ఏపీ ప్రభుత్వం వందరోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్

by Ravi |   ( Updated:2024-09-21 00:46:19.0  )
ఏపీ ప్రభుత్వం వందరోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్
X

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి. కూటమి అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయింది. కేంద్రంలో కూడా వంద రోజులైన సందర్భంగా మోదీ సమీక్ష చేపట్టారు. వందరోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు ఇదే పని చేయబోతున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తిరుమలకు వచ్చిన చంద్రబాబు ఇక్కడినుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామల రావును టీటీడీ కార్యనిర్వహణాధికారిగా నియమించారు. పాలక వర్గ కూర్పు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌ నియమకంపై అన్ని వర్గాలతో చర్చించి రాజకీయ పునరావాస కేంద్రంలా కాకుండా ఆధ్యాత్మికత సేవ దృక్పధంతో మెలిగే వారిని నియమించాలని కసరత్తు చేస్తోంది. బ్రహ్మోత్సవాల కంటే ముందే ఈ నియామకాలు చేపట్టవచ్చు.

ఒక్కరోజులో పింఛన్ పంపిణీ పూర్తి!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. పింఛన్ నెలకు రూ.వెయ్యి (గతంలో రూ.3వేలును రూ.4వేలకు పెంపు)‌ పెంచారు. పింఛన్ పంపిణీని దాదాపు ఒక్కరోజులోనే పూర్తి చేస్తున్నారు. అంటే దాదాపు 97శాతం నుంచి 99శాతం వరకు పూర్తిచేస్తున్నారు. అలాగే గతంలో వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయిస్తే.. కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయిస్తోంది. వాలంటీర్లు లేకపోయినా సరే విజయ వంతంగా పింఛన్లను ఇంటింటికి పంపిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఏదైనా నెలలో 1వ తేదీ సెలవు వస్తే.. ఒకరోజు ముందుగానే ఫించన్ పంపిణికీ చర్యలు చేపట్టింది.

శ్వేత పత్రాల విడుదల..

ఈ ప్రభుత్వం అధికారం చేపట్టగానే రాష్ట్రంలో వివిధ రంగాల పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పోలవరం అమరావతి, ఇంధన విద్యుత్ రంగ సంక్షోభంపై శ్వేత పత్రాలు విడుదల చేయటం వెనుక నేపధ్యాన్ని పరిశీలిస్తే కుంటు బడిన ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసి ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు వనరులను సమీకరణ మరియు సమీక్షకు అవకాశం కల్పించింది. పోలవరం అమరావతి వంటి భారీ ప్రాజెక్టులపై సమగ్ర వాస్తవిక నివేదికను కేంద్రానికి అందించడం ద్వారా బడ్జెట్ కేటాయింపులను పొందింది.

ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ స్టేట్‌గా

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల పరంగా మళ్లీ మంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ స్టేట్‌గా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే కేంద్రం మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటు చేసే విషయాన్ని ప్రకటించింది. అక్కడ్నుంచి వరుసగా పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గాంధీనగర్‌లో జరిగిన వాయు, సౌర విద్యుత్ సదస్సులో కూడా పలు కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయి. ఎక్కువ మంది తమకు రావాల్సిన పారిశ్రామిక రాయితీల గురించే ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలను చాలావరకూ ఆపేసింది. కొన్ని పరిశ్రమలకు మాత్రమే ఇచ్చింది. చంద్రబాబు సీఎం అయిన వంద రోజుల్లో అనేక పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో సగం ప్రతిపాదనలు అమలు జరిగినా భారీ స్థాయిలో పారిశ్రామికీకరణ జరుగుతుంది. కేంద్రం పదిహేను వేల కోట్ల నిధులను ప్రకటించింది. డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు మళ్లీ పెట్టుబడుల పరంగా ఏపీ అనుకూలమైనదిగా పారిశ్రామిక వేత్తలకు నమ్మకం వచ్చిందని భావిస్తున్నారు.

అన్ని రంగాల్లో అగ్రగామి

గత 100 రోజుల ప్రభుత్వ పాలనను విశ్లేషిస్తే, ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్దిని సమపాళ్లలో ముందుకు తీసుకు వెళ్లడానికి ఓ కార్యాచరణ కృతనిశ్చయంతో పనిచేస్తోంది అన్నది నిజం. అర్థికంగా పుంజుకుంటూ ఆదాయ వనరులను అన్వేషిస్తూ క్రియాశీలకంగా ముందుకు వెళుతూ కేంద్రం నుంచి నిధులు, పారిశ్రామిక వేత్తల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ సహజ వనరులను పరిరక్షిస్తూ యువతలో నైపుణ్యాభివృద్ధికి దోహదమయ్యే విధివిధానాలను రూపొందిస్తూ ఉపాధి కల్పనపై దృష్టి సారించనుంది. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటానికి సిద్దంగా వుంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగించి అన్ని హామీలు నెరవేర్చగలననే భరోసా ఇవ్వనున్నది. ఒకవైపు రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి జవాబుదారీతనాన్ని, పాలనలో పారదర్శకతను తీసుకురావాలని కృషిచేస్తోంది. పాలనలో సాంకేతికతను చొప్పించి వేగాన్ని, గోప్యతను పెంచే చర్యల్లో భాగంగా ఈ కేబినేట్ - ఈ గవర్నెస్‌ను ప్రవేశపెట్టింది. ఇదే స్ఫూర్తి ఇదే ఒరవడి కొనసాగిస్తే అక్షర క్రమంలోనే కాక అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి కాగలదు.

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story