- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ వైపు తటస్థుల చూపు !
కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబడిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి సంజీవనిగా భావించిన ప్రత్యేక హోదాను ప్యాకేజీకి తాకట్టు పెట్టిన వైనం, రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా దానిని పూర్తి చేయలేక నిర్మాణాన్ని ఆటకెక్కించిన వైనం, అలాగే విభజన చట్టంలోని అంశాలు సాధించడంలో గత, ప్రస్తుత పాలకుల వైఫల్యం ఇప్పటికే ప్రపంచానికి తేటతెల్లం అయ్యింది. దీంతో ఏపీలో ఉన్న తటస్థుల చూపు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వైపు మళ్లినట్లు స్పష్టంగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన కేసీఆర్ సారథ్యం ఉండటం తటస్థులను ఆకర్షించడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. రాష్ట్ర శ్రేయస్సు ఆకాంక్షించే ప్రజలలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పై నామమాత్ర వ్యతిరేకత లేదనేది నిర్వివాదాంశం. పోరాట యోధుడిగా, కార్య సాధకుడిగా రాష్ట్ర ప్రజల హృదయాలలో కేసీఆర్ కు మహోన్నత స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారిక గణాంకాల ప్రకారం నాలుగు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకొని ఉన్నారు. వీరిలో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు ఎన్నికల సమయంలో వారికి అనుకూలమైన పార్టీలకు ఓట్లు వేసుకుంటారు. అదే విధంగా రైతులు, నిరుద్యోగులు, వివిధ రకాల కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు లాంటి వివిధ సంఘాలు తమకు ఉపయోగపడే పార్టీని ఎంచుకొని ఎన్నికలలో ఆ పార్టీకి తమ వర్గం చేత ఓట్లు వేయిస్తుంటారు. వీటికి భిన్నంగా ఎటువంటి వ్యక్తిగత లాభం ఆశించకుండా కేవలం రాష్ట్రాభివృద్ధిని ఆశించి ఓట్లు వేసే కొందరు ఉంటారు. వారే తటస్థులు. ఈ తటస్థులలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. కుల, మత, బంధు ప్రీతికి అతీతంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వీళ్ళు ఓట్లు వేస్తుంటారు.
ప్రత్నామ్యాయం కోసం చూస్తున్న వారికి
రాష్ట్రంలో తటస్థ ఓటర్ల సంఖ్య 15 నుంచి 18 శాతం వరకు ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా తటస్థుల ఓట్లే కీలకం. రాజకీయ పార్టీల అధినేతలు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు, చేసే ప్రసంగాలు ఈ తటస్థులను ఆకట్టుకునేందుకేనని కచ్చితంగా చెప్పవచ్చు. గత ఏడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం రెండు కులాల ఆధిపత్యంలో మనుగడ సాగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కులాల ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. దీంతో రాష్ట్రం రావణకాష్టంగా మారింది. రాష్ట్రంలో ఉన్న అధికార వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు కడిగినా పోనివిధంగా కుల మరకలు అంటుకొని ఉన్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు రాష్ట్రంలో పూర్తిగా విశ్వాసం కోల్పోయాయి. అందుకే రాష్ట్రంలో ఉన్న తటస్థులు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కొరకు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవల జాతీయ పార్టీగా ఆవిర్భవించి 'భారత రాష్ట్ర సమితి'గా పేరు మార్చుకున్న సంగతి జగద్విదితమే. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తటస్థుల చూపు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వైపు మళ్లినట్లు స్పష్టంగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన కేసీఆర్ సారథ్యం ఉండటం తటస్థులను ఆకర్షించడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఏపీలో బీఆర్ఎస్ మనుగడపై అనేక రకాల అనుమానాలు చాలామందిలో వ్యక్తమవుతున్నది. ఈ అనుమానాలన్నీ రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు, ఆ పార్టీలకు వత్తాసు పలికే కొందరు ఉద్యోగ సంఘ నేతలే సృష్టిస్తున్నవి కావడం గమనార్హం. కానీ రాష్ట్ర శ్రేయస్సు ఆకాంక్షించే ప్రజలలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పై నామమాత్ర వ్యతిరేకత లేదనేది నిర్వివాదాంశం. పోరాట యోధుడిగా, కార్య సాధకుడిగా రాష్ట్ర ప్రజల హృదయాలలో కేసీఆర్ కు మహోన్నత స్థానం ఉంది.
