- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీల రిజర్వేషన్లు ప్రకటించాల్సిందే!
మన భారతదేశంలో ఉన్న దాదాపు 2600 బీసీ కులాల్లో.. స్వాతంత్ర్యం వచ్చిన ఈ 78 సంవత్సరాలలో కేవలం 65 కులాలు మాత్రమే పార్లమెంటు, అసెంబ్లీలో అడుగుపెట్టాయి. విచిత్రంగా దేశ జనాభాలో బీసీలు 56%కి పైగా ఉన్నప్పటికి పార్లమెంటులో బీసీల బలం 15% కూడా లేకపోవడం గమనార్హం. మొత్తం దేశంలోని 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ కూడా లేకపోవడం సిగ్గుచేటు. 10 శాతం జనాభా గల ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్లు, దేశ సంపదలో 85-90 శాతం సంపద వీరి చేతుల్లోనే ఉంది. 56 శాతం జనాభా గల బీసీల చేతిలో మాత్రం 5 శాతం కూడా లేదు.
ప్రధాన పార్టీలు మొదటి నుంచి వెనుకబడిన తరగతుల కోసం కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం, విద్య, ఉద్యోగాలలో బొటాబొటి రిజర్వేషన్లు కల్పించడం, కొందరు బీసీ నేతలకు కొన్ని అప్రధానమైన శాఖలు ఇచ్చి తమ ప్రచారానికి వాడుకుని వదిలేయడం మినహా పెద్దగా ఒరిగిందేమి లేదు. ఇలాంటి జిమ్మిక్కులు 56% ఉన్న బీసీల వెనుకబాటుతనాన్ని కానీ , సమస్యలను కానీ ఏమాత్రం పరిష్కరించలేక పోతున్నాయి. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రొవిజన్స్, ఆర్టికల్స్ ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే ప్రభుత్వాలు తూతూ మంత్రంగా మాటల్లో చెప్పి, చేతల్లో చూపించక పోవడం దేనికి సంకేతమో బీసీ నేతలు అందరూ కలిసి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
అనాదిగా వివక్ష - అసమానతలు
అనాదిగా విద్యా, ఆర్థిక, రాజకీయ శక్తి, సామాజిక సాంస్కృతిక స్థితి రాజకీయ హోదా వంటి అన్ని రంగాలలో బీసీలు వివక్షకు గురవుతుండగా, 10 శాతం గల ఉన్నత వర్గాల చేతిలో మాత్రం గుత్తాధిపత్యం, అధికారం ఉంది. అందుకే రాజకీయ సీట్ల రిజర్వేషన్లు బీసీలకు ఆత్మ గౌరవానికి, అధికారానికి ప్రవేశ ద్వారం. వెనుకబడిన తరగతులకు చట్టసభలు, ప్రభుత్వ యంత్రాంగంలో రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయడమంటే అధికార హోదాను అనుభవించడం కోసం కాదు. సమాజంలో వారి దీర్ఘకాల వాటాను కలిగి ఉండటం, అణగారిన తరగతుల న్యాయ చట్టాల నిర్ణయంలో పాల్గొనడం, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణమైన మెజారిటీ ప్రజల ఆశలను, ఆశయాలను, ప్రాథమిక హక్కులను గౌరవించడమే నన్నమాట.
ఈ అంశంపై రాజ్యాంగ సవరణ చెయ్యరా?
భారత రాజ్యాంగం నేటి వరకు 121 సార్లకు పైగా సవరించబడింది. కానీ జనాభాలో 56% ఉన్న వెనుకబడిన తరగతులకు విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలను అందించడానికి కనీసం ఒక్కసారైనా రాజ్యాంగ సవరణకు నోచుకోలేకపోవడం అత్యంత బాధాకరం. వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే, వారు అభివృద్ధి చెందలేరు. వారికి సహజ న్యాయాన్ని కూడా అందించలేరు. కేవలం బీసీల కులగణనలు మాత్రమే కాదు.. దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల కులగణనలు చేసి తీరాలి. కొన్ని రాష్ట్రాలు బీసీల సంక్షేమం కోసం కులగణనలు జరిపినప్పటికీ, ఆ కులాల జనాభా ప్రాతిపదికగా ఆ రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచినప్పటికీ సుప్రీంకోర్టులు కొట్టివేయడం చాలా బాధాకరం. దానికి కారణం మన రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణలు చేయలేకపోవడమే.. రాజ్యాంగ బద్దమైన రిజర్వేషన్లు మాత్రమే బీసీ కులాలకు సరియైన న్యాయం చేయగలవు.
రాజ్యాంగ సవరణ సంక్లిష్టమా?
‘కులగణన చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, అది ఆచరణలో సాధ్యం కాదని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వితండవాదం చేస్తున్నాయి..1931లో బ్రిటీషు వారు జరిపిన జనగణనలో దేశంలో 4,147 కులాలున్నట్లు తెలిపింది. భారత్ రాజ్యాంగంలోని 15(4)(5), 16(4)(5) ప్రకారం వెనుకబడిన కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని ఉంది. అలాగే రాజ్యాంగంలోని 243 D-(6), 243T-6 ప్రకారం స్థానిక సంస్థల్లో వెనుకబడిన రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా ఉంది. ప్రస్తుతం కేంద్రంలో తన దగ్గర ఉన్న ఓబీసీ జాబితాలో 2,642 కులాలున్నాయి. రాష్ట్రాల జాబితాలో 2,892 బీసీ కులాలున్నాయి. 2011లో జరిగిన జనగణనలో ఎస్సీలు 1,234 కులాలు, ఎస్టీలు 698 కులాలు ఉన్నట్లు తేల్చారు.. కానీ బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి సిఫార్సులు చేయాలంటే జనాభా లెక్కలు కావాలి కదా. పైగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలనా సౌలభ్యం కోసం కులాల వారి లెక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఉచితాలు ఆకలి చావులను తగ్గించగలవా?
అనేక రాష్ట్రాల్లో అనేక ఉచితాలు, సబ్సిడీ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల ఆకలి మరణాలు తగ్గకపోగా, విద్య, వైద్య పరంగా సేవలు సరిగ్గా అందడం లేదు. పేదవాని ఆర్థిక వృద్ధికి ఉచితాలు తాత్కాలికంగా కొంత కాలం పాటు సహాయకారిగా ఉండగలేవేమో కానీ, వెనుకబడ్డ తరగతుల ప్రజల కష్టాలను, కన్నీళ్లను శాశ్వతంగా తుడువ లేవు... తగ్గించలేవు ఇకనైనా కేంద్రం, రాష్ట్రాలు ఉపాధి అవకాశాలను సృష్టించాలి. ఓట్ల కోసం అనవసర ఉచితాల వైపు అడుగులు వేయకుండా, వెనుకబడిన తరగతులకు అవసరమైన రాజ్యాంగబద్ధమైన కులగణనతో పాటు, రాజ్యాంగ బద్దమైన రిజర్వేషన్ల కోసం, భారత రాజ్యాంగానికి, సత్వరంగా రాజ్యాంగ సవరణ చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించేంతవరకు ఈ బీసీల పోరాటం ఆగదు... ఆగబోదు... దాన్ని సాధించేందుకు అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల బిల్లులు పెట్టి, ప్రజా ప్రభుత్వాలు తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
(నేడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం )
డా. బి. కేశవులు నేత. ఎండి.
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659
- Tags
- BC reservations