- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాల్లో దీపంగా ప్రజారోగ్యం!
విశ్వ మహమ్మారి విలయతాండవానికి విలవిల్లాడుతున్న ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి సరైన ఔషధ చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో, బయటపడటానికి మార్గాన్వేషణ యజ్ఞంలో ఆరోగ్య పరిరక్షణ నిపుణులు నిమగ్నమై టీకాలను సకాలంలో అందించి లక్షల కోట్ల ప్రాణాలను కాపాడటం మనమింకా మరిచిపోలేదు. ఫొర్త్ వేవ్ భారత్‌ను కుదుపేయవచ్చనే సంధి కాలంలో కరోనాతో సహజీవనానికి సిద్ధం కావాలని, వైరస్ విధించిన నియమనిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని, బూస్టర్ డోసు టీకాలను విధిగా తీసుకోవాలని సూచించడం మాత్రమే కోవిడ్-19 కట్టడికి ఏకైక మార్గమని తెలుస్తున్నది.
మహమ్మారుల విపత్తులతో పాటు సీజనల్ వ్యాధుల సునామీలు, ఫ్లూ జ్వరాలు, పర్యావరణ కాలుష్య సంబంధ అనారోగ్య సమస్యల పరిరక్షణకు సంబంధించిన అవగాహన, ఆలోచనల్ని మరోసారి మననం చేసుకోవడానికి 1948లో ఐరాస తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌజన్యంతో 1950 నుంచి ప్రతి ఏటా ఐరాస సభ్యదేశాల్లో డబ్ల్యూహెచ్‌ఓ వ్యవస్థాపక దినమైన ఏప్రిల్ 7న ‘ప్రపంచ ఆరోగ్య దినం (వరల్డ్ హెల్త్ డే)’ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఐరాస నిర్వహించే 9 అధికారిక ప్రపంచ ప్రజారోగ్య సంబంధ వేడుకల్లో ప్రపంచ ఆరోగ్యదినం ప్రధానమైంది.
అందరికీ ఆరోగ్యం మన నినాదం..
అన్ని ఐశ్వర్యాల్లోకి ప్రథమమైనది సంపూర్ణ ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం. వ్యక్తి శారీరక, మానసిక, భావోద్వేగ సంతులిత జీవన స్థితినే అసలైన ఆరోగ్యమని ఐరాస నిర్వచించింది. కాలానుగుణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రజారోగ్య సమస్యలు, సవాళ్ళకు సమయానుకూలంగా సూచనలు, సలహాలు, హెచ్చరికలను చేయడానికి ప్రపంచ ఆరోగ్య దినం వేదిక ఉపయోగపడుతోంది. కరోనా మహమ్మారి దుష్ప్రభావాలతో పాటు ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం పుండు మీద కారం చల్లినట్లు మానవాళి ఆర్థిక చక్రం గాడి తప్పడం, చమురు ధరలు చుక్కలనంటడం, నిత్యావసరాల ధరలు అటకెక్కడం, ఉద్యోగ ఉపాధులు తగ్గిపోవడం, వేతన కోతలు అమలు కావడం, పేదరికం పెరగడం, పోషకాహార లోపాలతో ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోయిన దీనస్థితిలో మానవ సమాజం ఉన్నది. వ్యక్తి ఆరోగ్య పరిరక్షణకు కావలసిన ప్రథమ ఔషధం సంపూర్ణ అవగాహన మాత్రమే అని గమనించాలి. ప్రపంచ ఆరోగ్య దినం 2023 నినాదంగా ‘అందరికీ ఆరోగ్యం (హెల్త్ ఫర్ ఆల్) అనే అంశాన్ని తీసుకుని ప్రచారం చేస్తున్నారు.
అనారోగ్య సమస్యల భారతం..
భారతదేశంలో ఆరోగ్య పరిరక్షణకు సవాళ్ళుగా ఆర్థిక వెనకబాటుతనం, గృహ ఆవాస పరిసరాల అపరిశుభ్రత, అవిద్య, ఉపాధి లేమి, అధిక జనాభా, సామాజిక, ఆరోగ్య అసమానతలు, పేదరికం, లింగ అసమానతలతో మహిళాలోకం నలిగిపోవడం, ఆరోగ్య పట్ల అవగాహన లేమి, పర్యావరణ గాలి, నేల, జల కాలుష్యం, సురక్షిత నీటి కొరత, ఆహార అభద్రత, వైద్య సదుపాయాల కొరత లాంటి పలు సమస్యలు నిలుస్తున్నాయి.
దశాబ్దాలుగా మానవ సమాజాన్ని వెంటాడుతున్న మానసిక అనారోగ్యం, మాతా శిశు సంక్షేమ సవాళ్లు, వాతావరణ మార్పులు ముఖ్యమైన ఆరోగ్య అంశాలుగా గుర్తించారు. ఇండియాలో సాధారణ ఆరోగ్య సమస్యలుగా కాన్సర్, వంధ్యత్వం, కంటి శుక్లాలు, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలు, వినికిడి సమస్యలు, మధుమేహం, గుండె జబ్బులు, అంటువ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, టీబీ, విరేచనాలు, బీపీ, స్థూలకాయం లాంటివి గుర్తించబడ్డాయి.
ఆరోగ్యకర జీవన శైలి అవసరం..
వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం, క్రమశిక్షణ కలిగిన జీవనశైలి, శారీరక వ్యాయామం, శారీరక శుభ్రత, దురలవాట్లు లేకపోవడం, మానసిక ప్రశాంతతకు సదాలోచనలు చేయడం లాంటివి వస్తాయని మరువరాదు. ఆరోగ్యవంతులే అభివృద్ధి రథాన్ని పరుగెత్తించే రథసారధులని గమనించాలి. ప్రాణం ఉంటేనే జీవితమని, జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఆరోగ్య భారత నిర్మాణంలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.
(నేడు ప్రపంచ ఆరోగ్య దినం)
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037