- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికన్ ప్రొమితియస్..ఒప్పెన్ హైమర్
గ్రీకు పురాణాల్లోని తిరుగుబాటు వీరుడు ‘ప్రొమితియస్’. ఆయన ఒలింపియన్ (ఒలింపస్ పర్వతంపై నివసించే) దేవుళ్ల నుండి ‘అగ్ని’ని తెలివిగా దొంగిలించి మానవజాతికి అందించాడు. మానవులు అగ్నిని మంచి కోసమూ, చెడు కోసమూ ఉపయోగించసాగారు. కోపగించిన దేవతలు ‘ప్రొమితియస్’ను బంధించి, శాశ్వతంగా అతడ్ని నానా యాతనలకు గురిచేశారు. అలానే ప్రథమ అణుబాంబు జనకుడైన జె. రాబర్డ్ ఒప్పెన్‌హైమర్ (సూక్ష్మంగా ఒప్పీ లేదా రాబర్ట్) కూడా అణువులో దాగిన బ్రహ్మాండమైన శక్తిని బయటికి తీసి రెండో ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించిన అమెరికా చేతిలో పెట్టాడు. అమెరికా దాన్ని తన సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం జపాన్‌లోని జనావాసాలపై ప్రయోగించింది. ఆ తర్వాత తన ఆవిష్కరణపై తనే పశ్చాత్తాపపడుతున్న ఒప్పెన్‌హైమర్‌పై లేనిపోని నిందలు మోపి, విచారణలు జరిపి అమెరికా అతన్ని హింసించింది. ఆ విధంగా ఒప్పెన్‌హైమర్ ‘అమెరికన్ ప్రొమితియస్’ అయ్యాడు.
అతని జీవిత చరిత్రను అమెరికన్ రచయిత మార్టిన్ జె. షెర్విన్ 20 యేళ్ల పాటు రిసెర్చి చేసి 50,000 పేజీల రాత ప్రతుల్ని తయారుచేశాడు. చివరికి తన మిత్రుడు కాయ్ బర్డ్స్ సహాయంతో ‘అమెరికన్ ప్రొమితియస్ - ద ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జె. రాబర్డ్ ఒప్పెన్‌హైమర్’ అనే పుస్తకాన్ని 2005లో ప్రచురించాడు. ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు క్రిస్టొఫర్ నోలాన్ ఈ పుస్తకం ఆధారంగా నిర్మించిన తాజా సినిమా ‘ఒప్పెన్‌హైమర్’.
ఒప్పెన్ హైమర్ విద్యాభ్యాసం
యూదు కుటుంబంలో జన్మించిన జె. రాబర్ట్ ఒప్పెన్‌హైమర్ చిన్నతనం నుండే అసాధారణ ప్రజ్ఞాపాటవాలు కనబరిచాడు. యువ రాబర్ట్ మదిని పరమాణు నిర్మాణం, క్వాంటం ఫిజిక్స్ ప్రతిపాదనలకు సంబంధించిన దృశ్యాలు కలవరపెడుతూ వుంటాయి. తన అభిమాన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త నీల్స్ బోర్ ఇచ్చిన సలహా మేరకు జర్మనీ గోట్టింగెన్ విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా పీహెచ్‌డీ సంపాదిస్తాడు. అక్కడ అతడు వెర్నెర్ హైసెన్‌బర్గ్, ఎన్రికో ఫెర్మి, ఎడ్వర్డ్ టెల్లర్ వంటి దిగ్గజాలను కలుస్తాడు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో సహా జర్మనీలోని పేరున్న యూదు శాస్త్రవేత్తలు హిట్లర్ జాతిసంహార పాలసీ కారణంగా అమెరికాకు పారిపోయారు. పైన చెప్పిన ముగ్గురిలో వెర్నెర్ హైసెన్‌బర్గ్ ‘జర్మన్ బాంబు’ ప్రాజెక్టులో ఉండిపోగా, ఎన్రికో ఫెర్మి, ఎడ్వర్డ్ టెల్లర్‌లు తర్వాతి కాలంలో ‘అమెరికా బాంబు’ ప్రాజెక్టులో భాగమయ్యారు. క్వాంటం మెకానిక్స్‌ను యునైటెడ్ స్టేట్స్‌కు తీసుకువచ్చిన ఒప్పెన్‌హైమర్ బర్కిలీలో బోధించడం ప్రారంభించాడు. లోమానిట్జ్ అనే ఒకే విద్యార్థితో ప్రారంభించిన తరగతికి కొద్ది యేళ్లలోనే మరికొందరు హాజరవుతారు.
