ఉద్యోగ, ఉపాధ్యాయులపై కక్షపూరిత విధానాలు వీడాలి!

by Ravi |   ( Updated:2023-04-26 00:46:04.0  )
ఉద్యోగ, ఉపాధ్యాయులపై కక్షపూరిత విధానాలు వీడాలి!
X

రాష్ట్రంలో విద్యారంగంపైనా, ఉపాధ్యాయులపైనా ఆకస్మిక, అప్రకటిత యుద్ధం చేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ తన విధానాన్ని మార్చుకునేదాకా మనం పోరాడక తప్పదు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులను బద్‌నాం చేస్తూ, ప్రభుత్వ విద్యపై దుష్ప్రచారం గావిస్తున్న ఆయన వైఖరిని ప్రతి ఉపాధ్యాయుడూ, ప్రజాతంత్రవాదీ ముక్తకంఠంతో ఖండించకపోతే మన వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. ఎంతో సజావుగా సాగుతున్న విద్యారంగంలో సాధారణ లోపాలు ఎన్నో ఉండొచ్చు. అలాంటి లోపాలను సరిదిద్దే చర్యలు చేపట్టాలి. అంతేగానీ ఎదురుదాడికి దిగొద్దు. అలా దిగితే ఉపాధ్యాయుల వైఖరిని తెలియజేయడానికి ఎంతో సమయం పట్టదు. అధికారుల వైఖరి ఉపాధ్యాయులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే 50 వరకు ప్రభుత్వ యాప్‌లతో ఉపాధ్యాయులను వేధిస్తూ, వాటినే ఆయుధంగా ప్రయోగిస్తూ, విలువైన బోధనా సమయాన్ని కాలరాస్తూ ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యారంగాన్ని నవ్వులపాలు చేస్తున్నారు.

మాపై ఈ ఏడుపెందుకు?

ప్రభుత్వ ఉపాధ్యాయులు చదువు చెప్పడం లేదని చౌకబారు ప్రచారంతో బ్యూరోక్రసీ ముందుకు సాగుతుండడం సరైంది కాదు. ప్రిన్సిపల్ సెక్రటరీ వైఖరి ఆయన సాగిస్తున్న దుష్ప్రచారంపై ప్రభుత్వానికి ఇప్పటికీ ప్రాథమిక సమాచారం వెళ్ళింది. అయినా మంత్రి సైతం ఆయననే వెనకేసుకురావడం దురదృష్టకరం. ప్రభుత్వ అండతో పెట్రేగిపోవాలని చూస్తే ప్రతిఘటన కూడా రెట్టింపు స్థాయిలో ఉంటుందని గుర్తిస్తే మంచిది. అధికారుల పర్యవేక్షణకు వేదిక పాఠశాల కార్యాలయం. అంతే కానీ వీధులు, నివాస ప్రాంతాలు కావు. సామాజిక వ్యవస్థలో పరిధులను అతిక్రమించి ముందుకుపోతే ఆ ప్రభావం వేరేగా ఉంటుంది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వారు సాగిస్తున్న దాడులు అప్రజాస్వామికం, అనైతికం, అసాంఘికం. విద్యాశాఖలో ప్రభుత్వపరంగా ఉన్న లోటుపాట్లను ఏకరువు పెట్టడం మొదలుపెడితే సమాజం వారినే చీదరించుకునే పరిస్థితి వస్తుంది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళితే అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుందని గుర్తించుకోవాలి. అందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ సిద్ధమా? ఉపాధ్యాయులుగా మేము జీతభత్యాల గురించి మాట్లాడడం లేదు. కానీ మీరు అసందర్భమైనా ప్రతి సందర్భంలోనూ మాకు లక్షల్లో జీతాలిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం?

2018 నుంచి ఇప్పటిదాకా ఒక్క డి.ఏ కూడా ఇవ్వలేదు అయినా మేము ఓపిగ్గానే భరిస్తున్నాం. డి.ఏ అంటే ఎప్పుడివ్వాలి, ఎందుకోసం ఇవ్వాలో అర్థం తెలుసా ఈ ప్రభుత్వానికి? పీఆర్సీ అంటే కోతలు విధించడమని ఈ ప్రభుత్వం నిర్వచించింది, అయినా మేం నిశ్శబ్దంగా ఉంటున్నాం. పీఆర్సీ బకాయిలను దాటవేశారు అయినా మౌనంగానే ఉంటున్నాం. మీరు జీతాలు పెంచొద్దు. ధరలు తగ్గించండి. సామాన్య ప్రజలను కూడా ఆదుకోండి. నిజమైన పరిపాలన అందివ్వండి చాలు. మీరేమో వేలకు వేలు ఖజానా నుంచి తీసుకొంటూ ఉద్యోగుల ఇంటి అద్దె కత్తిరిస్తారా? అయినా నిస్వార్థంగా పనిచేస్తున్నాం కదా అయినా మా మీద ఈ ఏడుపెందుకు?

చట్టబద్ధంగా రావాల్సిన వాటిపైనే..

