స్త్రీ జీవితమే ఒక మరుభూమా?

by Ravi |   ( Updated:2023-10-07 00:46:07.0  )
స్త్రీ జీవితమే ఒక మరుభూమా?
X

భవందర్ సినిమా, రాజస్థాన్‌లో ఒక గుజార్ల గ్రామంలో జరిగిన యధార్థ గాథ! భన్వరీ దేవిని గ్రామ పెద్దలు బలవంతంగా బంధించి, దారుణంగా అత్యాచారం సల్పుతారు. ఈ యధార్థమైన కేసు ఆధారంగా భవందర్ సినిమా తయారయింది. భన్వారీ దేవి పేరును సినిమాలో సంవారీగా మార్చారు. 2000 సంవత్సరంలో విడుదలైన హిందీ సినీమా భవందర్ (Bawandar -Sandstorm). ఆ రోజుల్లో సంచలనం కలిగించి విశేష ప్రశంసలు, పురస్కారాలు పొందింది.

సంవారీ కుమ్మరి గ్రామీణ యువతి, అత్త, మామ, భర్త, ఇద్దరు పిల్లలు, ముచ్చటైన సంసారం. సంవారి దంపతులు ఊళ్ళోకి వస్తుండగా గ్రామ పెద్దలు భర్తను కొట్టి, అతని కళ్ళముందే ఆమెను ఒకరితర్వాత ఒకరు పాశవికంగా అత్యాచారం చేస్తారు. శారీరిక, మానసిక వేదనతో పాటుగా, ఊళ్ళో గ్రామీణుల మధ్య పరువు పోవడం, చులకనయి తలదించుకోవాల్సి వస్తుంది. సంవారి ఏకాంతంగా మౌనంగా ఆక్రోశిస్తుంది, ఒక విదేశీ పత్రికా రిపోర్టర్ ఈ కథనంతా తవ్వి తీస్తుంది.

కథేంటంటే..

కథ విషయానికి వస్తే... సంవారీ క్వారీలో పనిచేస్తూ తోటి శ్రామిక మహిళల హక్కులకోసం, లంచగొండి సూపర్‌వైజరుకు వ్యతిరేకంగా నిలబడిందన్న వార్త కేంద్ర ప్రభుత్వ అధికారిణి శోభాదేవి చెవిని బడి, ఆమె సంవారిని ఆ గ్రామంలో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే, మహిళల స్వచ్ఛంద కార్యకర్తగా నియమిస్తుంది. సంవారి ఉద్యోగ ధర్మంలో భాగంగా ఒక బాల్యవివాహాన్ని ఆపడానికి వీలు పడక పోలీసుల ద్వారా జరగనీయకుండా చేస్తుంది. ఆమె చేసిన పని, ఆ గ్రామ పెద్దల క్రోధానికి లక్ష్యమవుతుంది. గ్రామంలో అధిక సంఖ్యాకులు గుజార్లు, సంవారీని, ఆమె కుటుంబాన్ని వెలివేసి, నిత్యావసరాలను కూడా వారికి అమ్మకుండా చేస్తారు.

ఆమె భర్తను చచ్చేట్లు కొట్టించి, గ్రామపెద్దలలో ముగ్గురు (గ్రామ పూజారితో సహా) కట్టి పడవేసిన భర్త కళ్ళముందే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేస్తారు. సంవారి పోలీసులను ఆశ్రయిస్తే, కేసు రిజిస్టర్ చేయరు, ప్రభుత్వ వైద్యుడు పరీక్షించి సర్టిఫికెట్ ఇవ్వడానికి కోర్ట్ ఆర్డరు తెచ్చుకోమంటాడు. ఆ కష్ట సమయంలో మహిళా శాఖ అధికారిణి శోభాదేవి సంవారీకి అండగా ఉంటుంది. మ్యాజిస్ట్రేటు ఇంటి వద్దకు వెళితే భార్యమణితో క్లబ్‌కో, మరెక్కడికో వెళ్లే న్యాయాధిపతికి ఆమె మొర వినే తీరిక ఉండదు. చివరకు కోర్టు ద్వారా రెండు రోజుల తర్వాత స్టేషనులో కేసు రిజిస్టరవుతుంది. మరోవైపు స్థానిక పాలక పార్టీ సపోర్టుతో రేపిస్టులు యధేచ్చగా తిరుగుతుంటారు విజయగర్వంతో. న్యాయస్థానంలో ఒక గుజార్ వకీలు సంవారి కేసు తీసుకొంటాడు గానీ, తన కులం వారి ఒత్తిడి వల్ల అత్యాచారం జరిపిన వారి తరఫున వాదిస్తాడు. పురోహిత్ అనే చిన్న వకీలు సంవారి తరఫున కేసు వాదిస్తాడు. కేసు వాయిదాలు పడుతూ ఉంటుంది, న్యాయాధిపతులు బదిలీల మీద వెళ్లిపోతూ ఉంటారు.