అవన్నీ కార్యసాధనలో భాగమని నమ్మి
రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ పార్టీల అధినేతలు అనుసరించిన ద్వంద్వ ప్రమాణాలు, పాలన వైఫల్యాలతో ప్రజలు విసిగిపోయారు. కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబడిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి సంజీవనిగా భావించిన ప్రత్యేక హోదాను ప్యాకేజీకి తాకట్టు పెట్టిన వైనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా దానిని పూర్తి చేయలేక నిర్మాణాన్ని ఆటకెక్కించిన వైనం, అలాగే విభజన చట్టంలోని అంశాలు సాధించడంలో గత, ప్రస్తుత పాలకుల వైఫల్యం ఇప్పటికే ప్రపంచానికి తేటతెల్లం అయ్యింది. రాష్ట్రంలో ఉన్న మూడు రాజకీయ పార్టీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోడీ ఒడిలో సేద తీరాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ పరిస్థితుల్లో వీరు విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఆంశాలపై ఏ మాత్రం చిత్తశుద్ధితో పోరాడుతారో ప్రజలు సులభంగా అర్థం చేసుకోవచ్చు.
32 మంది తెలుగు ప్రజల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నా చోద్యం చూస్తూ కుక్కిన పేను వలే నిమ్మకుండి పోయిన ఈ రాజకీయ పార్టీల నేతలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ఇటువంటి పరిణామాలతో రాష్ట్రంలోని తటస్థుల మనస్సు. కేసీఆర్ నాయకత్వం వైపు మళ్ళేటట్లు చేసింది. అప్పట్లో రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్ర ప్రాంత సంస్కృతి, వంటలపై కొన్ని వాఖ్యలు చేసినా, అవి కేవలం కార్య సాధనలో భాగంగా వ్యూహాత్మకంగా చేసినవే కానీ ఆంధ్ర ప్రాంతమంటే, ప్రజలంటే ద్వేషంతో చేసినవి కాదనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పరిపాలన స్పష్టం చేస్తుంది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపారం కొరకు స్థిరపడిన ఆంధ్రులు అత్యధిక భాగం బీఆర్ఎస్ పార్టీతో, ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకోవడమే దానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
రాష్ట్ర సాధన సమయంలో తాను నమ్మిన సిద్ధాంతం కొరకు ఎన్నో కష్టాలు, విమర్శలు ఎదురైనా వెనుకంజ వేయకుండా తనపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలు చేయకుండా తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తనని నమ్మిన ప్రజలకు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ధీరోదాత్తుడు కేసీఆర్. అదే కేసీఆర్ ఇప్పుడు దేశ ప్రయోజనాలు కాపాడేందుకు నడుం బిగించారు. అందులో భాగంగానే దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ పరిణామాలన్నీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ గాడిన పెట్టగలరని తటస్థులు బలంగా విశ్వసిస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే రైతు పక్షపాతిగా ముద్రపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న నీటి వనరులపై కేసీఆర్‌కు అపార పరిజ్ఞానం ఉంది. అందువలన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరంతో పాటూ మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా సస్యశ్యామలం చేసే అవకాశం ఉంటుందని తటస్థులు భావించి బీఆర్ఎస్ పక్షాన నిలబడటానికి నడుం బిగించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లాంటి వర్గాలకు అధికారం సంపాదించి పెట్టాలని వ్యూహరచన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి తటస్థుల మద్దతు కూడా తోడవడంతో ఆ పార్టీ మనుగడ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.
కైలసాని శివప్రసాద్
9440203999
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
ఏపీ లీడర్లకు బీఆర్‌ఎస్ ఆఫర్లు? సీన్‌లోకి కేసీఆర్!