డీఏ కలిపి పీఆర్సీలో వేతనాలు పెరిగాయంటున్నారు మీరు దీనిపై చర్చకు రెడీనా? ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా, ఆపైన ఉండే మరే ఆర్థిక నిపుణులతో నైనా చర్చకు మేం సిద్ధం. మీరు మొత్తం ఆర్థిక వ్యవస్థ గురించి చర్చకు సిద్ధమేనా? ఉపాధ్యాయుల, ఉద్యోగుల పి.ఎఫ్, ఎపిజిఎల్‌ఐ నిధులను గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ గల్లా పెట్టెలోకి లాక్కున్న విషయంపై చర్చిద్దామా? మరి ప్రభుత్వ విధానాలను చర్చించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ సిద్ధమా? నాడు నేడులో విశృంఖల దోపిడీపై చర్చకు సిద్ధమా? పాఠ్యపుస్తకాల పంపిణీలో లోపాలపై చర్చకు సిద్ధమా? జీఓ 117పై చర్చకు సిద్ధమా? ప్రాథమిక పాఠశాలల్లో ఉండాల్సిన తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించిన విధానంపై చర్చకు సిద్ధమా? వేలాది ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల గురించి చర్చకు సిద్ధమా? ఐదేళ్లుగా విడుదల కానీ డీఎస్సీ గురించి చర్చిద్దామా? సెకండరీ గ్రేడు ఉపాధ్యాయ ఖాళీలను ఎలా రద్దు చేశారో చర్చకు సిద్ధమా?

ఆర్థికంగా మేము ఉపాంత ప్రయోజనాలు ఆశించడం లేదు. ఆయాచితంగా లబ్ది పొందాలని లేదు, సాధారణ ప్రజల హక్కులను, లబ్ధిని కూడా కోరుకోవడం లేదు. చట్టబద్ధంగా రావలసిన వాటి గురించి మాట్లాడుతున్నాం. నెలలో ఒకటో తారీఖున అందాల్సిన వేతనాలు పదిరోజులు గడిచినా అందకపోయినా ప్రశ్నిస్తే చర్యలు తీసుకుంటామనే అదిరింపులు. బ్యాంకుల్లో రుణాల కుస్తీలు చెల్లింపులు నిలిచిపోయినా చెక్కులు బౌన్స్ అవుతున్నా నోరెత్తకూడదు. నిజానికి మా జీతాలు మరీ ఎక్కువేం లేవు. ఇక్కడ చదివిన విద్యార్థులే సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేర రెట్టింపు వేతనాలు పొందుతున్నారు. రూ.398, రూ.1200, రూ.1500, రూ.1800 ఇలా ఉపాధ్యాయుల వేతన బ్రతుకు ప్రారంభమైందన్న సంగతి ఎవరూ మరువకూడదు. ప్రైవేట్ ఉద్యోగితో పోల్చితే ఉపాధ్యాయుల వేతనాలు గొప్పగా ఏమీ లేవు. భూమికి ఆకాశానికి మధ్య దూరంతో సమానంగా ఉన్నాయి. పెరిగిన ధరలు, పెచ్చరిల్లుతున్న జీవితావసరాలు ఉద్యోగులను ఇంకా కుంగదీస్తూనే ఉన్నాయి.

రాష్ట్ర మంత్రిగా ఉండి ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా ఉండాల్సిన మీరు, వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా కారుచౌకగా, కనీస బాధ్యత లేకుండా పొరపాటు చేస్తున్న వారిని వెనకేసుకురావడం, అధికారులను, ఉపాధ్యాయులను విభజించి మాట్లాడడాన్ని కూడా ఉపాధ్యాయులు నిశితంగా గమనిస్తున్నారు. దీనిపై మీకు ఫిర్యాదు చేస్తే వారిని వెనకేసుకుంటూ వచ్చి మా అధికారులు అంటున్నారు, మరి ఉపాధ్యాయులెవరో? ఐదేళ్ళకే అస్త్ర సన్యాసం చేసే వారు కాదు కదా? ఉద్యోగ ఉపాధ్యాయులు జీవితకాలమంతా బాధ్యతాయుత విధుల్లో వుండేవారనే వాస్తవం మీకు తెలుసా? ఈ ఆధునిక ప్రజాస్వామ్య చట్టాలు అపరిమిత అధికారాలతో జూలు విదిల్చి జులుం చేస్తుంటే చేవచచ్చి ఉంటున్నాం. ఇక ఉపేక్షించం, పోరాడతాం. ఈ సస్పెన్షన్లు, అరెస్టులు వంటి చర్యలు ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని గుర్తించుకుంటే మంచిది. ప్రభుత్వ విద్యారంగ, ఉపాధ్యాయుల విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలను ముక్తకంఠంతో ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోండి.

-మోహన్ దాస్

ఏపిటీఎఫ్ 1938 రాష్ట్ర కౌన్సిలర్

94908 09909

Advertisement

Next Story

Most Viewed