- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ట్రాప్ లో బీసీ కుల సంఘాల నాయకులు! కోవర్టులుగా టీఆర్ఎస్ నాయకులు
సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపికి అసలు అభ్యర్థులే దొరకరన్న భయంతో బీసీల భజన చేసుకుంటూ, టీఆర్ఎస్ అసమ్మతులను కూడగట్టే పనిలో నిమగ్నమైంది. ఎన్నడూ లేనిది బీసీల మీద ప్రేమతో కె.లక్ష్మణ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసింది. 'దళితబంధు' వలన దళితులు బీజేపీ దరి చేరరనుకుని, మంత్రి పదవిని ఎరగా చూపి బీసీలకు పెద్దపీట వేస్తున్నట్లు నటిస్తున్నది. 2014లో బీసీ జనగణన చేస్తామని గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఆ తరువాత ఆ మాటే మరిచిపోయింది. ఇతర పార్టీలవారిని నయానో, భయానో కోవర్టులుగా మార్చుకుంటోందనే విమర్శ ఉంది. బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్ మునుగోడులో ఎలా బ్రేక్ వేస్తుందో చూడాలి.
ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసం అయిన కులవృత్తులకు, చేతివృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిచ్చింది. వాటికి జవసత్వాలు కల్పించి హరిత, నీలి, గులాబీ, శ్వేత విప్లవాలకు శ్రీకారం చుట్టింది. సబ్బండ వర్ణాల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. బీసీలలో ఉండి కూడా చిరునామా లేని 17 సంచార జాతులకు చట్టబద్ధత కల్పించింది. అణగారిన వర్గాల కోసం గురుకులాలను ఏర్పాటు చేసింది. కార్పొరేట్‌కు దీటుగా చదువును అందిస్తోంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని కులాలవారికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని తలపోసింది. ఇందుకోసం కుల సంఘాలు ఏక తాటి పైకి రావాలని సూచించింది. అయితే, సంఘాలలో మాత్రం ఏకాభిప్రాయం రావడం లేదు. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించి అందలం ఎక్కించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆయా కుల సంఘాల ప్రజాప్రతినిధులు తూట్లు పొడుస్తున్నారు. ఐక్య కుల సంఘాలకు సీఎం చేతుల మీదుగా ఆత్మగౌరవ పట్టాలను అందిస్తామని చెప్పి, ధన బలం ఉన్న వారికి పట్టాలు అందచేసి అనైక్యతకు తావిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.
స్థలాలు, నిధులు ఇచ్చి
రాష్ట్ర ప్రభుత్వం బీసీలలోని 43 కులాలకు స్థలాలు కేటాయిస్తూ జీఓలు విడుదల చేసింది. 90 ఎకరాల దాకా అలాట్ చేసింది. భవన నిర్మాణాలకు రూ.90 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ సంవత్సరం మొదటి నెలలోనే ప్రారంభం కావాల్సిన నిర్మాణాలు ఐక్య కుల సంఘాలు ఏర్పాటు కాని కారణంగా ఆగిపోయాయి. భవనాలను ప్రభుత్వమే నిర్మిస్తుందని అందరూ అనుకున్నారు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో సంఘాలన్నీ ఏకం అవుతాయని భావించారు.
రిజిస్టర్ అయిన కుల సంఘాలను ఏకం చేయకుండా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, మంత్రులు కోవర్టులుగా మారిపోయారు. స్వప్రయోజనాల కోసం అధికార బలం ఉపయోగించి, టీఆర్ఎస్‌కు వెన్నంటి ఉండి, టీఆర్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న కుల సంఘం నాయకులకు సమాచారం ఇవ్వకుండా దొంగ చాటున పట్టాలు ఇచ్చారు. ఆయా కులాలలో ఉన్న కొన్ని బీసీ సంఘాలు (గౌడ, యాదవ, మున్నూరు కాపు) సమాచారం తెలుసుకొని ప్రతిఘటించగా అన్ని రిజిస్టర్డ్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. గుర్తింపు ఉన్న సంఘాలకు సముచిత స్థానం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సంఘాల విన్నపం మాత్రం పట్టించుకో లేదు. ఐక్య సంఘాలను కావాలనే తెరపైకి తెచ్చారనే విమర్శ ఉంది.
ఎన్నిసార్లు విన్నవించినా
పార్టీకో కుల సంఘం ఉంటే ఏకాభిప్రాయం ఎట్ల వస్తది? అసలు ఐక్య సంఘం క్రైటేరియాగా పెట్టుకుని ఏకంగాని కుల సంఘాలకు పట్టాలు ఎలా ఇస్తారు? ఆత్మగౌరవ భవనాల కేటాయింపులో బీజేపీ నాయకులను ప్రోత్సహించేదెవరు? ఏనాడూ కుల సంఘంలోకి రాని సీఎం కార్యాలయ మాజీ ఉద్యోగికి ఇప్పించేందుకు ప్రోద్భలం చేసినారా? లేదా? పెరిక కులంలోని రెండు సంఘాలు కలిసి ఐక్యత లేని సంఘాలకు ఇవ్వద్దని అనేక సార్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌గారికి, ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం గారికి విన్నవించినా పెడచెవిన పెట్టారు. టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సంఘాలను కాదని, కమలదళంతో అంటకాగుతున్న సంఘానికి పట్టా ఇవ్వడాన్ని తీవ్రంగా వారు వ్యతిరేకిస్తున్నారు.
కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం తెలుసు. పైరవీలు చేయడం తెలియదు. అన్ని ఎన్నికలలో బహిరంగంగా ప్రజా క్షేత్రంలో మద్దతుగా నిలబడిన సంఘాలకు మొండి చెయ్యి చూపడం ఎంతవరకు సమంజసం? ఏ ఒక్క రోజు అయినా బీసీల మద్దతు కూడగట్టని ప్రజా ప్రతినిధులు, రాత్రికిరాత్రి రాష్ట్ర నాయకులు ఏకంగాని కుల సంఘానికి పట్టా ఇవ్వడం విడ్డూరంగా ఉంది. తెలంగాణలో జెండా ఎగరేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకోసం పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఏ ఒక్క సంఘం ఆత్మ గౌరవం దెబ్బ తినకుండా, భవనాలను ప్రభుత్వమే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలి.
భయంతోనే
బీజేపీ మైండ్‌గేమ్‌లో భాగంగానే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మీడియా ముందుకు వచ్చారు. టీఆర్‌ఎస్ సమావేశాలు, సభల సమాచారం ఇవ్వడం లేదంటూ విమర్శించారు. బీసీలు బలంగా ఉన్న నియోజకవర్గంలో కావాలనే సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణ ఒకింత ఆశ్చ్యరానికి గురి చేసింది. జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని నిందించడం ఆయన వ్యక్తిగతమా? అసంతృప్తికి కారణం ఏమిటి? టికెట్ అడగడం తప్పు కాదు. ఒక పద్ధతి ఉంటది. టీఆర్‌ఎస్ పార్టీలో నాయకుడు చెప్పిందే వేదం. సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపికి అసలు అభ్యర్థులే దొరకరన్న భయంతో బీసీల భజన చేసుకుంటూ, టీఆర్ఎస్ అసమ్మతులను కూడగట్టే పనిలో నిమగ్నమైంది.
ఎన్నడూ లేనిది బీసీల మీద ప్రేమతో కె.లక్ష్మణ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసింది. 'దళితబంధు' వలన దళితులు బీజేపీ దరి చేరరనుకుని, మంత్రి పదవిని ఎరగా చూపి బీసీలకు పెద్దపీట వేస్తున్నట్లు నటిస్తున్నది. 2014లో బీసీ జనగణన చేస్తామని గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఆ తరువాత ఆ మాటే మరిచిపోయింది. ఇతర పార్టీల వారిని నయానో, భయానో కోవర్టులుగా మార్చుకుంటోందనే విమర్శ ఉంది. బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్ మునుగోడులో ఎలా బ్రేక్ వేస్తుందో చూడాలి.
Also Read : బీజేపీలో ముసలం.. మునుగోడుపై పట్టుబట్టిన ఆ ఇద్దరు నేతలు
డా. సంగని మల్లేశ్వర్
జర్నలిజం విభాగాధిపతి
కేయూ, వరంగల్
98662 55355