నాటి అధికార మదం ఇంకా దిగలే..

by Ravi |   ( Updated:2024-03-17 01:01:10.0  )
నాటి అధికార మదం ఇంకా దిగలే..
X

గెలుపుతో గర్వం తలకెక్కకూడదు, అలాగని ఓటమితో కుంగిపోకూడదు. కానీ, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ పెద్దల రాజరిక పోకడలు, అధికార మదం ఇంకా దిగిపోలేదని తేటతెల్లమవుతోంది. అధికార పక్షానికి తగినంత పాలనా సమయం ఇచ్చిన తర్వాతే వారి పనితనాన్ని, నిర్ణయాలను విమర్శిస్తే ప్రజల్లో హుందాతనం పెరుగుతుంది లేకపోతే అంతకు మించి ప్రజల్లో పలుచనయ్యే ప్రమాదం లేకపోలేదు.!

చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్టు లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్రతి మీటింగ్‌లో కేటీఆర్ పైన కార్యకర్తలు తమలో నిగూఢమై ఉన్న అసంతృప్తిని, ఆవేశాన్ని వెళ్లగక్కారు. పేరుకు మాత్రమే సమావేశాలు కానీ, ఇక్కడ సమీక్ష జరగకపోగా, కనీసం వీటికి రావడానికి కూడా సుముఖత చూపని కార్యకర్తల్లో, ముఖ్యంగా ఉద్యమకారుల్లో, పార్టీ నిర్మాణం నుండి భాగస్వామ్యం అయి ఆదరణకు నోచుకోక పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన కట్టర్ తెలంగాణ వాదుల తిరుగుబాటుకు వేదిక అయ్యింది. ఇవి ఎంత మేరకు కార్యకర్తల ఇగోను సంతృప్తి పరుస్తాయో తెలియదు కానీ, ఇంకా కేటీఆర్ అనే వ్యక్తిలో అహం తగ్గలేదనే సందేశం మాత్రం తెలంగాణ నలుమూలలు పాకింది.

హైటెక్ లీడర్‌ను దుయ్యబట్టారు

బయటి నుండి సూటుకేసుల్లో నోట్ల కట్టలను కుప్పలుగా పోసిన వారికి మాత్రం ప్రగతి భవన్, ఫామౌజ్ దిడ్డి దర్వాజ గుండా స్వాగతం పలికింది. చూసి చూసి తమలోని అసంతృప్తిని ఎక్కడా 'కక్కలేక మింగలేక' మిన్నకుండిపోయిన కార్యకర్తలు, నిన్నటి వరకు జరిగిన మీటింగ్‌లల్లో తమతో తమ మాజీ ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఎదురుగా ఉన్నారన్న బిడియాలన్ని పక్కనపెట్టి యువ నేత అని పిలుచుకునే హైటెక్ లీడర్‌ను దునుమాడారు, కొంత మేర హరీష్ రావు ఉన్న మీటింగ్‌లల్లో కార్యకర్తలను సముదాయించడంలో సక్సెస్ అయ్యారు. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి ఎన్నడూ కార్యకర్తల బాధను పంచుకోలేదు కానీ ఇప్పుడు వారంలో మూడు రోజులు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటాను ఎవ్వరూ అధైర్యపడొద్దు వంటి వ్యాఖ్యలు చేస్తూ, తాను ఇకపై ఎటువంటి తప్పులు చేయనని వొగల ఏడ్పులు ఏడ్సినా కార్యకర్తలు కనీసం కనికరం కూడా చూపించడం లేదు. యూట్యూబ్ చానెళ్లు పెట్టుకుంటే గెలిచే వాళ్ళమనే కేటీఆర్ చౌకబారు మాటలు మానుకుంటే మంచిది. ఉద్యమాలను ఎప్పటికప్పుడు పురుడోసుకొని ఉద్యమించిన నేలను ఇలాంటి మాటలతో, వారిచ్చిన తీర్పును అవమానిస్తే తెలంగాణ ప్రజల మనసులను ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఏం అర్థం చేసుకున్నట్టు..

కార్యకర్తల్ని పురుగుల్లా చూస్తే...

