వర్గీకరణ: అంబేద్కర్‌ని అందరమూ మర్చిపోయాం!

by Gantepaka Srikanth |
వర్గీకరణ: అంబేద్కర్‌ని  అందరమూ మర్చిపోయాం!
X

బాబా సాహెబ్ అంబేద్కర్ అంతిమ లక్ష్యం కుల నిర్మూలనే.. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు, ప్రత్యేక హక్కులు కల్పించడం కానే కాదు! ఫూలే శిష్యుడిగా ఆయన నిర్దేశించుకున్న లక్ష్యసాధనకు.. అవి మెట్ల లాంటివి మాత్రమే!! ఈ మాట నేడు దేశభక్త పౌరులందరూ గొంతెత్తి నినదించాల్సిన సమయం ఆసన్నమైనది. రిజర్వేషన్లు కొనసాగించాలా వద్దా అనే గొడవలో.. రిజర్వేషన్లలో వర్గీకరణ చేయాలా వద్దా అనే రగడలో.. సామాజిక విప్లవ మూర్తి అంబేద్కర్‌ని మనం పూర్తిగా మర్చిపోయాము. ఆ భారతరత్నం ఆవేదన ఏమిటో నేటి భారత జాతి పూర్తిగా మర్చిపోయిన దుస్థితి నేడు నెలకొన్నది! అంబేడ్కర్ మహనీయుడి త్యాగమయ పోరాటాల ఫలితంగా దక్కిన ప్రయోజనాలను పోటీపడి చేజిక్కించుకోవడం పైనున్న ఆసక్తి, ఆయన అందించిన తాత్విక సైతాంతిక వారసత్వాన్ని నిలబెట్టాలనే విషయంలో లేకపోవడం.. నేటి కాలపు విషాదం!

సాటి సోదరులని వంచించి, శ్రమ దోపిడి చేయడం కోసమే.. స్వార్థపర శక్తులు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కృత్రిమంగా సృష్టించారని తన పరిశోధనలో నిగ్గు తేల్చిన అంబేద్కర్.. కుల నిర్మూలనే ఈ దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు పరిష్కారమని 1936 నాటికే నిర్ధారణకు వచ్చారు. ఆ దిశలో ఒక కార్యాచరణ ప్రణాళికగా.. ఆ యేడాదే “అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్” పుస్తకాన్ని రాశాడాయన. కుల రహిత సమాజ నిర్మాణం జరగాలంటే.. కుల వివక్ష సృష్టించిన అసమానతల అవశేషాలు కూడా రూపుమాపాల్సిందేనని ఆయన గుర్తించాడు. “నేటి నుంచి కులం రద్దు!” అంటూ ఒక ఫర్మానా జారీ చేస్తే సరిపోదని.. గతకాలపు వివక్ష సృష్టించిన అంతరాలను సరిదిద్దడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలని సంకల్పించాడు ఆయన. 1902లో ఛత్రపతి సాహు మహారాజ్ తన రాజ్యంలో అమలుపరిచిన రిజర్వేషన్ల వ్యవస్థ అప్పటికే ఒక దారిదీపంగా నిలబడి ఉన్నది. ఆ విధానానికే కొంత మెరుగులు దిద్ది అంబేడ్కర్ రాజ్యాంగబద్ధత కల్పించాడు. నిమ్న వర్గానికి చెందిన అంబేద్కర్.. తన వర్గ ప్రయోజనాల కోసం ఆ ప్రతిపాదన పెట్టడం లేదని, అందులోని నవభారత నిర్మాణ ప్రాతిపదికను గుర్తించిన మిగతా రాజ్యాంగ సభ సభ్యులు సైతం సమ్మతించిన కారణంగానే రిజర్వేషన్ పాలసీ అమల్లోకి వచ్చింది. రిజర్వేషన్ల అండతో గత వివక్ష అవశేషాలను తొలగించి, సమాన అవకాశాల వ్యవస్థను సృష్టించి.. క్రమక్రమంగా కుల రహిత సమాజం వైపు దేశాన్ని నడిపించాలనేదే నాటి మహనీయుల సదాశయం!

ఉమ్మడి వివక్ష హోమోజినిటీ కాదా?

