- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దోడూ.. పేదోడూ ఒక్కటేనా?
ప్రభుత్వాలు..సంక్షేమ పథకాలతో అభివృద్ధికి బాటలు వేయడంతో పాటు, పేద మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలవాలి. కానీ అవే సంక్షేమ పథకాలు భవిష్యత్తు తరాలకు సంక్షోభం కాకూడదు. నేటి ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు కొన్ని పేదలకు మేలు చేస్తుండగా, కొన్ని ధనవంతులకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయి. లేనోడికి బుక్కెడు బువ్వ పెట్టడమే నిజమైన సంక్షేమం అయినప్పుడు కడుపునిండా తిన్నోడికి ఇంకా వడ్డిస్తే ఉపయోగం ఏముంటుంది. ప్రజలకు అత్యంత ముఖ్యమైన విద్య, వైద్యాన్ని చివరి వరుసలో పెట్టి మిగిలిన వాటికి అగ్రస్థానం కల్పించడం దేనికి? రాజకీయ అవసరాల కోసం అవసరమైన వాటిని పక్కకు జరిపి అక్కరకు రాని వాటిని తెరపైకి తేవడం వలన పొలిటికల్ లీడర్లు మినహా ప్రజలకు ఏం ఉపయోగం?
ఉన్నోళ్లకు ఎందుకీ పథకాలు..
రాజకీయ పార్టీలు అధికారం కోసమే ఉన్నామన్నట్లు వారి పార్టీ ఉనికి కోసం అమలు కాని హామీలు ఇస్తూ.. అమలు చేస్తూ రాజకీయ చదరంగంలో ప్రజలను పావులు చేస్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకున్నట్లుగా ఇష్టారీతిన పథకాలు అమలు చేస్తూ నిత్యావసరాలు, కరెంట్ బిల్లులు, పెట్రోల్ రేట్ల రూపంలో ముక్కు పిండి వసూలు చేయడం ఎందుకనే ప్రశ్నలను తెరమీదకు తెస్తున్నాయి. నిజంగా ప్రజలకు ఏది అవసరమో అదే అందిస్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సాధ్యం అవుతుంది కదా! లక్షల్లో కట్న కానుకలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, డ్రోన్ కెమెరాలు, భారీ డెకరేషన్ మధ్య ఘనంగా ఏసీ ఫంక్షన్ హాల్‌లో కూతురు పెండ్లి. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు! అయితే అంత డబ్బు ఖర్చు పెట్టి కూతురు పెండ్లి చేసిన కుటుంబాలకు కల్యాణలక్ష్మి సాయం ఎందుకు? లక్షల్లో ఖర్చు చేసినోళ్లకు ఒక్క లక్ష రూపాయలే తక్కువ అవుతాయా? కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం ఎంతో మేలు చేస్తుంది. అయితే కౌలు రైతులను ఏ మాత్రం పట్టించుకోని పాలకులు రైతు బంధు పేరిట అసలు వ్యవసాయమే చేయని, తెలియని భూస్వాములకు ఎందుకు లక్షల్లో పెట్టుబడి సాయం అందిస్తున్నారు? ఇది మాత్రమే కాక దళిత, బీసీ, మైనారిటీలకు చేసే సాయంలోనూ అర్హులైన ఎంతోమంది దగా పడుతున్నారు. ఈ దగా వెనక లబ్దిదారుల ఎంపికలో రాజకీయ నాయకుల జోక్యం ఉంది అనేది బహిరంగ రహస్యమే. ఇదంతా కేవలం ఒకటి రెండు పథకాలకే పరిమితం కాలేదు! మెజారిటీ పథకాల అమలులో ఇదే తీరు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అన్నది ఒకప్పటి మాటైతే సంక్షేమంలో ధనికులపై ఎందుకు చిన్న చూపు అని నేటి ప్రభుత్వాలు కొత్త అర్ధం చెబుతున్నాయి. ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనడంలో నూరు శాతం న్యాయం ఉంది. ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగానే పథకాల రూపకల్పన విధివిధానాలు రూపొందించాలి. కానీ పేదోడితో సమంగా అవసరం లేకున్నా పెద్దోడికి అందడం ఎక్కడి న్యాయం? నేడు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అన్నీ నిజమైన లబ్దిదారులకే అందుతున్నాయా? అని పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
భవిష్యత్తు అంధకారమే..!
సంక్షేమం పేరిట ఇష్టం వచ్చినట్లు పథకాలు అమలు చేస్తూ పోతే భవిష్యత్తులో ముందు తరాలు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్న అన్ని రకాల ఉచితాలు, కొన్ని పథకాల ఉచ్చులో పడితే దేశ ఆర్థిక వ్యవస్థ పైనా ఆ ప్రభావం భారీ స్థాయిలో ఉంటుందనేది వాస్తవం. అదే గనక జరిగితే ఆకాశాన్నంటిన ధరలతో సామాన్యుడికి సరైన తిండి కూడా దొరకని పరిస్థితిలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో! కాబట్టి విద్యావంతులు, మేధావులు ప్రజల్ని ఉచితాల ఉచ్చులో పడకుండా ప్రభావితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సైతం పదవులే పరమావధి కాకుండా నెక్స్ట్ జెనరేషన్, బ్రైట్ ఫ్యూచర్ అనే ధోరణిలో ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.
-కోల హరీష్ గౌడ్
8897022882