౌకర్యం అభివృద్ధి చేయాలి. డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి నిధులు కావాలి. 'నైట్ వాచ్ మెన్'ల అవసరం ఉంది. మధ్యాహ్న భోజనం నాణ్యతను ఇంకా పెంచాలి. ఉదయం పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని గత ఎన్నికల ముందు కొన్ని ప్రాంతాల్లో మొదలు పెట్టారు. నేడు మళ్లీ ఆ పథకం అమలు జరగాలి. అల్పాహార పథకం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేసి తగిన నిధులు మంజూరు చేయాలి.

విద్యాసంస్థల్లో నాసిరకం వసతులు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో, సంక్షేమ, గురుకులాలు, యూనివర్సిటీలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో బాత్రూంలు కూడా లేవు. మధ్యాహ్న భోజనం వండడానికి గదులు లేక చెట్ల కింద వంట చేసే పాఠశాలలు అనేకం ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో అటెండర్ల్ కూడా లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెడతామని 2018 ఎన్నికల్లో కేసీఆర్ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా దాని ఊసే ఎత్తలేదు. పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులకి బాసటగా ఉన్న సంక్షేమ హాస్టల్స్‌నీ పట్టించుకోవడం లేదు. పక్కా భవనాలు లేని హాస్టల్స్ రాష్ట్రంలో సగం ఉన్నాయి. చాలా చోట్ల ఒకే భవనంలో రెండు, మూడు హాస్టల్స్ ఉన్న పరిస్థితి హాస్టల్స్‌లో నిత్యం ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. ఇంట్లో ఎలాంటి నాణ్యమైన ఆహారం అందుతుందో అలానే సంక్షేమ, గురుకుల హాస్టల్స్‌లో కూడా విద్యార్థులకు అలాంటి ఆహారాన్ని అందించాలి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా దానికి అనుగుణంగా విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడం లేదు. మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వేలకోట్లలో రీయింబర్స్‌మెంట్ బకాయిలు

ప్రభుత్వం యూనివర్సిటీలను అభివృద్ధి చేయడంలో వాటికి నిధులు కేటాయింపులు చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రతి యూనివర్సిటీ అభివృద్ధికి తగిన స్థాయిలో నిధులు కేటాయించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో వేల కోట్లలో పేరుకుపోయాయి. ప్రస్తుతం విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులపై చదువులకు వెళ్లడానికి సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళ్తే ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామనడం, దీంతో విద్యార్థులు పైసలు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్‌కి సంబంధించి పాతవి, కొత్తవి అనకుండా ఒకే సారి విడుదలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. యావత్ విద్యార్థులు, బడ్జెట్ కళాశాలల వారు ఈ బడ్జెట్‌లో పెండింగ్‌లోని ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల అవుతాయని ఎదురు చూస్తున్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించాలి. లేదా వారికి రవాణా పారితోషికం వాంటివి అందిస్తే బాగుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి బడ్జెట్ కేటాయింపుల్లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు. వారు విద్యారంగానికి బడ్జెట్‌లో నిధులు ఇవ్వడంలో చేసిన నిర్లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం చేయద్దు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది కాబట్టి వారు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి.

కసిరెడ్డి మణికంఠ రెడ్డి,

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

75695 48477

Advertisement

Next Story

Most Viewed