మాన్‌హట్టన్ ప్రాజెక్ట్
పోలాండ్‌పై హిట్లర్ దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. క్వాంటమ్ ఫిజిక్సును యూదుల ఫిజిక్స్ అని నాజీలు అభివర్ణించారు. వారి యూదు వ్యతిరేకత కారణంగా ప్రపంచంలోని జర్మనీ ఆక్రమిత ప్రాంతాల్లోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఇతర దేశాల గుండా అమెరికాకు చేరారు. అలా చేరిన వారిలో జిలార్డ్ తదితరులు ఐన్‌స్టీన్ మద్దతుతో - కేవలం జర్మనీకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో - అణ్వస్త్రాన్ని నిర్మించాలని అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ను కోరారు. ఆ ఫలితంగా తయారైనదే మాన్‌హట్టన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు మిలటరీ అధికారి కల్నల్ లెస్లీ గ్రోవ్స్. అతడు ఒప్పెన్‌హైమర్‌ను ఈ ప్రాజెక్ట్‌కు సైంటిఫిక్ హెడ్‌గా ఉండాలని కోరుతాడు. ఎఫ్‌బీఐ వారించినప్పటికీ, గ్రోవ్స్‌కు ఒప్పీ సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో అతడే కావాలని పట్టుబడతాడు.
ఒప్పీకి చిన్నప్పటి నుండీ మెక్సికో బార్డర్‌కు దగ్గర్లోని న్యూ మెక్సికో అనే ఎత్తైన ప్రాంతం చాలా ఇష్టం. ఆ స్థలాన్నే తమ ప్రాజెక్టు కోసం ఎంచుకుంటాడు. నిర్మానుష్యమైన ఆ స్థలంలో కొద్దిపాటి రోజుల్లో ఒక చిన్న టౌన్‌షిప్ ఆవిర్భవిస్తుంది. దేశంలోని అగ్రశ్రేణి శాస్త్రజ్ఞులైన లియో జిలార్డ్, హన్స్ బెతే, రిచర్డ్ ఫెయిన్‌మాన్, ఎడ్వర్డ్ టెల్లర్, ఇసిడోర్ రబీ, వెన్నెవర్ బుష్ లాంటి వారు కుటుంబాలతో వచ్చి ప్రాజెక్ట్ స్థలంలో కాపురాలు పెడతారు. పరిశోధనలు సాగించే వేర్వేరు శాఖలు గోప్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తాయి. న్యూ మెక్సికో, ఫిజిక్స్ సంగమ ఫలితంగా ప్రథమ అణుబాంబు తయారౌతుంది. రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో వేలాది శాస్త్రవేత్తలు సాగించిన మూడేళ్ల శ్రమ ఫలితంగా మాన్‌హట్టన్ ప్రయోగాలు సత్ఫలితాలతో ఓ కొలిక్కి వచ్చాయి.