ఎన్నో అవార్డులు అందుకున్న చిత్రం!

సంవారి పూర్తిగా అననుకూల పరిస్థితుల నడుమ, సహకరించని కుటుంబ సభ్యులు, బంధువులు, పరిహసించే గ్రామీణులు, ధనమదంతో విర్రవీగే రేపిస్టులు, ఆమె పరిస్థితిని తమ ప్రచారానికి వాడుకొనే మహిళా సంఘాల వాళ్ళు, మీడియా వాళ్ళు, అసమర్థ పోలీస్ ఉద్యోగులు, లంచగొండి డాక్టర్లు, అవినీతిమయమైన న్యాయ వ్యవస్థ, గుజార్లకు వ్యతిరేకంగా చేస్తే ఎలెక్షన్‌లో ఓట్లు పడవని భావించే పాలకపక్షం మధ్య ఆమె తన న్యాయపోరాటాన్ని సాగించిన కథే సినిమా. అయిదేళ్ళ తర్వాత అత్యాచారం చేసిన నిందితులు నిరపరాధులని న్యాయస్థానంలో తీర్పు వస్తుంది. పోలీసు అధికారి సాక్ష్యాన్ని తారుమారు చేయడమే దీనికి కారణం. విదేశీ రిపోర్టరు, ఆమె భారతీయ మిత్రుడు వీరి పరిశోధనల ద్వారా చిత్ర కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. నందితా దాస్ నటించిందనడం కన్నా తానే సంవారిగా నమ్మించింది. సెన్సార్ నుంచి, కోర్టు కేసుల నుంచి, గుజార్ల ఆక్షేపణల నుంచి, ఎన్నెన్నో అడ్డంకులు అధిగమించి ఈ చిత్రం హిందీ, ఇంగ్షీషు, రాజస్థానీ భాషలలో విడుదలయి, ఎన్నెన్నో పురస్కారాలు, అవార్డులు అందుకొంది.

అత్యాచారం వంటి కేసుల్లో బాధితుల పరిస్థితులపై సాధారణ ప్రేక్షకుల నుంచి ఉన్నత వర్గాల వరకూ ఉన్న ఎన్నో అపోహలను, భ్రమలను సినిమా తొలగిస్తుంది. పైవర్గాల మహిళలు ఇటువంటి దారుణాలను ఒక వినోదంగా భావించడం, ఇన్‌సెన్సిటివ్‌గా వ్యవహరించడం అన్నీ మనకు స్ఫురిస్తాయి. స్త్రీ జీవితమే ఒక మరుభూమా? ఎడారిలో ఇసుక తుఫానులో బతకడమేనా? సినిమా పేరే ఎన్నెన్నో ఆలోచనలు రేపుతుంది. దర్శకుడు జగ్ ముంద్రా, నాయికా నిష్టమయిన చిత్రం, నాయిక సంవారి పాత్రను నందితా దాస్, స్త్రీ జనశాఖ అధికారిణి పాత్రను దీప్తి నావల్ పోషించారు. ఈ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్‌లోనే చూడవచ్చు.

డా. కాళిదాసు పురుషోత్తం

విశ్రాంత ప్రిన్సిపాల్

90006 42079

Advertisement

Next Story

Most Viewed