- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఎవరిది ధృతరాష్ట్ర కౌగిలి..
మట్టి ఎర్రబారి, నెత్తురు ఏరులైపారి, సైనికులు శవాలయేదాకా పోరి, యుద్ధభూమి మరుభూమిగా మారి...కళింగ కదనరంగం కళ్ల జూసిన ఆశోక చక్రవర్తి గెలిచి కూడా కన్నీరు మున్నీరుగా దుఖించిన దేశం మనది. కాలం మారి యుద్ధం పద్దతుల్లో తేడాలు తప్ప నేటికీ రాజకీయ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవంటారు! సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఓ అరడజను పార్టీలు ఆడుతున్న నాటకం తెలుగునాట, అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది. వారి ఎత్తులు, జిత్తుల్లో ఎవరు ‘సేఫ్‌జోన్’లోకి వెళుతున్నారు? మరెవరు ఇంకెవరి ధృతరాష్ట్ర కౌగిలిలోకి జారుతున్నారు ఏడాదిలోనే జరగాల్సిన మూడు ఎన్నికల ‘గీటురాయి’ మీద తెలుగు ప్రజలు తేల్చనున్నారు. ఈలోపు బోలెడు వినోదం జనాలకు ...
తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో ఢిల్లీలో భేటీ కావడం రాజకీయాల్లో వేడి పుట్టించింది. వైఎస్‌ఆర్‌సీపీ విముక్త ఏపీ అంటూ జనసేనాని పవన్‌కల్యాణ్ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇంటివాకిటి నుంచే హూంకరించడం పాత సమీకరణాలకు కొత్త బలం చేకూర్చింది. నిన్నటిదాకా విరుచుకుపడిన బీజేపీని కాదని, తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు నిర్మల్‌లో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ తీరు, స్వరం మార్చిన వైనం కొత్త సంకేతాలిచ్చింది. తెలుగునాట రాజకీయ పార్టీల బలాబలాల్లో హెచ్చుతగ్గులు, రాజకీయ పునరేకీకరణల్లో మార్పులు తప్పవేమో అనిపిస్తోంది. తమకు తాము మెరుగుపరుచుకుంటున్నాం అనుకుంటూనే కొందరు చిక్కుల్లో పడుతుంటే, ఆ చర్యల ఫలితంగా మూడోపక్షం అయాచితంగా లబ్దిపొందే వాతావరణం బలపడుతోంది. బీజేపీ, టీడీపీ అగ్రనేతల తాజా భేటీ రాజకీయ పొత్తులకు దారితీస్తే...అది ఉభయులకూ నష్టమేతప్ప లాభంలేదనే అభిప్రాయం ప్రజాక్షేత్రంలో వ్యక్తమవుతోంది.
ఎందుకీ భేటీ..
చంద్రబాబు కదలికలు ఎవరికీ విస్మయం కలిగించకపోయినా...ఏమాశించి బీజేపీ బాబుతో ఈ భేటీ జరిపిందనే ఆశ్చర్యం రాజకీయ వర్గాల్లో ఉంది. ఏపీలో ‘నోటా’ కన్నా తక్కువ ఓట్లున్న బీజేపీకి సంస్థాగతంగా, పొత్తులు పెట్టుకొని ఎదగాలన్న ఆశలేదు. ఎదిగే అవకాశమూ లేదు. తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కూడా ఏపీలో ఎదిగే ప్రమాదమూ లేదు. మరి ఇప్పుడు సఖ్యతగా ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి చెందిన వైసీపీని కాదని, మరెందుకు టీడీపీతో కొత్త నెయ్యం? కర్ణాటక పరాభవం తర్వాత..ఎందుకైనా మంచిది వీలయిన అన్నీ ప్రాంతీయ శక్తులతోనూ సఖ్యత నెరపాలనే వ్యూహమా? ఎంత చేసినా తెలంగాణలో బీజేపీ ఎదగటం లేదు, అక్కడ టీడీపీ సహాయం తీసుకొనైనా కేసీఆర్‌ను కొట్టాలనే ఎత్తుగడా.. రెంటిలో ఏది కారణమైనా బీజేపీ అగ్రనాయకత్వం ‘తప్పు’లో కాలేసినట్టే! ఏపీలో బీజేపీ కొత్తగా పొందేదీమీ లేదు. నిజానికి చంద్రబాబుకన్నా బీజేపీకి జగన్మోహన్‌రెడ్డి రాజకీయంగా ఆధారపడదగ్గ నేస్తం కాగలరు. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి కూడా రాజకీయంగా ఒరిగే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. పైపెచ్చు నష్టమే! ఏ ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపంతో బీజేపీకి దూరమయ్యారో...ఆ విషయంలో ఏమార్పు లేకున్నా అవకాశవాదంతో మళ్లీ చంకలో చేరారన్న నింద తప్పదు.
