- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బడ్జెట్లో విద్యారంగానికి.. కేటాయింపులు పెంచాల్సిందే..!
21వ శతాబ్దంలో భారతీయ యువత ప్రపంచంతో పోటీ పడాలని వారికి నాణ్యమైన విద్యను అందించాలని, వారిలో సృజనాత్మకతను పెంచాలని భారత ప్రభుత్వం 29 జూలై 2020 రోజున నూతన జాతీయ విద్యా విధానం-2020 ను తీసుకొచ్చింది. దీని ప్రకారం భారతదేశ జీడీపీలో విద్యారంగానికి కనీసం 6% నిధులను కేటాయించాలి. గత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ బడ్జెట్లో కేవలం 2.9% నిధులు (1,12,899 కోట్లు) మాత్రమే కేటాయించడం శోచనీయం.
ప్రపంచంలో నాణ్యమైన విద్యను అందించే దేశాలు వాటి బడ్జెట్లో 6 % కన్నా ఎక్కువ నిధులనే కేటాయిస్తున్నాయి. ఉదాహరణకి నార్వే, చీలి దేశాల్లో 6.6%, ఇజ్రాయిల్, న్యూజిలాండ్ లు 6.2% ఇంగ్లాండ్ 6.1% అమెరికా 6% నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు విద్యారంగానికి ఆరు శాతం పైగా నిధుల కేటాయింపు ఎప్పుడూ జరుగలేదు. ఇది పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటికైనా పాలకులు రాబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తారని ఆశిద్దాం.
అతి పెద్ద విద్యా వ్యవస్థే కానీ..
ప్రజల జీవన ప్రమాణాలు వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు వారికి అందించే విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. 1964 లో కొఠారి కమిషన్ ప్రతిపాదన ప్రకారం దేశ జీడీపీలో విద్యారంగానికి కనీసం 6% బడ్జెట్ కేటాయింపులు చేయాలని సూచించారు.1986 జాతీయ విద్యా విధానం కూడా కొఠారి కమిషన్ చేసిన ప్రతిపాదనను అంగీకరించింది. ఈ ప్రతిపాదన ఇప్పటికే అమలు కాలేదు. 26.5 కోట్ల మంది విద్యార్థులు,14.9 లక్షల పాఠశాలలు మరియు 95 లక్షల మంది ఉపాధ్యాయులతో భారతీయ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థగా గుర్తింపు పొందింది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అతిపెద్ద విద్యావ్యవస్థలో ఉన్న మనం విద్యారంగంలో అనేక విద్యాసంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్య అందించడంలో సఫలీకృతం కాలేకపోయాం.
విద్యలో మన వైఫల్యానికి అదే కారణం
నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం భారతదేశంలో నాణ్యమైన విద్య అందించకపోవడానికి ప్రధాన కారణాలుగా విద్యారంగానికి సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, దేశంలో 33 శాతం టీచర్లు అర్హత కలిగిన వారు అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు టీచర్లు అందిపుచ్చుకోకపోవడం, మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా వారిలో సృజనాత్మకతను పెంచేలా కరికులం లేకపోవడం, దేశంలోని మెజారిటీ బడుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం ప్రధానంగా మంచినీరు, పారిశుధ్య నిర్వహణ, విద్యుదీకరణ తరగతి గదులు చాలినంత అందుబాటులో లేకపోవడం. వీటన్నింటతీ మూల కారణం బడ్జెట్లో విద్యారంగానికి నిధులు అధికంగా కేటాయించకపోవడం.
రెండూ భాషల్లోనూ చదవరాదు
అసర్(ASER )రిపోర్ట్ -2023 ప్రకారం భారత దేశంలోనీ 26 రాష్ట్రాల్లో 28 జిల్లాల్లో 34,745 మంది 14-18 వయసు గల వారిని సర్వే చేస్తే వారిలో 42.7% ఇంగ్లిష్‌లో కనీసం రెండు వాక్యాలు కూడా చదువలేకపోతున్నారు. 2 వతరగతి పాఠ్య పుస్తకాలను వారి ప్రాంతీయ భాషల్లో చదవడం లేదు. కేవలం 43% మాత్రమే చతుర్విధ ప్రక్రియలు చేయగలుగుతున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు లోపించాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది. 86.8% విద్యార్థులు మాత్రమే ఏదో ఒక కాలేజీలో కానీ స్కూల్లో గాని చదువుతున్నారు. మిగతావారు చదువుకోవడం లేదు. ప్రఖ్యాత అమెరికా సంస్థ BAV గ్రూప్, వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ తయారుచేసిన వార్షిక నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యను అందించడంలో అమెరికా, ఇంగ్లాండ్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా భారతదేశం 32వ స్థానంలో ఉంది. ఈ సర్వేను 78 దేశాల్లో వేల మంది ప్రజలతో ఈ సంస్థ నిర్వహించడం విశేషం.
సరైన విద్య లేకే.. విద్యార్థుల వలస
భారత ప్రభుత్వం పార్లమెంట్లో అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం నుండి ఉన్నత చదువులకు వివిధ దేశాలకు వెళ్తున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. గతంతో పోలిస్తే 2023లో 68% పెరుగుదలతో 7,50,365 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వేరే దేశాలకు తరలి వెళ్లారు. ఒక సర్వే ప్రకారం ఇది ఇలాగే కొనసాగితే 2024 సంవత్సరంలో భారతదేశం నుండి 18 లక్షల విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం వేరే దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. దేశంలో ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడంతో ఈ విధంగా విద్యార్థులు వేరే దేశాలకు వెళ్తున్నారు.
నాణ్యమైన విద్య ప్రభుత్వ బాధ్యత
సాధారణంగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెడతారు. సార్వత్రిక ఎన్నికలు వల్ల ఫిబ్రవరిలో మద్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. నూతనంగా కొలువుతీరిన కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దేశంలోని బడుగు బలహీన వర్గాలకి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికైనా పాలకులు రాబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తారని, ప్రపంచ స్థాయి విద్యను అందుకోవడం కోసం భారతీయ విద్యార్థులు పాశ్చాత్య దేశాలకు వలస వెళ్లడాన్ని నియంత్రిస్తారని ఆశిద్దాం.
(జూలై 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా)
పాకాల శంకర్ గౌడ్, విద్యావేత్త,
98483 77734 .