సంస్థాగతంగా పునాదులను వదిలిపెట్టి, కార్యకర్తలను పూర్తిగా విస్మరించి వారిని పురుగుల కంటే హీనంగా చూసిన దాఖలాలే బీఆర్ఎస్ చరిత్రలో ఎక్కువ. మరీ ముఖ్యంగా అనుబంధ సంఘాల కమిటీలు వేసిన సందర్భాలు కానీ అవి పార్టీకి పట్టు కొమ్మలు అన్న సంగతి మర్చిపోయినందుకే ఎన్నికల్లో పట్టు కోల్పోయి నవ్వినోని ముందు ఊషి పడ్డట్టు అయిపోయింది. మొన్న సమీక్షల్లో కార్యకర్తలకు అండగా ఉండేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామనే ప్రకటన చూసి, ఇంతవరకు తమకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని లీడర్లకు ఇప్పుడు ఇగురం వచ్చిందా అని హైకోర్టు, జిల్లా కోర్టుల్లోని తెలంగాణ ఉద్యమంలో, పార్టీ నిర్మాణంలో భాగస్వాములైన న్యాయవాదులు పడి పడి నవ్వుకుంటున్నారు. కేసీఆర్ తాను తోడుకున్న గుంతలో తానే పడ్డడని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.!

ప్రజలను దూరం పెట్టి దొరే దూరమైండు

కనీసం బహిరంగ సభలో సభ పైనే ఆశీనులైన నియోజకవర్గ స్థాయిలో మంచి పట్టున్న ప్రజాప్రతినిధులను సైతం దూరం దూరం ఉంచి దండం పెడితే అదే అహంకారం నిన్నే తెలంగాణకు దూరం పెట్టింది. ముఖ్యంగా గత ఐదారేళ్లుగా ప్రయివేటు కంపెనీ నడిపించినట్టు పార్టీని నడిపి నట్టేట ముంచారు. పార్టీలో కార్యకర్తలకు కనీసం ప్రైవేటు కంపెనీల్లో లాగా వేతన కూలీలకు ఉన్న గౌరవం గాని, ప్రాధాన్యత గాని ఇవ్వకపోగా జన సమీకరణలో టార్గెట్ ఇచ్చి ప్రచారంలో నమ్మక ఫోటోలను ప్రూఫ్‌లుగా చూపిస్తేనే పనిచేసినట్టు లేకపోతే బహిరంగంగా అవమానపరిస్తే ఆత్మగౌరవం చంపుకొని పక్క పార్టీలోకి పోలేక ఇక్కడ ఇమడలేక కుడితిలో పడ్డ ఎలుకల్లాగా గిల గిల కొట్టుమిట్టాడారు. ప్రజలను ఏలికలు చీదరించుకుంటే వారిని సముదాయించే ప్రయత్నం కార్యకర్తలు చేసి చేసి అలసిపోయి చివరకు చేతులెత్తేసి చేష్టలుడిగిపోయారు.

జనం ఈడ్చి కొడితే కింద పడ్డారు

ఆరు నెలలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటదని తర్వాత ఎలాగైనా కూలిపోతుందని, కూల్చేస్తామని మీడియా ముఖంగా పార్టీ ముఖ్యులు చెబుతుంటే వింటున్న సామాన్య ప్రజలు రెట్టింపైన కోపంతో ఊగిపోతున్నారు, అలా కనుక చేస్తే ప్రజా క్షేత్రంలో ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి ఎగిసి ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి పార్టీ నాయకులకు రాక తప్పదు. నిన్న మొన్నటి వరకు పోటీ పడి అధినాయకత్వం మన్ననలు పొందేందుకు కోట్ల కట్టల సంచులతో బారులు తీరిన కోటీశ్వరులైన లీడర్లు ఎంపీ ఎన్నికల్లో కనీసం పార్టీ ఆఫీసులోకి వస్తందుకే ముఖం చాటేస్తున్న మాట నిజం కాదా. గూడ అంజన్న అన్నట్టు ఎందాక జూద్దామురో ఎల్లన్నోరి మల్లన్నా ఇగ ఎగపడుదామురో.. అని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఆత్రుతగా ఎదురు చూసిన జనం ఆచితూచి తీర్పును ఇచ్చారు.

పిట్ట బెదిరింపులు పట్టించుకోకుండా..

ఇకపోతే కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని 'ప్రజా ప్రభుత్వం' ఏమేం చెయ్యాలో ఏమేం చెయ్యద్దో, ఎందువల్ల ప్రజాగ్రహానికి గురయ్యిందో గతంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ప్రజాస్వామిక పద్ధతిలో నిర్ణయాలు ఉంటే పూర్తి కాలం కొత్త ప్రభుత్వానికి ప్రజలే రక్షణ కవచంగా ఏర్పడి తోడ్పాటును ఇస్తారు. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు కోరలు పీకేసిన పాము అది ఎంత బుస కొట్టినా ఒరిగేదేమీ లేదు, కనుక పిట్ట బెదిరింపులు పట్టించుకోకుండా కేవలం సువిశాల పాలన వైపు దృష్టి సారిస్తూ, సమున్నత లక్ష్యాల సాధనకై అడుగులెయ్యాలి.

ముఖేష్ సామల

హైకోర్టు అడ్వకేట్, పొలిటికల్ అనలిస్ట్

97039 73946

Advertisement

Next Story

Most Viewed