చౌక ధరల దుకాణాలు.. ఉన్నట్టా.. లేనట్టా?

by Ravi |   ( Updated:2023-10-02 23:30:43.0  )
చౌక ధరల దుకాణాలు.. ఉన్నట్టా.. లేనట్టా?
X

ఒకప్పుడు చౌకధరల దుకాణం పేరు వింటేనే ఎంతో మంది సామాన్యులకు, పేద ప్రజలకు కడుపు నిండేది. కానీ ఇప్పటి తరానికి ఆ పేరు కూడా తెలియని పరిస్థితులు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల కడుపు నింపడం కోసం ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకు కిలోబియ్యం పథకంతో ప్రారంభమైన చౌకధరల దుకాణాలు నేడు కేసీఆర్ పాలనలో వెలవెలబోతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో బియ్యంతో పాటు చక్కెర, గోధుమలు, కందిపప్పు, పామాయిల్, కిరోసిన్ కూడా పంపిణీ అయ్యాయి. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటితో పాటు చింతపండు, ఉల్లిపాయలు కూడా అదనంగా ఇచ్చారు. కానీ ప్రత్యేక తెలంగాణ అనంతరం కేసీఆర్, ఇటీవలి కాలంలో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలో అసలు చౌకధరల దుకాణాలు ఉన్నట్టా, లేనట్టా అన్న సంశయం వస్తోంది. ఆసరా పథకం కింద 2016 రూపాయల్ని పెన్షన్‌గా ఇచ్చినప్పట్నుంచి రేషన్ షాప్‌ల్లో వివిధ రకాల సరుకుల సరఫరా గూర్చి అడిగే నాథుడే కరువయ్యారు.

రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ బిజినెస్‌కి తోడుగా షాపుల్లోనే బియ్యానికి బదులుగా నగదు బదిలీ జరుగుతున్నా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి మరింత బడ్జెట్ పెంచాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రాల మధ్య రాజకీయ వైరంతో పేద ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కేంద్రంతో కేసీఆర్ వ్యవహరిస్తున్న దుందుడుకు వైఖరి వల్ల రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని చెప్పొచ్చు. కేసీఆర్‌కి ఓటు పథకాలపై ఉన్న దృష్టి పేద ప్రజల కడుపు నింపడంపై లేకపోవడం శోచనీయం. రాష్ట్రంలో వైభవంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన కేసీఆర్‌కి శాశ్వత రేషన్ కార్డులు ఇవ్వడంపై మాత్రం ఎలాంటి ఆలోచన రావడం లేదు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులు కలిగిన అనర్హులు ఎందరో వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఒకవైపు ఇన్‌కం టాక్స్ కడుతూ కూడా, కార్లలో వచ్చి బియ్యం తీసుకుపోతున్న అనర్హుల వల్ల నిజమైన అర్హులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాపంపిణీ వ్యవస్థలో అనర్హులని తొలగించి అర్హులకు మాత్రమే తెల్ల రేషన్ కార్డుల్ని ఇవ్వాలి. చౌక ధరల దుకాణాలను కూడా ఆధునికరించి పేద ప్రజలందరికీ బియ్యం మాత్రమే కాకుండా నెల నెల నిత్యావసర సరుకులన్నింటీని సబ్సిడీపై అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-పసునూరి శ్రీనివాస్

88018 00222

Advertisement

Next Story