నిజమైన ప్రజా పాలకుడిగా.. రేవంత్

by Ravi |   ( Updated:2024-12-12 01:15:35.0  )
నిజమైన ప్రజా పాలకుడిగా.. రేవంత్
X

పదేళ్ల కేసీఆర్ పాలనకు... ఏడాది రేవంత్ రెడ్డి సర్కార్‌కు నడుమ రెండు కీలకమైన అంశాలు నిలువు గీతలుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు గీతలు రేవంత్ రెడ్డి పరిపాలనా తీరుకు అద్దం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు గడిచాయి. ప్రజలు రెండు పర్యాయాలు కేసీఆర్‌ను సీఎం పీఠంపై కూర్చోపెట్టారు. గతేడు జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని గద్దె నెక్కించారు. కాంగ్రెస్ ఏడాది పాలన ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బట్టి రెండు ప్రభుత్వాలకు తేడా ఏందో క్లియర్‌గా అర్ధం అవుతుంది.

‘రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు నడిపిస్తున్నాం. పదేళ్లపాటు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ.. వారి గురించి మాత్రమే ఆలోచించి... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న లక్ష్యంతో తెలం గాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చే కీలక నిర్ణయాన్ని మంత్రులందరి సంపూర్ణ సహకారంతో తీసుకు న్నాం. అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇందులో మొదటి అంశం చాలా కీలకమైంది.

అప్పుల రాష్ట్రంగా తెలంగాణ!

సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడుపుతున్నాం అన్నారు. అంటే సంక్షేమం జరగలేదా? అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చు. కానీ.. సంక్షోభం అనేది కీలకం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందనేది సీఎం రేవంత్ రెడ్డి వాదన. ఇది ఆయన ఒక్కరి వాదన కాదు... వాస్తవ విరుద్దమూ కాదు. సీఎం మాటలను బట్టి మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా సంక్షోభంలోకి నెట్టారనేది తెలంగాణలోని ప్రతి గుండె ఎరిగిన సత్యమే. సంక్షేమ పథకాలు అమలు చేసి ఉండవచ్చు గాక కానీ... వాటి కోసం ఎడాపెడా అప్పులు చేయడం వల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.

రోజుకు రూ.200 కోట్ల అప్పు చెల్లింపు

కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులు తీర్చడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు రోజు కు రెండు వందల కోట్లు కడుతున్నారు. ఈ ఏడాది కాలంలో 72 వేల కోట్లను అప్పులు తీర్చడానికి వెచ్చించారు. వీటిని తీర్చడానికి 50 వేల కోట్ల వరకు కొత్తగా అప్పులు చేయక తప్పలేదని రేవంత్ సర్కార్ ప్రకటించింది. కానీ... బీఆర్ఎస్ నేతలు మాత్రం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ గగ్గోలు పె ట్టడం దుర్మార్గం. అప్పులు చేసిందే వాళ్ల ప్రభుత్వం. కాబట్టే అప్పుల రాష్ట్రంలోనూ సంక్షేమాన్ని విస్మరించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా చెప్పడం జరిగింది.

‘ప్రజా పాలకునికి నిర్వచనంగా నిలిచి‘

రెండో అంశం విషయానికి వస్తే... పరిపాలనలో ఉమ్మడి రాష్ట్ర సీఎంలను మరిపించే తీరులో తనదైన ముద్ర వేసుకోవడం. కేసీఆర్ సుమారు పదేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. ఏనాడైనా కుదురుగా సెక్రటేరియట్‌లో కూర్చుని ప్రజలను కలిశారా?... పోనీ విమర్శకులు ‘గడి’గా పిలిచే అప్పటి ప్రగతి భవన్‌లో అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారా?..వారి బాధలను తెలుసుకున్నారా? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ శ్రేణులు రకరకాల పిట్ట కథలు చెప్పవచ్చు. కానీ ఏ సామాన్యుడిని అడిగినా చెప్తాడు...అంతెందుకు తెలంగాణ ఉద్యమంలో తన గళాన్ని వినిపించి ఉద్యమాన్ని శిఖరాగ్రస్థాయికి చేర్చడంలో కృషి సాగిం చిన దివంగత గద్దర్ గంటల తరబడి ప్రగతి భవన్ గేట్ వద్ద నిరీక్షించినా కనికరించలేదు. అసలు సొంత పార్టీలు ఎమ్మెల్యేలు సైతం మా దొర దర్శనం ఎప్పుడు దొరుకుతుందో అని నిర్లిప్తంగా మాట్లాడేవారు. ప్రజ లకు అందుబాటులో ఉండాల్సిన పాలకుడు ప్రజల ను దరిదాపులకు కూడా రానియ్యలేదనేది విస్పష్టం.

జనాల్ని కలిసే సీఎం..ఎంత మార్పు..!

మరి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి?... నిత్యం ఇంట్లో లేదా..సెక్రటేరియట్‌లో ప్రజలను కలుస్తూ వారి బాధలు వింటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజాభవన్‌లో వారానికి రెండు రోజులు ప్రజల నుండి నేరుగా వినతి పత్రాలను మంత్రులు స్వీకరించి వాటిని ఆయా శాఖలకు పంపిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇంతేకాదు... ఇంట్లోనో..సెక్రటేరియట్ లోనో..ఫామ్‌హౌజ్ లోనో పడుకోకుండా నిత్యం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల నడుమ ఉంటున్నారు. ఆయన రాష్ట్రంలో ఉంటే వారంలో అయిదు రోజులైనా అభి వృద్ధి..సంక్షేమ... ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కనిపిస్తూ ఉంది. ఒకవేళ సెక్రటేరియట్‌కు రాలేని పరిస్థితుల్లో ఇంట్లో లేదా ఎంసీహెచ్ఆర్డీ. కమాండ్ కంట్రోల్‌లో ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అంతేకాదు... రాష్ట్రానికి రావాల్సిన నిధు లు.. ప్రాజెక్టుల తదితర అంశాలపై కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్తుంటారు. అంతే తప్ప కేసీఆర్ లాగా అయితే ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌజ్‌కే పరిమితం కాలేదు. ఉమ్మడి పాలకులను మించిన తీరులో నిత్యం ప్రజల నడుమ ఉంటూ నిజమైన ప్రజా పాలకునిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి వంటి సీఎంను ప్రజలు అక్కున చేర్చుకుంటారు.

- జంగిటి వెంకటేష్,

జర్నలిస్టు

90528 89696

Advertisement

Next Story

Most Viewed