మీడియా స్వేచ్ఛను హరిస్తున్న బీజేపీ!

by Ravi |   ( Updated:2023-10-10 14:15:54.0  )
మీడియా స్వేచ్ఛను హరిస్తున్న బీజేపీ!
X

దేశ విదేశాల్లో, స్థానిక ప్రభుత్వాల్లో, మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఏమి జరుగుతుందో కఠిన వాస్తవాలను ప్రజల ముందు సాక్షాత్కరింపజేయడమే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల విధి. ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేయడం, వ్యవస్థాపరమైన లోపాలను ఎండగట్టడం, ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక... ఇతరత్రా అనేక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకపోవడమే మీడియా కనీస బాధ్యత. ఏ దేశంలోనైనా మీడియా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేయగలగడమే ప్రజాస్వామ్య వ్యవస్థకు గీటురాయి. గత ఏప్రిల్ నెలలో భారత అత్యున్నత న్యాయస్థానం మళయాళ వార్త ఛానల్ 'మీడియా ఓన్' పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కొట్టివేసింది. తగిన సాక్షాధారాలు ఏమీ లేకుండా జాతీయ భద్రతా ముసుగులో మీడియా హక్కులను,ప్రజల మానవ హక్కులను హరించడం తగదని ప్రభుత్వానికి హితవు చెప్పింది.

సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా మీడియా స్వేచ్ఛ పై తీర్పు ఇచ్చినా మొన్న ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం పత్రికా స్వేచ్ఛ పై మరోసారి దాడి చేసింది. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ 'న్యూస్ క్లిక్' కార్యాలయం పైన, సంబంధిత జర్నలిస్టుల ఇళ్లలో మొన్న మంగళవారం అది విస్తృతంగా సోదాలు చేపట్టింది.ఈ న్యూస్ క్లిక్ వ్యవస్థాపక ఎడిటర్ 76 ఏళ్ళ ప్రబీర్ పురకాయస్థను, దివ్యాంగుడైన ఆ సంస్థ మానవ వనరుల విభాగాధిపతి అమిత్ చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రమంలోనే మీడియాకు సంబంధించిన అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా ఆఫీసుకు తాళం వేశారు. దీనిపై ప్రపంచమంతటా విమర్శలు చెలరేగుతున్నాయి.

ఒక్క ఆధారం లేకున్నా..

'న్యూస్ క్లిక్' వార్తా ఛానల్ 2009లో ప్రారంభమైంది. నిష్పాక్షిక, విమర్శనాత్మక జర్నలిజానికి ప్రాధాన్యత ఇచ్చిన వార్తా వేదికగా ప్రజా హృదయాల్లో గుర్తింపును, గౌరవాన్ని పొందింది. వివాదాస్పద సాగుచట్టాలపై రైతుల నిరవధిక నిరసనలతో పాటు, ప్రభుత్వ అధికారులు, పార్టీ నేతలు, ధనిక వర్గాలకు మింగుడు పడని అనేక అంశాలపై అది విరివిగా వార్తా కథనాలను ప్రజలకు అందించింది. ఇది అధికార బీజేపీ పార్టీకి కొరుకుడు పడలేదు. దీంతో ఇలా న్యూస్ క్లిక్ యాజమాన్యం పైనా, సిబ్బందిపైన పోలీసులు పలుమార్లు దాడులు చేయడం, వెంటాడటం రాజ్యాంగబద్ధమైన పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించటమే అవుతుంది. గతంలో కూడా మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్, ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం రెండేళ్లు క్రితమే ఆ వెబ్ పోర్టల్ కార్యాలయాలం పైన, సిబ్బంది నివాసాలపైన సోదాలు చేశాయి. ఆఫీసులో ఉన్న అన్ని వస్తువులను జప్తు చేశాయి. ఆ సంస్థకు సంబంధించిన అన్ని అకౌంట్ లావాదేవీలను నిశితంగా పరిశీలించాయి కూడా. అయినా న్యూస్ క్లిక్‌పై నేరాలకు పాల్పడినట్లు నిరూపణకు తగిన సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థలు ఇంతవరకు నిరూపించలేక పోయాయి.

