- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ పార్టీలపై చేనేత కులాల ఆగ్రహం
రాజకీయ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కులాలన్నీ ఏకమవుతువున్నాయి. తమ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 13 శాతం, అంటే 65 లక్షల మంది ఉన్న, చేనేతలకు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వని పార్టీలను చూసి ఈ వర్గం ప్రజలు విసిగిపోయారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ ఒక్కొక్కటి కనీసం 5 ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్ కేటాయించాలన్నది చేనేత కులాల, సంఘాల ఐక్యవేదిక డిమాండ్.
ఏపీ ప్రభుత్వం గుర్తించిన బీసీ-బి జాబితా ప్రకారం పద్మశాలి, దేవాంగ, తొగట, తొగటి, తొగట వీర క్షత్రియ, కుర్ని, పట్టుశాలి, శాలి, స్వకులశాలి, కరికాలభక్తులు, కైకోలన్, సెంగుండం, సెంగుంతర్, జాండ్ర, కురిమిసెట్టిశాలి, సేనాపతులు, కర్ణభక్తులు, శాలివన్, సేనాపతులు, స్వకుల శాలి తదితర కులాలకు చెందిన వారిలో అత్యధిక మంది చేనేత, దాని అనుబంధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో చేనేత కులాలవారు ఉన్నారు. వారిలో దేవాంగులు, పద్మశాలీలు అత్యధిక మంది ఉన్నారు. మంగళగిరి, చీరాల, పెడన, రాజంపేట, కడప, రాజమండ్రి, రాజమండ్రి రూరల్, హిందూపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మదనపల్లి, వెంకటగిరి, తాడిపత్రి, ధర్మవరం, పుట్టపర్తి, ఎమ్మిగనూరు, ఆదోని, కదిరి, ఏలూరు, విశాఖపట్నం, గాజువాక, భీమిలి, విజయనగరం, అనపర్తి, ఉప్పాడ, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో చేనేత జనాభా గణనీయంగా ఉంది. అయినా, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ఒక్క ఎంపీ టికెట్ కూడా చేనేత వర్గానికి కేటాయించలేదు.
చేనేతలు ఒక్క ఎంపీ సీటుకూ నోచుకోరా?
అటు అధికార వైసీపీ సైతం మంగళగిరి, ఎమ్మిగనూరు రెండు చోట్ల ఇవ్వగా, టీడీపీ కదిరి టికెట్ ఒక్కటి మాత్రమే ఇచ్చింది. ఈ పార్టీలు 50 లక్షల లోపు ఉన్న కులాల వారికి 20, 30 సీట్లు కేటాయించగా, 65 లక్షల జనాభా ఉన్న చేనేత కులాలకు రెండు పార్టీలు కలిపి మూడు మాత్రమే కేటాయించడం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. చేనేత సామాజిక వర్గం పద్మశాలీలు అధికంగా ఉన్న నియోజకవర్గం మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కర్నూలు ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు ఇస్తారని, అలాగే చీరాల టికెట్ కూడా పద్మశాలి లేదా దేవాంగులకు ఇస్తారని భావించారు. కానీ టీడీపీ వీరికి ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు.
అందరూ ఏకమై..
చీరాలలో చేనేత కులాలకు చెందినవారు దాదాపు 75 వేల మంది ఉన్నారు. చీరాలకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ, తెలుగు యువత నేత, పద్మశాలి యువకుడు చాట్రాసి రాజేష్ చీరాల నుంచి పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన లోకేష్‌కు సన్నిహితంగానే ఉంటారు. కానీ, ఆయనకు కూడా టికెట్ కేటాయించలేదు. అక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే, ఆయన నోరుజారి చేనేత వర్గానికి చెందినవారిని బండబూతులు తిట్టారు. దాంతో టీడీపీ అధిష్టానం అతనిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజేష్‌కు టీడీపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోతే, చీరాలలోని చేనేత కులాలవారందరూ ఏకమై ఆయనను ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి ఒప్పించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అయితే, అందుకు ఆయన సుముఖంగా లేరు. చీరాల టికెట్ చేనేత వర్గాలకు ఇస్తే, రాష్ట్రంలోని చేనేత కులాల వారందరూ ఏకమై, ఇతర బీసీ కులాల సహకారంతో చీరాలపై దృష్టిపెట్టి పట్టుదలతో తమ అభ్యర్థిని గెలిపించుకుంటామని వారు చెబుతున్నారు.
చట్టసభల్లో మాకూ స్థానం కల్పించాలె!
వైసీపీ వారు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ సీఎం, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడుకి అనకాపల్లి ఎంపీ టికెట్, ఆయన కుమార్తె ఈర్లి అనురాధకు మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఒక కుటుంబంలోనే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పార్టీ ఒక కులం లేదా చేనేత కులాలలో 65 లక్షలకు పైగా జనాభా ఉన్నవారికి కనీసం ఒక ఎంపీ టికెట్ ఇవ్వదా? అని ప్రశ్నిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలతోపాటు బీజేపీ, జనసేన పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు విషయంలో చేనేత వర్గానికి అన్యాయం చేశాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో దాదాపు 18 శాసనసభ, 5 లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాల వారు ఉన్నారు. బీసీ కులాలతో పాటు ఇతర కులాల వారు నిరసనలు తెలియజేస్తూ, డిమాండ్ చేస్తూ సీట్లు సాధించుకోగలుగుతున్నారు. చేనేత కులాలలో ఐక్యతా లోపం వల్ల వారి జనాభా స్థాయిలో నిరసన వ్యక్తం చేయలేకపోతున్నారు. డిమాండ్ చేయలేకపోతున్నారు.
ఇప్పటికీ సమయం మించిపోలేదు..
వాస్తవానికి చేనేత వర్గాలలో తిరుగుబాటు స్వభావం తక్కువ. అందువల్ల కూడా వారు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. నష్టపోతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ ఒక్కొక్కటి కనీసం 5 ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్ కేటాయించాలన్నది చేనేత కులాల, సంఘాల ఐక్యవేదిక డిమాండ్. జనసేన, బీజేపీ కూడా ఒక్కో టికెట్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదని ఇంకా సమయం ఉన్నందున ప్రధాన పార్టీలు ఒక్కో ఎంపీ టికెట్ ను, చీరాల ఎమ్మెల్యే టికెట్ ను చేనేత వర్గాల వారికి కేటాయించాలని వారు కోరుతున్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగమే. చట్టసభలలో తమ వర్గం వారు లేకపోతే తమ సమస్యలను లేవనెత్తేవారే ఉండరన్నది వారి ఆవేదన.
-శిరందాసు నాగార్జున
సీనియర్ జర్నలిస్ట్.
94402 22914