చింపుకున్న నాగరికం.. చిరిగిపోయిన పేదరికం

by Ravi |   ( Updated:2024-07-06 00:46:20.0  )
చింపుకున్న నాగరికం.. చిరిగిపోయిన పేదరికం
X

ప్రతి దేశంలో వస్త్ర సంస్కృతి చాలా ముఖ్యమైనది. పూర్వం మన పెద్దలు ‘కట్టు, బొట్టు’ పేర వస్త్రధారణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ నేటి మన యువత ఫ్యాషన్ రంగంలో అమెరికన్, యూరోపియన్ సంస్కృతికి ఎక్కువగా ప్రభావితమై మన స్వదేశీ వస్త్ర సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తున్నారని సాంప్రదాయవాదులు చాలా కాలంగా వాపోతున్నారు. మన దేశ సంప్రదాయాలను విస్మరించి పాశ్చాత్య సంప్రదాయాలకు దాసోహం కావడం విచారకరం.

నేడు వస్త్రధారణలో చోటుచేసుకుంటున్న జుగుప్సాకరమైన మార్పుతో డబ్బున్నోడు బట్టలను ఫ్యాషన్‌ అంటూ చించుకుంటుండగా డబ్బు లేనోడు అవే చిరిగిన బట్టలను కుట్టి వేసుకుంటున్నారు.. ఆ రోజుల్లో ఒక మనిషి ధనవంతుడా, పేదవాడా అన్నది ఆ వ్యక్తీ ధరించే బట్టలను బట్టి అంచనా వేసేవారు. కానీ ఈ రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే వెర్రిలో అత్యధిక శాతం యువత చిరిగిన వస్త్రాలు ధరించడం వలన అది సాధ్యం కావడం లేదు.

పేద, ధనిక అంతరాలు..

పేదవాడు ఆర్థికంగా ఎదగకపోవడానికి కారణం డబ్బు లేకపోవడమే. పేదవారికి ఏదైనా సాధించాలనే ఆలోచన, తపన, అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడానికి పెట్టుబడి పెట్టే స్తోమత ఉండదు. కానీ ధనవంతుడి దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బు అందుబాటులో ఉండటంతో పెట్టుబడి పెట్టి మరింత ధనవంతుడు అవుతున్నాడు. దేశంలో ఇప్పటికీ తినడానికి తిండి లేక నిరుపేదలు అలమటిస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. నిరుపేదలు తిండి దొరకక పస్తులు ఉంటుండగా ధనికులు మాత్రం కడుపునిండా తిని ఎలా అరిగించుకోవాలో తెలియక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే ‘లేనోడు తిండికేడిస్తే. ఉన్నోడు అరగక ఏడ్చిండట’ అనే నానుడి పుట్టిందేమో..! ఉన్నోడికి అన్ని ఉంటాయి లేనోడికి ఏమి ఉండవు అన్నట్టుగా విచిత్రంగా, పేదలకు అందుబాటులో లేని ప్రభుత్వ రేషన్ కార్డులు ధనికులకు లభిస్తున్నాయి, రేషన్ బియ్యం తినని వారికి రేషన్ కార్డులు ఉంటున్నాయి, నిరుపేదలకు మాత్రం రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో అందలేకపోతున్నాయి. ఇది మన దేశంలో పేదలకు జరుగుతున్న అన్యాయం. ఏ ఆపద వచ్చినా నష్టపోయేది పేదలే. ఆకలితో అలమటించేది పేదలే.. నిరుపేదలే ప్రాణాలు కోల్పోతున్నారు.

ధనికులు మాత్రమే ధనవంతులుగా..

భారతదేశం దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నప్పటికీ, దేశంలోని పేదలు ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు. మధ్యతరగతి వారు కూడా పేదలుగా మారుతున్నారు. ధనికులు మాత్రమే ధనవంతులు అవుతున్నారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం, మన దేశంలో అత్యంత పేద రాష్ట్రమైన బిహార్‌లో 52 శాతం మంది పేదలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో సగానికి పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. ఆ రాష్ట్రంలో పోషకాహార లోపం ఉన్నవారి శాతం అత్యధికంగా ఉంది. ఆ తర్వాత జార్ఖండ్ 42.5 శాతం, యూపీ 32 .67 శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 36.65 శాతం, మేఘాలయలో 32.67 శాతం పేదలు ఉన్నారు. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో కేవలం 0.71 శాతం మంది మాత్రమే పేదరికంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో సిక్కిం ఉంది. ఆ తర్వాత తమిళనాడు. ఈ జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. ఏపీ 20వ స్థానంతో కాస్త మెరుగ్గా ఉంది. శిశు మరణాల విషయంలో ఏపీలో 1.82 శాతం, తెలంగాణలో 1.38 శాతం సంభవిస్తున్నాయి.

పేదరిక నిర్మూలన సాధ్యమేనా?

ప్రస్తుతం మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు పేదలకంటే సంపన్నులకు ఎక్కువ అందుతున్నాయని, అందువల్లే భారతదేశంలో పేదలు పేదలుగానే మగ్గుతున్నారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలంటూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదోడి నెత్తిన అధిక భారాన్ని మోపుతున్నారు. ఉచిత పథకాల్లో భాగంగా ప్రభుత్వాలు అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. పైగా ప్రజల సొమ్మును ప్రభుత్వాలు దుర్వినియోగం చేయడం వల్ల పేదరికం మరింత పెరిగే అవకాశం ఉండడమే కాక కొందరు రాజకీయ నాయకుల అవినీతి, స్వార్థ చింతన కూడా ప్రధాన కారణమవుతున్నాయని చెప్పవచ్చు. దేశంలో అవినీతి అంతమై పేదలకు సరైన మెరుగైన మౌలిక సదుపాయాలు లభించినప్పుడు మాత్రమే పేదరికం నిర్మూలించబడుతుంది.

కోట దామోదర్

9391480475

Advertisement

Next Story

Most Viewed