బ్రిటిష్ పాలకులు 1919లో నియమించిన సౌత్బోరో కమిటీ.. అంటరానితనం ఎదుర్కొంటున్న వర్గాల వారిని “డిప్రెస్డ్ క్లాసెస్” అంటూ వ్యవహరించింది. భారత ప్రభుత్వ చట్టం, 1935.. “ షెడ్యూల్డ్ క్యాస్ట్స్” అనే కొత్త పదాన్ని వారికి ఆపాదించింది. 1936లో భారత ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ రూపొందించబడింది. మొదటిసారిగా ఏయే ప్రాంతాలలోని ఏయే కులాలు షెడ్యూల్డు కులాలుగా పరిగణించబడతాయో స్పష్టీకరించారు. స్వతంత్ర భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 లోని షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ 1950కి ఇది మాతృక అని చెప్పుకోవచ్చు. ఈ చరిత్ర ఏమి చెబుతున్నది? అందరూ కలిసి ఎదుర్కొన్న వివక్ష, తరతరాలుగా అందరి ఒంటిపై పుట్టుమచ్చలాగా మనువాదులచే రాయబడిన అంటరానితనం ఒకటే అయినప్పుడు.. ఆ షెడ్యూల్ హోమోజెనస్ కాదని ఎవరైనా ఎలా అనగలరు?

ఎక్కడికి చేరుకున్నాం మనం?

వర్గీకరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు .. వర్గీకరణ తీర్పు తదుపరి, ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మాట్లాడుతూ.. సామాజిక అసమానతలు అగ్రకులాలు దళితుల మధ్యనే కాదు, వివిధ దళిత కులాల మధ్యన సైతం ఉన్నాయంటూ.. మనువాదులు నిత్యం పలికే మాటలను తన నోట ప్రకటించేశాడు. వర్గీకరణకు సమ్మతి తెలిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం వివిధ దళిత కులాల మధ్యన సామాజిక అసమానతలు ఉన్నాయని ఎక్కడా చెప్పలేదు. దళిత కులాలు సమాన స్థాయిలో లేవు కాబట్టి వర్గీకరణను అనుమతించవచ్చునని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తేల్చి చెప్పగా.. ఆయా దళిత కులాల ప్రజలు ఎదుర్కొన్న వివక్షలో హెచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి వర్గీకరణ చేయవచ్చునని జస్టిస్ గవాయి అనుమతినిచ్చాడు. ఆర్థిక ప్రయోజనాలను అందించే ఏర్పాటులో భాగంగా వరుస క్రమం ఏర్పాటు చేసినంత మాత్రాన.. సమస్త పంచమ జాతి ఎదుర్కొన్న వంచన ఒకటి కాకుండా పోతుందా? బాధ ఒకటే అయినపుడు బాధితులు ఒకే వర్గం కాదని ఎలా అనగలం?

రిజర్వేషన్ల వ్యవస్థనే కబళిస్తుంటే...!

వర్గీకరణ ఉన్నా లేకపోయినా దళిత ఐక్యత ముఖ్యమనే సోయి.. రిజర్వేషన్ల వ్యవస్థనే కబళించాలని చూస్తున్న మనువాదుల కుట్రలను ఐక్యంగా ఎదిరించాలనే కనీసపు బహుజన అవగాహన.. నేడు కొందరిలో లోపించడం బాధాకరం. దళితుల్లోనూ, బీసీ వర్గాల్లోనూ తరతమ భేదాల పాపం.. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను సృష్టించిన మనువాదులదేనన్న సత్యం వీరికి తెలియదా? ప్రపంచంలో ఎక్కడా లేని కులదొంతరల నిచ్చెన మెట్లను ఇక్కడ సృష్టించి, పై మెట్టు పైన తనను తాను ప్రతిష్టింపజేసుకుని.. దాని కింద ఒకరు, ఆ కింద మరొకరు అనే నికృష్టపు వ్యవస్థ.. ఈ దేశంలో వేల యేళ్లుగా సాగినందునే పీడితుల మధ్య సైతం తారతమ్యాలు ఏర్పడ్డాయన్నదే మనందరమూ గుర్తించాల్సిన అసలు సత్యం. మాదిగ వర్గానికి చెందిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉమ్మడి కోటాతో కాస్త నష్టపోతే.. అదే మాదిగ వర్గానికి చెందిన ఉత్తర భారతపు చమార్లు ఉమ్మడి కోటాతో కొంత లబ్ధి పొందారన్నది కూడా సత్యమే కదా? అందుకే అక్కడి చమార్లు నేడు వర్గీకరణ వద్దంటున్నారు. ఇగ ఈ కొట్లాటకు అర్ధమున్నదా? అంబేడ్కర్ మహనీయుడి త్యాగమయ పోరాటాల ఫలితంగా దక్కిన ప్రయోజనాలను పోటీపడి చేజిక్కించుకోవడం పైనున్న ఆసక్తి, ఆయన అందించిన తాత్విక సైతాంతిక వారసత్వాన్ని నిలబెట్టాలనే విషయంలో లేకపోవడం.. నేటి కాలపు విషాదం!


ఆర్. రాజేశమ్

కన్వీనర్, సామాజిక న్యాయవేదిక,

94404 43183

Advertisement

Next Story

Most Viewed