- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొత్తు పొడిచింది... మార్పు తథ్యం
తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది. ఈ కలయిక రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభద్రతాభావం, భయం పోగొట్టి నైతికస్థైర్యం నింపుతుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఓట్ల చీలికల వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి పవన్ కల్యాణ్ చొరవ చూపారు. బీజేపీ నుంచి సరైన స్పందన రానప్పటికీ పవన్ కల్యాణ్ ఎక్కడా తన వంతు ప్రయత్నం ఆపలేదు. ఏపీలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. కానీ అధికార మార్పిడే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందుకుసాగారు. దీంతో సరికొత్త రాజకీయ పునరేకీకరణకు పునాది పడింది. రాష్ట్ర శ్రేయస్సును కోరి భావసారూప్యం కలిగిన వ్యక్తులు, పార్టీలు ఒక తాటిపైకి వచ్చాయి.
ప్రజాస్వామ్యంలో పొత్తులు అత్యంత సహజం. ఇది ఆయా పార్టీల అంతర్గత వ్యవహారం. పొత్తులు చూసి వైసీపీ ఎందుకు భయపడుతోంది? సింహం సింగిల్ గా వస్తుందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన జగన్ రెడ్డి.. పొత్తులు విచ్ఛిన్నం చేయడానికి తన శక్తివంచన లేకుండా పనిచేశారు. పొత్తులు కుదరకుండా ఉండేందుకు రాష్ట్రంలో తన అనుకూల బీజేపీ నాయకులను ప్రయోగించారు. అవి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగి పలుమార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అవేమీ ఫలించలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక అవగాహనతో మిత్రభేదాన్ని పాటించారు.
రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానం
బీజేపీతో పొత్తు వల్ల కొన్ని సానుకూల, మరికొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో మోడీకి ఉన్న చరిష్మా, హిందుత్వవాదం రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఎంతోకొంత ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నారు. బీజేపీ సైతం ఈ సారి ఎన్నికల్లో 400 పార్లమెంట్ స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. దానికి అనుగుణంగా పాతమిత్రులను ఎన్డీయేలో చేరాలని ఆహ్వానించారు. దీంతో తెలుగుదేశంతో జనసేన, బీజేపీ చేతులు కలిపాయి. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ పొత్తులో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప రాజకీయ ప్రయోజనాలు ఏమాత్రం లేవని మిత్రపక్షాలు చెబుతున్నాయి.
త్యాగశీలి పవన్..
ప్రభుత్వ వ్యతిరేక ఓటును బ్యాలెట్ బాక్స్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని పార్టీలు సమిష్టిగా తీసుకోవాలి. ఓట్లు బదిలీలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించి పొత్తు దిశగా ఓటర్లను సన్నద్ధం చేయడం అంత తేలికకాదు. దానికి ముందు పొత్తుల ఆవశ్యకతపై ఆయా పార్టీలు తమ శ్రేణులకు దిశానిర్దేశం చేసి కార్యోన్ముఖులను చేయాలి. బీజేపీతో పొత్తులో జరిగిన జాప్యం ఓట్ల బదిలీపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఈ పొత్తులను రాష్ట్ర బీజేపీలో అధికశాతం మంది నాయకులు ఆహ్వానిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ఒక్కశాతం ఓట్లు లేని బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు, ఆరు లోక్ సభ స్థానాలు కేటాయించారు. దీనికోసం జనసేన మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేశారు. పవన్ కల్యాణ్ పొత్తు నిలవాలి-గెలవాలి అని మొదటి నుంచి ఆరాటపడుతూనే ఉన్నారు. మొదటి విడతలో జనసేనకు కేటాయించిన 24 సీట్లకే ఆ పార్టీ శ్రేణులు కొంత అసంతృప్తికి లోనైనప్పటికీ పవన్ కల్యాణ్ సర్దిచెప్పుకున్నారు.
సానుకూలత లేని పొత్తుతో సవాళ్లు
ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రాష్ట్రంలో, దేశంలో ఒకే తరహా పాలన సాగుతోందనే భావన రాష్ట్ర ప్రజానీకంలో బలంగా ఉంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని, గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందనే భావన ప్రజల్లో ఉంది. రుణపరపతిపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఆంధ్రప్రదేశ్‌ను రుణాల ఊబిలో నెట్టేందుకు తమవంతు సహకారాన్ని అందించారు. పైగా బీజేపీతో పొత్తు వల్ల ముస్లీం మైనార్టీ ఓట్లకు కొంతమేర గండిపడే ప్రమాదం ఉంది. దీనికితోడు పౌరసత్వ సవరణ చట్టం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఓట్ల పరంగా బీజేపీ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, గత ఎన్నికల్లోనే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని, ఓట్ల బదలాయింపు కూడా అంత సులభంగా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం అభివృద్ధి అంటేనే సరిపోదు.. పొత్తులపై రాజకీయ ప్రాతిపదిక ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రజల్లో బీజేపీ పట్ల అంతగా సానుకూలత లేనప్పుడు టీడీపీ-జనసేన ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారో వేచిచూడాలి.
పొత్తులపై చాణక్యం ఫలించినట్లేనా?
పొత్తులపై చంద్రబాబు చాణక్యం ఫలించింది. పొత్తుల వల్ల సీట్ల సర్దుబాటులో టీడీపీకి కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. మిత్రపక్షాలకు కేటాయించే స్థానాల్లో గత ఐదేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ల రూపంలో తమ సమయాన్ని, ఆర్థిక వనరులను వెచ్చించి అధికారపక్షంపై పోరాటాలు చేశారు. వారి త్యాగాలకు, శ్రమకు అసలు గుర్తింపు ఉంటుందా? వీటిన్నింటిని ఎలా పరిష్కరిస్తారు? రాష్ట్రంలోని కొన్ని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిర్ధిష్ట హామీలు ఇవ్వకపోతే ఆశించిన ఫలితాలు చేకూరవు. పొత్తుల్లో హేతుబద్ధత లోపించినా, మిత్రభేదాన్ని వీడినా ప్రత్యర్థికి లాభం చేకూరుతుంది. అన్ని పార్టీలు కూడా ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహించాయి. దీనిని ఓటర్లు ఎలా స్వీకరిస్తారో వేచిచూడాలి. ఓట్ల బదిలీ సక్రమంగా జరగకపోయినా, ఆయా పార్టీల కార్యకర్తలను, నాయకులను పొత్తుల దిశగా సన్నద్ధం చేయకపోయినా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ప్రత్యర్థుల చేతుల్లో పావులుగా మారకుండా మిత్రపక్షాలు అప్రమత్తంగా ఉంటే మార్పు తథ్యం.
మన్నవ సుబ్బారావు
99497 77727
- Tags
- BJP-JANASENA-TDP