హిట్లర్ ఓటమితో మారిన పరిస్థితి
స్టాలిన్ నాయకత్వంలోని రెడ్ ఆర్మీ అసామాన్య పోరాటాల ఫలితంగా 1945 మే 7న జర్మన్ ఓడిపోయింది. హిట్లర్ బంకర్లోకి దూరి ఆత్మహత్య చేసుకున్నాడు. జపాన్ నుండి మరీ పెద్ద ప్రమాదమేదీ లేదని మిత్ర పక్షాలు భావించాయి. అందుకే ఓడిన జర్మనీలోని పోట్స్‌డామ్ పట్టణంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి యుద్ధాన్ని ముగించే దిశగా అడుగులు వేయాలని బ్రిటన్ ప్రధాని చర్చిల్, సోవియట్ అధ్యక్షుడు స్టాలిన్ భావించారు. కానీ రూజ్‌వెల్ట్ తర్వాత అధికార పగ్గాలు పట్టిన రైటిస్ట్ ‘రిపబ్లికన్’ హెన్రీ ఎస్. ట్రూమన్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. హిట్లర్‌ను ఓడించిన గొప్పతనం సోవియట్‌కు దక్కిన తర్వాత, యుద్ధానంతర ప్రపంచంలో తన ప్రాముఖ్యతను ప్రతిష్టించుకునే దొంగెత్తులు ట్రూమన్ వేస్తున్నాడు. అందుకే పోట్స్‌డామ్ కాన్ఫరెన్సు డేటును పొడిగించాడు. చివరికి హిట్లర్ ఓడిన రెండున్నర నెలలు దాటాక జూలై 17, 1945న ఆ సమావేశం పెట్టుకోడానికి ఒప్పుకున్నాడు ట్రూమన్.
ట్రినిటీ టెస్ట్
పోట్స్‌డామ్ కాన్ఫరెన్సు జరిగేలోగా అణుబాంబును పరీక్షించి ఆ ఫలితాలను తన దగ్గరుంచుకుని చర్చల్లో పాల్గొనాలన్నది ట్రూమన్ ఆలోచన. అప్పటికే మూడు అణుబాంబులు తయారయ్యాయి ఒకటి యురేనియంతో, మరో రెండు ప్లుటోనియంతో. ప్లుటోనియంతో తయారైన వాటిలో ఒకదాన్ని న్యూ మెక్సికో అలమగాడ్రో ఎడారిలో జూలై 16న (కాన్ఫరెన్సుకు ముందురోజు) పరీక్షించాలని నిర్ణయించారు. పరీక్ష చేస్తున్నదాన్ని బాంబు అని అనకుండా ‘గాడ్జెట్’ (సాధనం) అన్న మాటను మాత్రమే ప్రయోగిస్తున్నాడు ఒప్పెన్‌హైమర్. ఆ పరీక్షకు ‘ట్రినిటీ పరీక్ష’ అని పేరు పెట్టాడు ఒప్పీ. (‘ట్రినిటీ’ అనేది జాన్ డన్ కవితలో వచ్చే పదం. దాన్ని తనూ, టాట్‌లాక్ ఇష్టపడి చదివేవారు.) ట్రినిటీ పరీక్ష విజయవంతమైంది. రాత్రంతా కురిసిన వర్షం ఆగిన తర్వాత వేకువ జామున ఐదున్నరకి ప్రథమ అణుబాంబు పరీక్ష జరిగింది. అప్పుడు వెలువడిన వేడీ, వెలుతురూ చూశాక అప్రయత్నంగానే ‘నేను మృత్యువుగా మారాను, సమస్తలోకాన్నీ కబళించే వాడిగా మారాను’ అనే శ్లోకాన్ని గొణిగాడు ఒప్పీ. హిట్లర్ ఓడిపోయాడు కనుక ఇక బాంబు ప్రయోగం వద్దు అని పోరుపెడుతున్న జిలార్డ్ వంటి శాస్త్రవేత్తల మాటల్ని ఒప్పీ లక్ష్యపెట్టలేదు. ఈ బాంబు పరీక్ష దృశ్యంతో అతని వెన్నులో మెల్లగా వణుకు ప్రారంభమైంది.
