ఉపాధి అవకాశాల దేశం అమెరికా

by Ravi |   ( Updated:2022-09-03 13:25:49.0  )
ఉపాధి అవకాశాల దేశం అమెరికా
X

సుమారు వంద సంవత్సరాల క్రితం నుంచే మన దేశం నుంచి అమెరికాకు వలసలు ప్రారంభమయ్యాయి. మొదట కార్మికులు పెద్ద సంఖ్యలో అమెరికాలో పని చేసేందుకు వచ్చారు. ఆ తరువాత వ్యాపారులు వచ్చారు. 1980 నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల రాక ముమ్మురమైంది. సాఫ్ట్‌వేర్‌ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. అమెరికాలో భారత ప్రజల సంఖ్య సుమారు 26 లక్షల 88 వేలు. మెక్సికో, చైనా, పిలిప్పీన్స్‌ తరువాత మనవారే ఎక్కువ. కేలిఫోర్నియా రాష్టంలో అత్యధికంగా 20 శాతం మంది ఇండియన్స్‌ నివసిస్తున్నారు.

దేశంలోనైతే ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం ఉంటుందో ఆ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న దేశం అమెరికా. అందువల్లనే అమెరికాను 'ల్యాండ్‌ ఆఫ్‌ ఆపర్చుటునీస్' అని పిలుస్తారు. ఈ కారణంగానే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల యువతీ యువకులకు తమ భవిష్యత్తును అద్భుతంగా నిర్మించుకునేందుకు అమెరికా అవకాశం కల్పిస్తోంది. మన దేశానికి చెందిన సత్యనాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ లాంటి ఉన్నత విద్యావంతులు అమెరికాలోని రెండు పెద్ద స౦స్థలకు అధిపతులుగా పని చేస్తున్నారంటే దానికి కారణం ఆ దేశం అనుసరిస్తున్న సానుకూల విధానాలేనని చెప్పవచ్చు.

మానవ వనరులను చక్కగా ఉపయోగించుకుంటున్న దేశం అమెరికా. సు౦దర్‌ పిచాయ్‌ గూగుల్‌ సంస్థకు, సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సంస్థకు అధిపతులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో క౦టే అమెరికాలోనే విద్య ఉపాధి అవకాశాలు ఉత్తమంగా ఉన్నాయని మన దేశ యువతరం భావిస్తున్నందు వల్లనే యూఎస్ వచ్చే౦దుకు వేల మంది ప్రయత్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకార౦ 500 రోజుల వరకు వీసా అప్లికేషన్ స్లాట్‌లు అందుబాటులో లేవని తెలుస్తోంది. ఇప్పటికే మన దేశానికి చెందిన వేల మంది యువతీ యువకులు వీసా స్లాట్‌ల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు.

శరవేగంగా అభివృద్ధి

ఆధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం, ఆర్గానిక్‌ ఫుడ్‌, సకల సౌకర్యాలతో నివాసాలు, మొదలగు అ౦శాలు విదేశీ యువతీ యువకులను బాగా ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుంగా, అమెరికాలోని ఒక డాలర్‌ విలువ మన దేశ కరెన్సీ లో 80 రూపాయలు. అమెరికన్‌లు నదులకు నడక నేర్పి, వాగులను వంకలు తిప్పి నీటిని వృథా చేయకుండా ఎక్కడికక్కడ మంచి నీటి చెరువులను నిర్మించారు. ఒక చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన దేశంలో మాదిరిగా చిన్న ప్రవాహాలకు అడ్డంగా ఇండ్లు నిర్మించడం అమెరికాలో ఎక్కడా కనిపించదు. ఇక ఈ దేశంలో బోరు బావుల తవ్వకాన్ని పూర్తిగా నిషేధించారు. వాస్తవానికి అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో ఏడాదిలో చాలా కాలం రహదారులు, ఇతర ప్రదేశాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఆ ప్రాంతాలలో ఎల్లప్పుడు మంచు కురుస్తూనే ఉంటుంది.

