రాష్ట్రంలో రగులుతున్న బీసీలు!

by Ravi |
రాష్ట్రంలో రగులుతున్న బీసీలు!
X

జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో అరకొర భాగస్వామ్యం మాత్రం చాలా దురదృష్టకరం. తరాలు మారినా కానీ బీసీల తలరాతలు మాత్రం మారడం లేదు. వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఏ మూల కూర్చున్నా కడుపునిండా భోజనం దొరుకుతుందనే నానుడి ఇప్పుడు బీసీల విషయంలో నిజమే అనిపిస్తుంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోవడం మూలంగానే బీసీలు రాజకీయంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్నారనేది చాలా మంది మేధావులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటంలో సుమారు 1400 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే అందులో మొదటి వరుసలో నిలిచిన శ్రీకాంతాచారి పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ లాంటి ఎంతోమంది బీసీ బిడ్డలు ఉద్యమ పోరాటంలో బలిపశువులయ్యారనే చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటాలను నడిపింది కూడా బీసీ, బహుజన బిడ్డలే అనేది జగమెరిగిన సత్యం. కానీ తదనంతరం ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో బీసీల ప్రాధాన్యత తగినంత లేదనేది అందరికీ తెలిసిన విషయమే.

బీసీల పట్ల మొసలి కన్నీరు..

తెలంగాణ ర 119 ఎమ్మెల్యే స్థానాల్లో కేవలం 23 మంది బీసీలకు మాత్రమే స్థానం దక్కడం చాలా బాధాకరం. కానీ కేవలం 10 శాతం జనాభా కూడా లేని అగ్రవర్ణాలకు సంబంధించిన 65 మంది ఎమ్మెల్యేలు ఉండడం బీసీలకు మింగుడు పడని అంశం. అదే విధంగా శాసన మండలిలోని నలభై ఎమ్మెల్సీ స్థానాలలో కూడా కేవలం ఎనిమిదంటే ఎనిమిది మంది బీసీలకు మాత్రమే చోటు దక్కడం, అదేవిధంగా 27 మంది అగ్రవర్ణాలకు సంబంధించిన వారే ఉండటం చూస్తే బీసీలు రాజకీయంగా ఎలా అణచి వేయబడుతున్నారో తెలుస్తుంది. ఇవే కాకుండా రాష్ట్రంలోని అనేక నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలను విస్మరించడం బీసీల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుందని చెప్పడానికి నిదర్శనం. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు, గిరిజనుల అభ్యున్నతి కోసం గిరిజన బందును ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం బీసీల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన బీసీ బంధులో బీసీ కులాలకు సంబంధించిన అనేక ఉపజాతుల కులాలకు అందులో చోటు కల్పించకపోవడం రాష్ట్రంలోని బీసీ సమాజాన్ని ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో 10 శాతం కూడా జనాభా లేని ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం 22 వేల కోట్ల నిధులను కేటాయించి, జనాభాలో 52 శాతం ఉన్న బీసీ సమాజానికి నిధులను కేటాయించకపోవడం చాలా బాధాకరం. దీనిపట్ల బీసీ ఉపకులాలు ప్రభుత్వంపై నిరసనను బాహటంగానే తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు.

ఈ ఎన్నికల్లో ఇది ప్రస్ఫుటం!

దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీసీలు, ఎస్సీలు రాజ్యాధికారం కోసం చేసిన పోరాటాలను మనం గమనించే ఉన్నాం కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకమై ఐక్య పోరాటాలను నడిపిన సందర్భాలు చాలా తక్కువేనని చెప్పవచ్చు, కానీ ఈ మధ్య జరిగిన అనేక పరిణామాలు, బీసీల రాజ్యాధికార ఉద్యమాలు, బీసీ సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. గతంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో కానీ బీసీలు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భాలు కొసమెరుపు. ఏనాడైతే సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన సమాజం ఉంటుందో అప్పుడే ఆ సమాజం రాజ్యాధికారం కోసం తాపత్రయ పడుతుందని చెప్పక తప్పదు. మన రాష్ట్రంలో ఆర్థికంగా బలోపేతమైన అగ్రవర్ణ కులాలుగా పేరుందిన రెడ్డి, వెలమచేతుల్లోని రాజ్యాధికారం చేతులు మారుతోందనేది ప్రస్ఫుటం. కానీ ఇప్పుడిప్పుడే విద్యాపరంగా విజ్ఞానవంతులై ఆర్థికంగా ఎదుగుతున్న బీసీ కులాల్లోని కొన్ని వర్గాలు రాజ్యాధికారం కోసం, రాజ్యాధికారంలో వాటాకోసం పోరాటాలకు సైతం వెనుకాడడం లేదు. అందులో భాగంగానే ఈ మధ్య విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో ఈడబ్ల్యూఎస్ కోటాలో తక్కువ మార్కులు వచ్చిన ఓసీలకు ఉద్యోగాలు రావడం, ఎక్కువ మార్కులు వచ్చినా కూడా బీసీలకు ఉద్యోగాలు రాకపోవడం చూశాం. ఇది నిరుద్యోగులైన బీసీలను ప్రభుత్వంలో భాగస్వాములైన, అదే విధంగా విపక్షాలకు సంబంధించిన రాజకీయ నాయకులను రాజ్యాధికారం వైపు అడుగులు వేయడానికి కారణంగా నిలిచిందనే చెప్పవచ్చు. ఏది ఏమైనా రాజ్యాధికారం ఉంటేనే తప్ప జాతి బాగుపడదు అనే భావన ఈ మధ్యకాలంలో బీసీలలో పాతుకు పోతుందని చెప్పక తప్పదు.

ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎన్నికలకు బీసీలకు తక్కువ సీట్లు కేటాయించడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఒక్క సీటును కూడా కేటాయించక పోవడం బీసీల రాజ్యాధికార ఉద్యమ పోరాటాలను ముమ్మరించడానికి దోహదపడింది. ఇది చూస్తే, రాజ్యాధికారం దిశగా బీసీలు అడుగులు వేస్తున్నారని, బీసీ నినాదానికి బీజం పడిందని చెప్పవచ్చు. అలాగే కాంగ్రెస్ సైతం 55 మంది అభ్యర్థులలో కేవలం 17 మంది బీసీలకు మాత్రమే సీట్లు కేటాయించడం అన్యాయమైన విషయం.

అయితే, ప్రస్తుతం బీసీ సమాజానికి బీజేపీ ఎన్ని సీట్లను కేటాయిస్తుందనే దానిపైనే రాష్ట్రంలోని బీసీలంతా కళ్లప్పగించుకొని చూస్తున్నారని చెప్పవచ్చు. ఏ పార్టీ అయితే ఎక్కువగా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తుందో ఆ పార్టీల వైపే బీసీ సమాజం మొగ్గు చూపుతుంది అనేది ప్రస్ఫుటం..

మా వాటా మాగ్గావాలే...!

గతంలో బీసీ బిడ్డలు రాజ్యాధికారంలో ఉన్నత స్థానంలో ఉండటానికి ఏ మాత్రం అంతగా ఆసక్తి చూపలేకపోయినారు. కానీ ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా తాము ఏ విధంగానైతే వివక్షకు గురవుతున్నారో తెలుసుకొని రాజకీయాల పట్ల అవగాహనను పెంచుకుని తమకు జరుగుతున్నటువంటి అన్యాయాలను సహించక వారు కూడా బహుజన రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. అయితే అన్ని సభల్లో బహుజన రాజ్యం కావాలని ఊదరగొడుతున్న అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఆర్థిక, సామాజికంగా కూడా బీసీ బిడ్డలు ఎంతగానో వెనుకబాటు తనానికి అణిచివేతకు గురవుతున్నారు. ఇంతకముందు లాగా కాకుండా బీసీ బిడ్డలు తమ సంఘటన శక్తి చాటడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల సీట్ల పంపకాలలో జరిగినటువంటి అన్యాయానికి నిరసనగా బీసీ కులాలలోని ముఖ్యమైనటువంటి ఉపకులాలు అయిన ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవ కులస్తులు, పద్మశాలీలు, గౌడ సోదరులు ఇతర ముఖ్యమైన బీసీ కులాల వారు తమ సమావేశాలను పెద్ద ఎత్తున నిర్వహించి వారి సంఘటన శక్తిని చాటి అందరికీ తమ శక్తిని ఏంటో చూపే ప్రయత్నం చేశారు. ఇదేవిధంగా బీసీలు ఏకమై ఓటు బ్యాంకుగా మళ్లితే మాత్రం ఏ రాజకీయ పార్టీ అయినా సరే బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కల్పించే అవకాశం ఉంటుంది.

బహుజన రాజ్యం సాధ్యమయ్యేనా?

ప్రస్తుత ఎన్నికల సందర్భంలో సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఒకవైపు బీసీ రాజకీయ నేతలు అందరూ ఏకమై ఉద్యమాలను నడుపుతుంటే బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా కాన్షీరాం, అంబేద్కర్‌ల స్ఫూర్తితో బీఎస్పీ, డీఎస్పీ లాంటి చిన్నాచితక పార్టీలు పోరాటాలను ఉధృతంగా కొనసాగిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ టిఆర్ఎస్ గెలిస్తే వెలమల రాజ్యం, అదేవిధంగా కాంగ్రెస్ గెలిస్తే రెడ్ల రాజ్యం వస్తుందని భావన తెలంగాణ సమాజంలో నిబిడీకృతమై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు ఏ పార్టీ అయితే బీసీని సీఎంగా ప్రకటించి ఎస్సీ, ఎస్టీలకు చెరొక ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయిస్తుందో ఆ పార్టీల వైపే తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏకమై ఐక్య పోరాటాలను కొనసాగించి బహుజన రాజ్యాధికారం దిశగా బాటలు వేయాలని ఆశిద్దాం.

దర్శనం దేవేందర్

తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం

99896 51768

Advertisement

Next Story

Most Viewed