వెలివేయబడ్డ ఒంటరి ఒప్పీ
ఎంతటి పెద్ద మేధావైనా, కళాకారుడైనా, రచయితైనా, శాస్త్రవేత్తయినా ప్రభుత్వానికి అవసరం తీరాక ప్రక్కకి తొలగాల్సిందే. జపాన్‌పై అణుబాంబులు వేయడానికి అమెరికా దొంగ కారణాలు చాలా చెప్పింది. జపాన్‌లో ఎటువంటి బాంబు దాడికీ గురికాని రెండు ‘వర్జిన్ సిటీస్’పై బాంబులు వేసి, ప్రయోగఫలితాలు చూడాలనీ, రానున్న రోజుల్లో ప్రపంచాన్ని భయపెట్టాలనీ అమెరికా ఆలోచన. ఆగస్టు 6న హిరోషిమాపై ‘లిటిల్ బాయ్’ (బుల్లబ్బాయి) అనే యురేనియం బాంబును ప్రయోగించారు. మరో మూడు రోజుల్లో ఆగస్టు 9న నాగసాకిలో ‘ఫ్యాట్‌మాన్’ (లావుమనిషి) అనే ప్లుటోనియం బాంబు వేశారు. క్షణాల్లో లక్షలాదిమంది బూడిదయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజుల్లో, వారాల్లో, నెలల్లో, సంవత్సరాల్లో బాంబు ఫలితాల వలన, రేడియేషన్ వలన మరికొన్ని లక్షల మంది చనిపోయారు.
హిట్లర్ అణుబాంబు తయారుచేస్తే ప్రయోగించే వాడేమో! అమెరికా తయారు చేసింది, అవసరం లేకపోయినా జనాలపై వేసింది. ఫాసిజానికీ, సోకాల్డ్ ప్రజాస్వామ్యానికీ మధ్య విభజన రేఖ చెరిగిపోయింది. బాంబు వేయాల్సిన నగరాల ఎంపిక సమావేశంలో ఒప్పీ ఉన్నాడు. హిరోషిమా బాంబు వరకూ అతడు ఓకే. ‘ఒక అతి పెద్ద బాంబు ప్రయోగం తర్వాత శాశ్వతంగా యుద్ధాలు జరగకుండా చూడవచ్చు’ అన్న అతడి ఊహ తర్కసమ్మతమైనదిగా అన్పించదు. కానీ నాగసాకీ ప్రయోగం తర్వాత రాబర్ట్ ఆలోచనలు చాలా వరకు మారాయి. ఓడిపోయిన మనిషిలా, మోసగించబడిన మనిషిలా, అపరాధ భావనతో ఒంటరితనంలోకి కూరుకుపోయాడు.
అణుబాంబు టు మిస్సైల్స్
అణుబాంబు నిర్మించాక కూడా సోవియట్ అటువంటి బాంబు తయారుచేసేస్తుందేమోనని అమెరికా భయపడింది. సోవియట్ ఆ పని చేసిందని తెలిశాక, అమెరికా హైడ్రోజన్ బాంబు తయారు చేసింది. సోవియట్ జార్ బాంబు తయారుచేసింది. వేరే దేశాలు ఫాలో అయ్యాయి - ఆఖరుకు ఇండియా, పాకిస్తాన్, కొరియా కూడా...! ఇన్ని ఆయుధాలతో, ఒకప్పుడు విమానాలతో అణుబాంబులు వేయాల్సిన పరిస్థితి నుండి నేడు ఖండాంతరాలకు నూక్లియర్ వార్‌హెడ్‌లను మోసుకుపోగల ‘ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్’ తయారయ్యాయి. అణుబాంబు ప్రయోగం తర్వాత దాని సృష్టికర్త జె. రాబర్ట్ ఒప్పెన్‌హైమర్‌కు ఎప్పుడూ కనిపించే భయాలూ, భ్రమల దృశ్యం మరలా కళ్ల ముందు కనిపిస్తుంది. అతడు కళ్లు మూసుకుంటాడు.
(నేడు హిరోషిమా పై అమెరికా అణుబాంబు ప్రయోగించిన రోజు)
బాలాజీ
సినీ సమీక్షకులు, కోల్‌కతా
90077 55403