మన దేశంలో మంచు కురిసే ప్రాంతాలు చాలా తక్కువ. అమెరికాతో పోలిస్తే భారత దేశంలోనే సహజ వనరులు, మానవ వనరులు అత్యధికంగా ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికా అన్ని రంగాలలో శరవేగంతో అభివృద్ధి సాధించింది. అమెరికాలో కొత్తగా నిర్మిస్తున్న నివాసాల పైకప్పులపై సోలార్‌ ప్యానల్స్‌ బిగిస్తున్నారు. సూర్యరశ్మిని స్వీకరించి ఈ ప్యానల్స్‌ కరెంటును ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికాలో ప్రతి కొత్త ఇంటిని స్వయం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా మార్చారు. భారతదేశంలో లభించే ప్రతి వస్తువు ఇక్కడికి దిగుమతి అవుతోంది. ఆహార పదార్థాలలో కల్తీ చాలా తక్కువ. పటేల్‌ బ్రదర్స్‌, దేశీ బ్రదర్స్‌ క౦పెనీలకు సంబంధించిన సూపర్‌ మార్కెట్లు అమెరికాలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ నెలకొల్పారు. అమెరికా ఒకప్పుడు పేద దేశమే.

అగ్రరాజ్యంగా అవతరించింది

1776 జూలై 4న గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి అమెరికా స్వాతంత్ర్యాన్ని సాధించింది. అప్పటి వరకు బ్రిటిష్‌ పాలకుల కింద వలన దేశంగా మగ్గింది. అనేక వీరోచిత పోరాటాలు, ఉద్యమాల అనంతరం మన దేశంలో మాదిరిగానే తెల్లదొరలు అమెరికా నుంచి వైదొలిగారు. వైశాల్యంలో మూడవ అతిపెద్ద దేశంగా పేరొందిన అమెరికా జనాభా 30 కోట్లు మాత్రమే. అమెరికాలో మాంసాహారుల సంఖ్యనే ఎక్కువ. చికెన్‌, మటన్‌, బీఫ్‌, పోర్క్‌ తదితరాలను అమెరికన్లు ఇష్టంగా భుజిస్తారు. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. వైశాల్యం 95 లక్షల చదరపు కిలో మీటర్లు. 50 రాష్ట్రాలు. అమెరికాలో కార్ల సంఖ్య చాలా ఎక్కువ. పార్కింగ్‌లో ఇబ్బందులుండవు. యూఎస్‌లో 40 శాతం మంది ప్రజలు 7.75 కోట్ల కుక్కలను పెంచుకుంటున్నారు.

యేటా అమెరికాలో 4,500 కోట్ల డాలర్ల కుక్కల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం జరుగుతోంది. ఇదిలా ఉండగా 25 శాతం ఆఫ్రికన్‌ అమెరికన్‌లు నిరుపేదలు. ఇండ్లులేని వారి సంఖ్య 6.64 లక్షలు. జనాభాలో 9.5 శాతం నిరుద్యోగులున్నారు. ఒకప్పటి సోషలిస్ట్‌ రష్యా సమాఖ్య పతనం తరువాత అమెరికా అగ్రరాజ్యంగా అవతరించింది. సుమారు వంద సంవత్సరాల క్రితం నుంచే మన దేశం నుంచి అమెరికాకు వలసలు ప్రారంభమయ్యాయి. మొదట కార్మికులు పెద్ద సంఖ్యలో అమెరికాలో పని చేసేందుకు వచ్చారు. ఆ తరువాత వ్యాపారులు వచ్చారు. 1980 నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల రాక ముమ్మురమైంది. సాఫ్ట్‌వేర్‌ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. అమెరికాలో భారత ప్రజల సంఖ్య సుమారు 26 లక్షల 88 వేలు. మెక్సికో, చైనా, పిలిప్పీన్స్‌ తరువాత మనవారే ఎక్కువ. కేలిఫోర్నియా రాష్టంలో అత్యధికంగా 20 శాతం మంది ఇండియన్స్‌ నివసిస్తున్నారు. టెక్సాస్‌, న్యూజెర్సీ, న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, జార్జియా తదితర రాష్ట్రాలలో కూడా భారతీయులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.

జి గంగాధర్‌ సిర్ప

అమెరికా

90103 30529

Advertisement

Next Story

Most Viewed