- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు సీట్ల నుంచి 303 స్థానాల వరకు...ఎదురులేని భారతీయ జనతా పార్టీ
ఒకప్పటి భారతీయ జనసంఘ్ (1951-1977), ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనను నిలువరించే చారిత్రక అవసరం కోసం కొత్తగా ఏర్పడిన జనతా పార్టీతో విలీనమైంది. ఆ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచగా, అందులో వాజపేయి, అద్వానీ వంటి జనసంఘ్ ప్రముఖులు కూడా మంత్రులయ్యారు. అయితే, అంతర్గత కలహాలతో ఆ పార్టీ విచ్ఛిన్నమవడంతో జనసంఘ్ ప్రముఖులు దానినుండి బయటకు వచ్చి, 1980లో ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా, దీనికి అనుబంధంగా భారతీయ యువ మోర్చా, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ మహిళా మోర్చా మొదలైనవి పనిచేస్తున్నాయి.
అనితర సాధ్యమైన పయనం
1980 నుండి ఈ పార్టీ బలం ఇంతింతై వటుడింతయై… అన్నట్లుగా పార్లమెంటులో కేవలం రెండు సీట్లతో మొదలై, 2019 ఎన్నికల నాటికి 303 కి (సగం కంటే ఎక్కువ సీట్లు) పెరిగింది. భావ సారూప్యత కలిగిన కొన్ని ఇతర పార్టీలను కూడా కలుపుకొని ఈ పార్టీ ఎన్డీయే (NDA) అనే కూటమిని ఏర్పరచుకొని 1999 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో పాలించింది. తిరిగి 2014 నుండి నరేంద్ర మోడీ ప్రధాని మంత్రిగా పరిపాలిస్తున్నది. 2019 సెప్టెంబరు నాటికి కేంద్రంలోనే కాకుండా 11 రాష్ట్రాల్లో పెద్ద పార్టీగా అధికారంలో ఉంది. 4 రాష్ట్రాల్లో వేరే పార్టీలతో అధికారంలో పాలుపంచుకుంటోంది కూడా.
వాజపేయి పాలనాకాలంలో (1999-2004) సరళీకృత ఆర్థిక విధానం, ప్రపంచీకరణల కొనసాగింపు, ఆర్థిక పురోగతి ముఖ్యలక్ష్యాలు కాగా, మోదీ నేతృత్వంలో 2014 నుండి ప్రాధాన్యాలు మరిన్ని చేర్చబడ్డాయి. వాటిలో కొన్ని - ట్రిపుల్ తలాక్ రద్దు. కాశ్మీరుకు అనవసరమైన ప్రతిపత్తికి సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అంతకు ముందున్న అవరోధాల తొలగింపు. పైవన్నీ ఇప్పటికే సాధించబడ్డాయనే విషయం అందరికీ తెలిసినదే!
శరవేగంగా పథకాల అమలు
ఇక 2019 మేనిఫెస్టోలో పేర్కొనబడి, కులమతాలకు అతీతంగా శరవేగంతో అమలు జరుపబడుతున్న వివిధ అంశాలు ఏమిటంటే...భారత్‌ను 2030నాటికి ప్రపంచంలో ఆర్థికంగా 3వ స్థానంలో నిలబెట్టడం. రామమందిర నిర్మాణం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం. పేద కుటుంబాలన్నిటికీ గ్యాస్ కనెక్షన్లు. ప్రతి ఇంటికీ టాయిలెట్లు, తాగునీటి సదుపాయం. జాతీయ రహదారుల పొడవును రెట్టింపు మేరకు పెంచడం. 2022 నాటికి దాదాపుగా రైల్వేల విద్యుదీకరణ.... ఇంకా మరెన్నో..
'ఆత్మనిర్భర్ భారత్' పేరిట ఎన్నో రంగాల్లో స్వయంసమృద్ధిని సాధిస్తూ, మన ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశగా మన దేశం ఏ విధంగా పురోగమిస్తోందో దేశప్రజలందరికీ నేడు తెలుస్తోంది! ముఖ్యంగా రాకెట్ల, మిసైళ్ళ రంగంలో మనం పెద్ద పెద్ద దేశాలకు కూడా మార్గదర్శకులం కాగలిగాము, అంతే కాదు, ఆ దేశాలకు సాంకేతికంగా మన సలహాలను ఇవ్వగలిగిన స్థితికి వచ్చాము. (ఈ విషయమై యువత కూడా ముందుకు రావడం ఎంతో ముదావహం!)
డిజిటల్ చెల్లింపుల విప్లవం
ఇక 2014 నుండి మన ఎగుమతులు ఎంతో గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ వృద్ధి రేటు ప్రతి సంవత్సరం అనూహ్యంగా పెరుగుతూ ఉంది. మరొకటి - డిజిటల్ పేమెంట్స్ విషయంలో మన ప్రగతిని చూసి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆశ్చర్యపోయేటంతగా మన దేశం పురోగమించింది!
ఇక, కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచంలో సఫలతను సాధించిన దేశాల్లో మన దేశం ప్రథమ స్థానంలో నిలిచిన విషయం అందరికీ తెలిసినదే! అదే సమయంలో ప్రతిపక్షాలు ఏవేవో ఉద్యమాల పేరిట కలిగించిన చీకాకులను తట్టుకుంటూనే, మన దేశంలోని సంస్థలు సమర్థవంతమైన వాక్సీన్లను తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ఎంతగానో దోహదపడింది!
ఇక, మన పొరుగున ఉన్న శత్రుదేశాల కుట్రలను సకాలంలో కనిపెడుతూ మనం తగిన విధంగా చర్యలను చేపట్టడం సమర్థవంతంగా జరుగుతోంది. ఒకప్పుడు వాటికి భయపడిన మనం ఇప్పుడు వాటిని భయపెట్టగలిగిన స్థితికి వచ్చామనడంలో అతిశయోక్తి ఏమీ లేదు!
ప్రపంచ అగ్రగామి నేతగా మోడీ
అంతర్జాతీయంగా గమనిస్తే గత మూడు నాలుగు ఏళ్లుగా ఎన్నో రంగాలలో (క్రీడారంగంలో సహా) మనం అగ్రగామిగా ఉన్నాము. వేరే దేశాలు మనలను శాసించే రోజులు పోయాయి. అంతే కాదు, నానాటికీ విశ్వశాంతికి మార్గదర్శకత్వం కోసం అన్ని దేశాలూ మన దేశంవైపుకే చూస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయసంస్థలు చేపట్టిన సర్వేల్లో అంతకు ముందున్న ఎందరో ప్రముఖులను వెనుకకు నెట్టి, ప్రథముడిగా నిలవడమనేది యావద్భారతానికీ గర్వకారణం!
ఇన్ని విధాలుగా దేశాన్ని వేగోధృతితో నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీకి దగ్గరలో నిలబడగలిగిన పార్టీ ఏదీ ప్రస్తుతం కనుచూపు మేరలో కనిపించడం లేదు. భవిష్యత్తులో ఒక్కొక్కటిగా అవి కనుమరుగవడం ఖాయం. కారణం - ఈ పార్టీల్లో చాలావరకు 'భారతీయత, నిజాయతీ, సామర్థ్యం, క్రమశిక్షణ లోపించడమే!
(నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం)
డా. పద్మా వీరపనేని
బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యనిర్వాహక సభ్యురాలు
90108 33999