ఇంక్రిమెంట్‌పై అవగాహన అవసరం!

by Ravi |   ( Updated:2024-10-18 01:00:43.0  )
ఇంక్రిమెంట్‌పై అవగాహన అవసరం!
X

ఒక ఉద్యోగి ఒక సంవత్సర కాలం పాటు సర్వీసు అందించిన తదుపరి ఆసక్తిగా ఎదురుచూసే అంశం ఇంక్రిమెంటు. అయితే ఈ ఇంక్రిమెంట్ ఎవరు మంజూరు చేయాలి? ఏ సందర్భాలలో నిలిపివేస్తారు? తదితర అంశాల పట్ల ఉద్యోగ/ఉపాధ్యాయులకు డిడివోలకు అవగాహన అవసరం. ఒక సంవత్సర కాలం పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహాకాన్ని వార్షిక ఇంక్రిమెంటు అంటారు. ఒక ఉద్యోగిపై ఆరోపణలు, చార్జిషీటు పెండింగ్‌లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్ నిలపరాదు. ఓ ఉద్యోగికి ఫాం-49 పూర్తి చేసి డిడిఓ ఇంక్రిమెంట్ ధ్రువపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జత పరచకపోతే ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంట్ మంజూరు కాదు.

జీవో.133 తేదీ 13.5.1974 ప్రకారం ఒక ఉద్యోగి నియామకపు తేదీ నెల మధ్యలో ఉన్నప్పటికీ ఇంక్రిమెంట్ నెల మొదటి తేదీ నుండే మంజూరు చేస్తారు. అలాగే పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల సంఖ్య 3781 తేదీ 31. 12. 1984 ననుసరించి దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో దండన సమాప్తమైన తేదీ నుండి ఇంక్రిమెంట్లు పునరుద్ధరింపబడతాయి. ప్రభుత్వ మెమో నం.49463 తేదీ 6.10.1974 ప్రకారం ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రి మెంట్‌కు కావలసిన కాలం పూర్తి అయినప్పటికీ ఇంక్రిమెంట్ మంజూరు చేయరు. ఇంక్రిమెంట్ డ్యూ తేదీ మారదు కానీ సెలవు ముగిసి డ్యూటీలో చేరిన తేదీ నుండి లభిస్తుంది. అయితే స్టడీ లీవ్‌లో ఉన్నప్పుడు మాత్రం ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. ఇందుకు కారణం స్టడీ లీవ్‌ను ఆన్ డ్యూటీ‌గా పరిగణించడమే. ఇంక్రిమెంట్‌కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం స్కేళ్ల మంజూరుకు పరిగణిస్తారు. ఫండమెంటల్ రూల్-26 ననుసరించి ఉన్నత పదవిలో చేసిన సర్వీసు దిగువస్థాయి పోస్టులో ఇంక్రిమెంటు‌కు పరిగణించబడుతుంది. కానీ దిగువ స్థాయి పోస్టులో చేసిన సర్వీసు ఉన్నతస్థాయి పోస్టులో ఇంక్రిమెంటుకు పరిగణించబడదు.

ఇంక్రిమెంట్లు నిలిపివేసే అధికారం

తప్పుడు ప్రవర్తన, విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెం ట్‌లను విత్ క్యూములేటివ్, వితౌట్ క్యూములేటివ్ పద్ధతులలో నిలిపివేయు అధికారం నియామక అధికారికి ఉంటుంది. విత్ క్యూములేటివ్ ఎఫెక్ట్‌లో ఇంక్రిమెంట్‌లను నిలిపివేసే క్రమంలో విచారణాధికారిని నియమించాలి. సదరు ఉద్యోగికి తన వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి. ఈ పద్ధతిలో ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంట్ కోల్పోతాడు. కానీ వితౌట్ క్యూములేటివ్ ఎఫెక్ట్ పద్ధతిలో ఇంక్రిమెం ట్‌ను ఎన్ని సంవత్సరాలు నిలిపివేసిన తదుపరి సంవత్సరం అన్ని ఇంక్రిమెం ట్‌లను విడుదల చేస్తారు. కానీ సదరు ఉద్యోగి అరియర్స్‌ను కోల్పోతారు.

