నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం ఆమె బాధ్యత!

by Ravi |   ( Updated:2024-06-25 01:15:55.0  )
నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం ఆమె బాధ్యత!
X

అరుంధతి రాయ్‌పై ఎన్నో ఏళ్ల కిందటి విషయంపై ఇప్పుడు విచారణ ఏమిటి? అని అన్న ఆలోచన కూడా ఏ మాత్రం సరైంది కాదు. చట్టపరంగా విచారణార్హమైన విషయం లేదా చట్ట రీత్యా విచారణ జరగాల్సిన విషయంపై ఎప్పటికైనా విచారణ జరగాల్సిందే. అరుంధతి రాయ్ విషయంలో లోగడ చట్టపరమైన విచారణ జరపకపోవడం అప్పటి ప్రభుత్వం తప్పు. ఆ తప్పును ఇప్పుడు సరిచేసుకోవడం హర్షణీయం, వాంఛనీయం, అభినందనీయం.

రచయిత్రిగానూ, ఒక సామాజిక కార్యకర్తగానూ చలామణి ఔతున్న అరుంధతి రాయ్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయమయ్యారు. ఉపా చట్టం కింద ఆమెపై విచారణను చేపట్టవలసిందిగా ఢిల్లీ గవర్నర్ ఆదేశించిన దరిమిలా అరుంధతి రాయ్ చర్చనీయమయ్యారు. సాంఘిక మాధ్యమాల్లోనూ, ప్రసార మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ విభిన్న అభిప్రాయాలతో అరుంధతి రాయ్ విషయంగా అనవసరమైన చర్చలు, వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంగా కేంద్ర ప్రజాప్రభుత్వంపై ఒక వర్గంవారు అనాలోచితంగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ తరహా వాదాలూ, ఈ విమర్శలూ ఎంత మాత్రమూ వాంఛనీయం కాదు.

విచారణపై ఇంత రాద్ధాంతమా?

ఒక గవర్నర్ ఆదేశాల మేరకు అరుంధతి రాయ్ విషయంగా సంబంధిత పోలీస్ విచారణ మొదలైన తరువాత అందుకు వ్యతిరేకంగా చర్చ, వాదోపవాదాలు జరగడం సరికాదు. గవర్నర్ ఆదేశించడమంటే దానికి తగిన, సమర్థనీయమైన ప్రాతిపదిక ఉందనే కదా? విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలు చట్టబద్ధంగా జరుగుతాయి. విచారణలోనో, న్యాయస్థానంలోనో అరుంధతి రాయ్ తన నిర్దోషిత్వాన్ని తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అది ఆమె బాధ్యత. ఆ విషయంగా ప్రజల్లోనూ, దేశంలోనూ రాద్ధాంతం అనవసరం అర్థరహితం.

1997లో అరుంధతి రాయ్ రాసిన The God of Small things నవలకు బూకర్ బహుమతి వచ్చింది. దానితో ఆమె ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ బూకర్, రమోన్ మగ్‌సేసే వంటి పురస్కారాలు ఇచ్చి మన దేశంలోని కొందరిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి కొన్ని విదేశీ శక్తులు తమకు కావాల్సిన ప్రయోజనాలను సాధించుకుంటూ ఉంటాయని కొందరు చెబుతారు. అందుకు తగ్గట్టుగానే బూకర్ బహుమతి పొందిన అరుంధతి దేశ వేర్పాటువాద శక్తిగా పేరుపడ్డారు.

కశ్మీర్‌ను దేశం నుంచి విడగొట్టాలా?

కశ్మీర్ విషయంలో అరుంధతి రాయ్ ధోరణి మన దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కాశ్మీర్‌ను దేశం నుంచి విడగొట్టాలని ఆమె మాట్లాడటం రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇది గర్హనీయం. కాశ్మీర్‌లో జరిగిన హిందూ నరమేధం, హిందూ మహిళలపై జరిగిన మానభంగాల దారుణాన్ని ఒక మహిళగా అరుంధతి రాయ్ ఖండించకపోగా కశ్మీర్ ఉగ్రవాదులను పెద్ద ఎత్తున సమర్థించడం ఆమె మాటల్లోనే దేశవ్యాప్తంగా తెలిసింది. అందువల్ల దేశ ప్రజలు ఆమెను తీవ్రంగా నిరసిస్తూ తిరస్కరించారు. టి.వి. డిబేట్లలో ఆమె ధోరణి దేశ ప్రజలకు, చట్టాలకు, దేశ నిర్మాణానికి, దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండటం అందరికీ తెలిసిందే. ఇది ఎంతవరకు సబబు?

కోర్టు ధిక్కరణ తప్పు కాదా?

అరుంధతి రాయ్ లోగడ కోర్టు ద్వారా శిక్షపడ్డ వ్యక్తే. 2002లో కోర్టు ధిక్కరణ నేరం కింద ఆమెకు శిక్ష పడింది. ఆమె ఆ శిక్షను అనుభవించారు. కోర్టు ధిక్కరణ చేయకూడదని తెలిసి కూడా ఆమె ఆ నేరానికి పాల్పడడం ఆమె తత్వాన్ని స్పష్టం చేస్తోంది. దీన్నిబట్టి ఆమె గురించి ఎవరైనా ఒక అవగాహనకు రావచ్చు. 2010లో అరుంధతిపై ఢిల్లీ పోలీస్ సెడిషన్ కేస్ పెట్టారు. 2010లో ఉన్నది ఇప్పటి ప్రభుత్వం కాదు. దీన్నిబట్టి కూడా ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న ఉపా చట్టం విచారణ రాజకీయ కక్ష సాధింపు చర్య అయ్యే అవకాశం లేదని అర్థం చేసుకోవచ్చు. పెద్దస్థాయి పాత్రికేయ వర్గం చాలా ఏళ్ల క్రితమే అరుంధతి రాయ్‌ను దేశ విభజన శక్తులలో భాగంగా భావించారు. ఆమె ఒక అర్బన్ నక్సలైట్ అని అనే అభిజ్ఞ వర్గం ఉంది.

పౌర ధర్మాన్ని పాటిద్దాం!

ఈ విచారణ పూర్తై చట్టపరమైన చర్యల ఫలితాలు తేలేంతవరకూ అరుంధతి రాయ్‌కు సానుకూలంగానూ, కేంద్ర ప్రజా ప్రభుత్వాన్ని అభిశంసిస్తూనూ రాద్ధాంతం చెయ్యడం అభిలషణీయం కాదు పౌరధర్మం కాదు. 'అరుంధతి రాయ్‌పై చట్టబద్ధంగా విచారణ జరుగుతోంది' అన్న తెలివిడితో దేశ చట్టాలను, దేశ రాజ్యాంగాన్ని గౌరవించి మనం పౌర ధర్మంతో మెలగాలి.

-రోచిష్మాన్

94440 12279

Advertisement

Next Story

Most Viewed