తెలంగాణలోనూ టీడీపీతో బీజేపీకి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ కలయికను కేసీఆర్ తిట్టడం ప్రారంభిస్తే... టీడీపీ పొత్తుతో 2018లో కాంగ్రెస్ భంగపోయిన చేదు అనుభవమే ఈసారి బీజేపీకి తప్పకపోవచ్చు. ‘‘ప్రాంతీయ పార్టీలతో పొత్తు విషయాలు బీజేపీ రాష్ట్ర యూనిట్లే నిర్ణయిస్తాయి, మాకు తెలిసి తెలంగాణలో టీడీపీతో పొత్తు లేదు’’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నా...లోలోపల ఆయనకూ టీడీపీ సహాయం తీసుకోవాలనే ఉన్నట్టు ప్రచారంలో ఉంది. అదే జరిగితే... బయటి నుంచి వచ్చి ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న పలువురు నేతలు, టీడీపీతో పొత్తును వంకచూపి, పార్టీకి సెల్యూట్ కొట్టడం ఖాయం!
కేసీఆర్ స్వరం మార్పు అందుకేనా..
తెలంగాణలో బలపడకపోగా బీజేపీ మరింత బలహీనపడుతోందని కేసీఆర్ భావిస్తున్నట్టుంది. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ అభిప్రాయం మరింత బలపడి ఉంటుంది. అందుకే కాంగ్రెస్‌పై ఒంటికాలిమీద లేచారు. అలా అని రాష్ట్రంలో బీజేపీ మరీ చతికిల పడటం కూడా ఆయన కోరుకోరు. ఎందుకంటే, దానివల్ల ఆ శూన్యంలోకి విస్తరణతో కాంగ్రెస్ మరింత బలపడితే తనకు ప్రమాదం. దానికి సంకేతమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘తెలంగాణలో బీజేపీని ఖతం చేస్తున్నాం’ అని అమెరికా నుంచి చేసిన ప్రకటన. ఇది తెలంగాణలో బీజేపీ గ్రహించవలసిన వాస్తవం. ఎంతోకాలంగా ఆశతో నిరీక్షిస్తున్న ‘చేరికలు’ లేకపోగా, వచ్చినవారు వెళ్లిపోయే ఏర్పాట్లలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో టీడీపీతో బీజేపీ పొత్తు ఏ విధంగానూ లాభించదు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలూ ముక్కోణపు పోటీలనే కోరుకుంటారు. ఏ కారణం చేతైనా బీజేపీ ఓటు శాతం పదికన్నా తగ్గితే తెలంగాణలో కాంగ్రెస్ పాలకపక్షమైన బీఆర్‌ఎస్‌కు ప్రమాదకారిగా మారుతుంది. అయిదారు మాసాల అంతరంతో జరిగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది బీజేపీకి కూడా ఇబ్బంది కలిగించే పరిణామమే అవుతుంది. తెలంగాణ మనోభావాల అంశం తెరపైకి వస్తే టీడీపీతో పొత్తువల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. 2018లో సీఎస్‌డీఎస్`లోక్‌నీతి జరిపిన ప్రీ`పోల్ సర్వే ప్రకారం..నాటి టీడీపీ`కాంగ్రెస్ పొత్తును 10 శాతం మంది ఇష్టపడితే, 20 శాతం మంది పూర్తి అయిష్టత వ్యక్తం చేశారు. ఫలితాల్లోనూ ఇది ప్రతిబింబించింది.
జడుపువల్లా.. గెలుపు కోసమా..
బాబు తానే కోరి వెళ్లారా లేక అమిత్‌షా పిలుపునందుకొని హాజరయ్యారా అన్నదాంట్లో ఏది నిజమైనా, భేటీ కాదనలేని నిజం! ఇద్దరిమధ్య పొత్తు ఉంటుందా అన్నది ఇంకా నిర్ణారణ కాని అంశం. వచ్చే ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పరమైన రాజకీయ ప్రయోజనం కన్నా బాబు ఇంకేదో ఆశిస్తున్నట్టుంది. ఈ సఖ్యత ద్వారా జగన్‌ను బీజేపీకి దూరం చేసి, తాను దగ్గరవటాన్ని ఎక్కువ ప్రయోజనకారిగా ఆయన భావిస్తున్నట్టుంది. బీజేపీ, వైసీపీలు పొత్తు లేకున్నా సఖ్యతతో ఉంటే..వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయో, వైసీపీ అధికార పక్షంగా ఆగడాలకు దిగితే తనకు కష్టమేమో అన్న భయం బాబుకున్నట్టుంది. చంద్రబాబు అనుకూల వర్గం ఇదే ప్రచారం చేస్తోంది. బీజేపీలోనూ బాబుకు సంపూర్ణ మద్దతు లభించదు. ఏపీ బీజేపీలో మొదట్నుంచి బాబుకు వత్తాసు పలికేది ఒక వర్గమైతే, ఉనికే గిట్టక బాబును నిరంతరం తిట్టిపోసేది ఇంకో వర్గం. జనక్షేత్రంలో ఓట్ల మార్పిడి కూడా వారిద్దరి మధ్య అంత తేలికగా జరగదు. మరోపక్క, టీడీపీ-బీజేపీ పొత్తు అంటూ కుదిరితే వైసీపీకి దారి స్పష్టమౌతుంది. కేంద్రంలోని బీజేపీతో సఖ్యత వల్ల, ఇప్పటివరకూ ఎన్నో ప్రజావ్యతిరేకత విధానాలపై గొంతెత్తలేని పరిస్థితితో రాజకీయంగా వైసీపీ కొంత నష్టపోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఇందుకొక నిదర్శనం. పొత్తంటు కుదిరితే ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వంటి కీలక అంశాల్లో...టీడీపీ గొంతుమూగబోయి వైసీపీ గొంతు పెరిగే పరిస్థితులుంటాయి. ‘ఓటు చీలనివ్వను’ అన్న తన నినాదం బలపడ్డా కొత్త పొత్తులతో జనసేనాని పవన్ మరింత ‘మైనర్ పార్టనర్’గా రాష్ట్ర రాజకీయాల్లో ఇంకింత ‘పరిమితం’ అయ్యే అస్కారం బలంగా ఉంటుంది.
గత అనుభవాల దృష్ట్యా రాజకీయంగా నమ్మదగ్గ భాగస్వామి కాలేని చంద్రబాబు స్నేహం తెలంగాణలో బీజేపీకి ధృతరాష్ట్ర కౌగిలే! రాజకీయ వ్యంగ్య బాషణల్లో ఏపీలో ఇప్పటికే బలంగా ఉన్న బీజేపీ (బాబు, జగన్, పవన్) ఇంకే రాజకీయ ప్రయోజనాలు ఆశించి బాబుతో నెయ్యం అందుకోవాలని చూస్తోంది భవిష్యత్ ఆశల పరంగా చూసినా, గత అనుభవాల అవకాశవాదాల పరంగా చూసినా..తెలంగాణలో బాబు బీజేపీకి ఒక భారమైతే, బాబుకి ఏపీలో బీజేపీ భారం. మొత్తం మీద రాజకీయంగానే పరిశీలిస్తే బీజేపీ పొత్తు బాబుకు ఒక దృతరాష్ట్ర కౌగిలే!
-దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ
9949099802