- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకూ కావాలి హైడ్రా..
మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వయనాడ్ బీభత్సం తెలియజేస్తే.. బెజవాడ వరదలు మరోసారి కన్నెర్ర జేశాయి. ముఖ్యంగా విజయవాడ సిటీ మధ్యలో ప్రవహించే బుడమేరు నాలుగు జిల్లాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. విజయవాడ సిటీ అయితే రెండు రోజులుగా నిద్ర పోవడం లేదు. సగానికిపైనే నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. విజయవాడ శివారు గ్రామాలు, ఏరియాలు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ఇక సింగ్‌నగర్, రామకృష్ణాపురం, నందమూరినగర్, విజయవాడ వన్‌టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలలో ఇళ్ల లోకి నీరు చేరిపోయింది. రామవరప్పాడు రైల్వే స్టేషన్ అయితే మొత్తానికి నీట మునిగింది. బుడమేరు వాగు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. దాని కట్ట తెగిపోవడంతో విజయవాడను ముంచెత్తింది. చాలామంది ప్రజలు మునిగిపోయిన ఇళ్లలోనే ఇంకా చిక్కుకుపోయారు. వారిని కాపాడటానికి కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లు ప్రత్యేకంగా విజయవాడ చేరుకున్నాయి. ఇంతటి విధ్వంసాన్ని సృష్టించిన బుడమేరు కథేంటి. దానివరదను ఎందుకు అంచనా వేయలేకపోయారు? అనే విషయాల్లోకి వెళితే చాలా అంశాలు బయటకు వస్తాయి.
బుడమేరు -బెజవాడ దుఃఖ దాయని
బుడమేరు అనేది మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. అయితే చరిత్రలో చాలా ఏళ్ల నుంచి దానిని నదిగానే పరిగణిస్తూ వచ్చారు. ఏడాది పొడువునా ఏదో ఒక స్థాయిలో దీన్లో నీళ్లు ఉంటాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు. కొల్లేరుకు నీటిని సప్లయి చేసే అతి ముఖ్యమైన వాగుల్లో ఇది ఒకటి. పుట్టిన ప్రాంతం నుంచి దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే 2005 ప్రాంతంలో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించిందని చెబుతారు. అప్పుడే విజయవాడ చాలా వరకూ దెబ్బతింది. ఆ తరువాత 2009లో మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలికలు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినపుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలకు చేరిపోతూ ఉండేది. అందుకే ఈ నదికి బెజవాడ దుఃఖ:దాయని అని పేరు పడింది.
20 ఏళ్ల నిర్లక్ష్యానికి చెల్లిస్తున్న మూల్యం..
సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయి. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్‌లో గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70 వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు.
యూటీలు సవరించకుండా
బుడమేరు ఉగ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల క్రితం నాలుగైదేళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న “యూ” టర్నింగ్‌లను సవరించాలని 20ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది. 2008 నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్‌టెన్షన్, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా విస్మరించారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజా ప్రతినిధులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని యథేచ్ఛగా ధ్వంసం చేశారు.
వరద ప్రమాదం తప్పించేందుకు..
ఈ ప్రకృతి విపత్తు నుంచి గుణపాఠం నేర్చుకుని బుడమేరును అధునీకరించే దిశగా ప్రయత్నాలు సాగాలి. సాగు తాగునీటి అవసరాలకు అనుగుణంగా బుడమేరు ప్రాజెక్టును నీటి పారుదల నిపుణుల సలహా మేరకు డి.పి.ఆర్ రూపొందించి దానిని క్రియాశీలకం చెయ్యాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న హైడ్రా లాంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చెయ్యాలి. రాజధాని నగరాన్ని విజయవాడ నగరాన్ని వరద ప్రమాదం నుంచి తప్పించే శాశ్వత ప్రయత్నం ప్రభుత్వం ముందున్న సవాలు. వీటిని త్వరగా అధికమించితే ప్రకృతి విపత్తుల నుంచి కొంత వరకైనా ప్రజలను రక్షించవచ్చు. కృష్ణానది కరకట్ట, బడమేరు, అధునీకరణతో పాటు విజయవాడ కాల్వలను సైతం పునరుద్దరించాలి, పూడిక గుర్రపుడెక్కలను తొలగించి ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగిస్తేనే శాశ్వత పరిష్కారం.
శ్రీధర్ వాడవల్లి
99898 55445