అయితే ఈ న్యూస్‌క్లిక్ మాత్రం ఇది ప్రభుత్వంపైన మేము చేస్తున్న విమర్శలను రాజద్రోహంగా, జాతి ద్రోహంగా ప్రభుత్వం భావించి తమపై ఉద్దేశపూర్వకంగానే కక్ష కట్టిందని న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్ విమర్శిస్తుంది. న్యూస్ క్లిక్ పైన, దాని సంపాదకులు ప్రబీర్ పైన కఠిన చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ హైకోర్టు సైతం 2021లో పోలీసులకు ఆదేశించినా, భారతదేశంలో చైనాకు వత్తాసు పలికేందుకు డబ్బు తీసుకుంటోంది అంటూ ఆరోపిస్తూ, మొన్న ఆగస్టులో న్యూస్ క్లిక్స్‌పై ఢిల్లీ పోలీసులు 'ఉపా' కేసు మోపారు. ఇది అప్రజాస్వామికంటూ జర్నలిజాన్ని ఉగ్రవాదంతో జమ కట్టే చర్యను నిరసిస్తూ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలు పాత్రికేయ సంఘాలు రాసిన లేఖ మన దేశ అప్రజాస్వామ్య పోకడల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ చాలామంది జర్నలిస్టులపై, ప్రతీకారం తీర్చుకొనేలా తప్పుడు కేసులు పెట్టడాన్ని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్ళింది.

మీడియా స్వేచ్ఛ రాజ్యాంగంలోనిదే!

సామాజిక వ్యవస్థలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అది సహజం. వాటిని గౌరవించటం ప్రజాస్వామిక ప్రాథమిక లక్షణం. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మీడియా స్వేచ్ఛను విధిగా గౌరవించాలి. ఇది ప్రజలకు, మీడియాకు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను భారత రాజ్యాంగమే ఇచ్చిందనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా గత 9 ఏళ్లలో 200 మంది జర్నలిస్టులపై పాశవిక దాడులు చేశారు. వారిలో 40 మందిని హత్య చేశారు. (ఇంతవరకు హంతకుల ఆచూకీ పోలీసులకు దొరకలేదు) నిజానిజాలను ప్రజలకు నిర్భయంగా నిర్వహించే పత్రికలపై వేధింపులకు ఒడిగట్టడం, దేశ ద్రోహం కేసులు బనాయించడం అన్యాయం. ఇప్పటికే అంతర్జాతీయ సూచీలలో మానవ హక్కులు, పౌర హక్కుల పరిరక్షణ విషయంలో, ఆకలి సూచీలో, పేదరిక నిర్మూలన విషయంలో భారత దేశ ప్రతిష్ట గణనీయంగా దిగజారింది. దీనికి తోడు ప్రపంచ పాత్రికేయ స్వేచ్ఛ సూచీలో భారత ర్యాంకు పాతాళానికి దిగజారిపోతోంది. 2016లో ఆ సూచీలో 180 దేశాలకు గాను 133వ, స్థానంలో నిలిచిన ఇండియా... గత సంవత్సరంలో 150వ ర్యాంకుకు పడిపోయింది. ఈ సంవత్సరం మరో 11 స్థానాలు పతనమై ... జాబితాలో 161వ దేశంగా నిలిచి పరువు పోగొట్టుకుంది. మనకంటే నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ తదితర చిన్న దేశాలు స్వతంత్ర జర్నలిజానికి వెన్నుదన్నుగా నిలిచి మనకన్నా మంచి ర్యాంకులు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు ఇది ఏ విధంగాను గౌరవప్రదం కాదు. పత్రికా స్వేచ్ఛ లేకపోతే ఆదేశం నియంతృత్వానికి దారి తీస్తుంది. అప్పుడు ప్రజల జీవితాలు మరింత దుర్భరం అవుతాయి.

పాత్రికేయమంటే సమస్యలు వైఫల్యాలను వ్యక్తులు ఎండగట్టడమేనని జస్టిస్ ఎన్.వి. రమణ. నిజాలు మాట్లాడకుండా మీడియాను నియంత్రిస్తే ప్రజాస్వామ్య ప్రతిష్ట మసకబారుతుందని ప్రస్తుత సీజేఐ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. జర్నలిస్టులపై, ప్రజాస్వామిక వాదులపై, మానవ హక్కుల కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా మనదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో జర్నలిస్టు యూనియన్‌లు, ప్రజాస్వామిక వాదులు, పలు సంస్థలు నిరసన ర్యాలీలు చేపట్టారు. దేశ, విదేశాలలో వారికి మద్దతు లభిస్తోంది.

డా. కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Advertisement

Next Story