ఇంక్రిమెంట్ ఎవరు మంజూరు చేస్తారు?

ప్రభుత్వ మెమో.నెం.16965 తేదీ 13.2.1987 ప్రకారం ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని దరఖాస్తు చేయనవసరం లేదు. తన కార్యాలయం/పాఠశాలలో పనిచేసే ఉద్యోగి/ఉపాధ్యాయుల యొక్క ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఇంక్రిమెంట్ వాచ్ రిజిస్టరు‌ను నిర్వహించాలి. ఫండమెంటల్ రూల్ -18 ప్రకారం డైస్ నాన్‌గా పరిగణించబడిన కాలం ఇంక్రిమెంట్‌కు లెక్కించబడదు. ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇంక్రిమెంటు మంజూరు చేస్తారు.

జీవో.235 తేదీ: 27.10.1998 ప్రకారం ఉద్యోగ విరమణ చేసిన మరుసటి నెలలో ఇంక్రిమెంట్ డ్యూ ఉంటే అట్టి ఇంక్రిమెంట్‌ ను నోషనల్‌గా పరిగణించి పెన్షన్ లెక్కించుటకు పరిగణలోకి తీసుకుంటారు. కానీ పదవి విరమణ తర్వాత చెల్లించి ఎర్న్‌డ్ లీవ్‌కు ఈ నోషనల్ ఇంక్రిమెంట్‌ను పరిగణలోకి తీసుకోరాదు. ఏదైనా పరీక్ష వల్ల ప్రభుత్వ ఉద్యోగికి మినహాయింపు వచ్చినట్లయితే ఆ మరుసటి తేదీ నుండి మంజురు చేస్తారు.

జీవో.307 తేదీ: 3.12.2012 ప్రకారం ఉద్యోగి సస్పెండ్ అయిన కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణించమని నియామక అధికారుల నుండి ఉత్తర్వులు వెలువడితే ఆ కాలాన్ని ఇంక్రిమెంట్ లెక్కించుటకు పరిగణిస్తారు. అలాగే డిప్యూటేషన్‌పై విదేశాలకు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుకు, కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లకు వెళ్లిన కాలము, ఫారిన్ సర్వీసులో పనిచేసిన కాలము ఇంక్రిమెంట్‌కు పరిగణించబడుతుంది.

స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు అంటే?

తక్కువ వేతన స్కేళ్లలో ఎక్కువకాలం పనిచేసే ఉద్యోగులు వారి వేతన స్కేళ్లలో గరిష్టంకు చేరుకునే అవకాశం ఉంది. అటువంటి వారు భవిష్యత్తులో ఇంక్రిమెంట్లు లేక అదే వేతనంపై పదవి విరమణ పొందే వరకు లేదా వేతన స్కేళ్లు మారేవరకు పనిచేయాల్సి ఉంటుంది. అయితే అటువంటి వారికి న్యాయం చేసేందుకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తారు. ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను పెన్షనరీ బెనిఫిట్స్, ఫిక్సేషన్లు అప్రయత్నం పదోన్నతి పథకాలకు కూడా పరిగణిస్తారు. 2020 పీఆర్సీలో జీవో.51 తేదీ 11.6.2021 ద్వారా 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లకు అవకాశం ఉన్నది.

ఇంక్రిమెంట్ ప్రీఫోన్‌మెంట్

ఉద్యోగుల వేతన స్థిరీకరణ సందర్భాలలో గాని, పదోన్నతి పొందిన స్థితిలో గాని, వేతన నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు, జూనియర్, సీనియర్ ఉద్యోగుల వేతనం ఒకే స్కేలులో ఒకే దశ యందు వేతన స్థిరీకరణ కాబడి సీనియర్ ఉద్యోగి కంటే జూనియర్ ఉద్యోగి ఎక్కువ వేతనం పొందుతున్న సందర్భంలో సీనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీని జూనియర్ ఇంక్రిమెంట్ తేదీకి ప్రీపోన్ చేయబడి వేతన రక్షణ కలుగజేయుటనే ప్రీపోన్‌మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అంటారు.

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed