దేశంలో సాంస్కృతిక విధ్వంసం!

by Ravi |   ( Updated:2023-09-20 00:31:17.0  )
దేశంలో సాంస్కృతిక విధ్వంసం!
X

భారతీయుల జీవన వ్యవస్థల మీద ప్రస్తుతం మతతత్వ శక్తులు విధ్వంసకర కాలనృత్యం చేస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్, హిందూ మహా పంచాయితీలు, బీజేపీ.. వంటివి భారతదేశంలో సాంస్కృతిక విధ్వంసాన్ని సాగిస్తున్నాయి. హిందూ మతోన్మాదం నానాటికీ పెచ్చరిల్లుతోంది. ముస్లింల మీద తీవ్రమైన అఘాయిత్యాలకు పాల్పడుతోంది. ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశ ప్రజలు కారు అని నిస్సిగ్గుగా వక్కాణిస్తుంది. నిజానికి ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్ర భారతదేశ మొదట నిషేధిత సంస్థ. వీటన్నిటికీ కారణం ఆర్‌ఎస్‌ఎస్ రూపకర్త ఒకడు అయిన గోల్వాల్కర్. హిందువులు ఒక్కరే ఈ దేశంలో పుట్టారన్నారు ఆయన. నిజానికి హిందూ శబ్దం భారతీయ కాదు. హిందూ శబ్దం సింధు శబ్దం యొక్క అపభ్రంశ రూపం. అంతేగాక పారశీకులు సింధు అని పలకలేక హిందూ అని పలికారు. హిందూ శబ్దం వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, బ్రాహ్మణాలలో ఎక్కడ లేదు. భారత భాగవతాల్లో కూడా లేదు. శ్రీకృష్ణుడు నేను యాదవున్ని అని చెప్పుకున్నాడు కానీ హిందువుని అని చెప్పుకోలేదు. శ్రీరాముడు నేను క్షత్రియున్ని అని చెప్పుకున్నాడు కానీ హిందువునని చెప్పుకోలేదు. హిందువులు కొలిచే ఏ దేవుడూ నేను హిందువుని అని చెప్పుకోలేదు. హిందూ శబ్దం కృత్రిమమైనది. ఇది భారతీయమైన శబ్దం కాదు. ఇది భారతీయ భాషల్లో ఎక్కడా లేదు. నిజానికి భారతీయ జనతా పార్టీకి హిందూ జనతా పార్టీగా పేరు పెట్టుకునే ధైర్యం లేదు. భారతీయులు లౌకికవాదులు, అనేక జాతుల, సంస్కృతుల, జీవన విధానాల సమ్మెళనంతోనే భారతీయులు రూపొందారు.

హిందువులది ఏక జాతి కాదు!

నిజానికి కులాంతర వివాహం అనేది రాజ్యాంగ బద్ధమైన చర్య. మరి కులాంతర, మతాంతర బాధితులను ఆర్ఎస్ఎస్ మూకలు ఎందుకు వధిస్తున్నారు ఎంతోమంది దళిత విద్యార్థులను అగ్రవర్ణాల, అగ్రకులాల వారిని ప్రేమించారని నెపంతో దారుణంగా చంపి కులాంతర వివాహ వ్యవస్థను ధ్వంసం చేయాలని చూస్తున్నారు. నిజానికి భారతీయ ఋషులందరుగా చెప్పబడుతున్న వారు ఎవరిని వివాహమాడారు వశిష్ఠుడు అరుంధతిని పెళ్లాడలేదా? మనం చరిత్రలోనికి వెళ్తే అంబేద్కర్ అన్నట్లు భారతదేశమంతా సంకరజాతే. ఆ విషయాన్ని ఒప్పుకోలేక హిందువులందరూ ఒక జాతి అని చెప్పుకున్నారు. ఇకపోతే ఈ వంశతత్వం, జాతి తత్త్వం, వర్ణ తత్త్వాలే భారతదేశంలో విభిన్న జీవన విధానాలకు పునాదులు వేసాయి. ఈ దేశానికి ఆర్యులు, పారశీకులు, యవనులు, శకులు, కుషానులు, హుణులు, అహోములు, అరబ్బులు, తురుష్కులు ఇంకా ఎందరో వచ్చి స్థిరపడ్డారు. జాతి వైవిధ్యం, భాషా వైవిధ్యం అందువల్లనే కొట్ట వచ్చినట్లు కనబడుతోంది. 280 భాషలు, 500 మాండలీకాలు వాడుకలో వున్నాయి. జాతి ద్వేషం, భాషా ద్వేషం, కుల ద్వేషం, ప్రాంతీయ ద్వేషం, మాండలిక ద్వేషం, మత ద్వేషాలతో నిరంతరం పోట్లాడుకుంటూ వున్న దేశాన్ని గూర్చి అంబేద్కర్ లోతుగా సామాజిక సమతా భావనలను విశ్లేషణాత్మకంగా వివరించారు.

కుల నిర్మూలన అలాగైతేనే సాధ్యం!

కులాన్ని ఆధునికంగా పరిశోధిస్తున్న పరిశోధకులు వెలువరిస్తున్న చారిత్రక సత్యాలన్నిటికి పునాదులను అంబేద్కర్ కూర్చారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తన అపూర్వ పరిశోధనలో తేల్చిన అంశం అస్పృశ్యత కుల నిర్మూలన కాకుండా నాశనం కాదు. హిందూ మత సారం నిర్మూలింపబడకుండా కులం తనంతటతాను నిర్మూలించబడదు. అందువలన సాంఘిక విప్లవం ద్వారా కులాన్ని, అస్పృశ్యతను నిర్మూలించాలని ఆయన సిద్ధాంతీకరించారు. ఈ శాస్త్రీయ సిద్ధాంతానికి హిందూ సమాజమంతా తల్లడిల్లింది. దీనికి ప్రత్యామ్నాయంగా బౌద్ధ మతాంతరీకరణ చెందాలనే అంబేడ్కర్ పిలుపు మొత్తం మౌఢ్య కుడ్య ప్రాకారాలను కుదిపివేసింది. కుల నిర్మూలమైన ప్రధానమైన పరిష్కారం రక్త సమ్మేళనం. ‘కులాంతర, వర్ణాంతర వివాహ ఆచరణ కుల నిర్మూలనకు ‘ప్రధాన వాహిక’ అని అంబేడ్కర్ చేసిన సిద్ధాంతాలకు హిందూ ధార్మిక లోకం హతాహతం అయ్యింది. ఈ సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయ ప్రబోధాన్నివ్వాలని గాంధీ ప్రయత్నం చేశారు. 1936 ఆగస్టు 15న గాంధీ అంబేద్కర్ ‘కుల నిర్మూలనా’ సిద్ధాంతాన్ని విభేదిస్తూ ఇలా వ్రాశారు. ‘వర్ణం, ఆశ్రమం అనేవి కులాలతో సంబంధం లేని వ్యవస్థలు, వర్ణం చెబుతున్నదేమిటంటే అనువంశీకమైన వృత్తులను అనుసరించి ఎవరి తిండిని వారు సంపాదించుకోవాలని, మన హక్కుల్ని కాక, మన బాధ్యతల్ని వర్ణ ధర్మం నిర్వచిస్తుంది. మానవ సంక్షేమానికి అనుకూలంగా వుండే వృత్తులను ప్రతి మానవుడు అనుసరించాలని దీని ఉద్దేశ్యం.

వర్ణధర్మంలోనూ పక్షపాతమే!

గాంధీ ఆలోచనలను అంబేద్కర్ ఆనాడే ఖండించాడు. మీరు వైశ్యులయినప్పుడు మీరు వ్యాపార వృత్తినే చేయాలి కదా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అంతేకాదు జవహర్ నెహ్రూ కాశ్మీరీ పండిట్ కదా! పౌరోహిత్యం చేయకుండా ప్రధానమంత్రిని ఎందుకు కోరుకుంటారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కాయస్థుడు కదా! వ్యవసాయం చేయకుండా ఆయన ఎందుకు రాజకీయ పదవులు కోరుకుంటున్నారు నీకొక న్యాయం దళిత బహుజన స్త్రీలకు ఒక న్యాయమా అంటూ ఆనాడే అంబేద్కర్ నిలదీశారు. ఈనాడు ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి మతోన్మాద, కులోన్మాద సౌదం మీద భారతదేశాన్ని చీకటి రాజ్యంగా చేయాలని చూస్తున్నాయి. కానీ అది వారికీ సాధ్యం కాదు ఎందుకంటే ప్రపంచమంతా ఈ రోజు అంబేద్కర్ భావజాలంతో ప్రజాస్వామ్య లౌకికవాద, సామ్యవాద, శాస్త్రీయవాద, సిద్ధాంత భూమిక మీద పునర్నిర్మించబడుతోంది. ఆర్ఎస్ఎస్., బీజేపీలు తిరోగమనంలో వున్నాయి. అందుకే ఈ సందర్భంగా లౌకికవాద, పురోగామి శక్తులందరు అంబేద్కర్ ఆలోచనా విధానంలో, భారతదేశ పునరుజ్జీవనానికి పాటు పడాల్సిన సమయం ఆసన్నమైంది. పోరాడితే ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.

డా. కత్తి పద్మారావు

దళిత ఉద్యమనేత

98497 41695

Advertisement

Next Story