ఫైటర్ ఎవరు! ఛీటర్ ఎవరు?

by Ravi |   ( Updated:2023-10-06 00:00:42.0  )
ఫైటర్ ఎవరు! ఛీటర్ ఎవరు?
X

తెలంగాణాలో ప్రధాని వరుస పర్యటనలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఎన్నికల ప్రచార పర్వానికి తెరలేపాయి. పాలమూరు ప్రజా గర్జన సభతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావం పూరించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగం ప్రారంభించడం వెనక బీజేపీ రాజకీయ వ్యూహం దాగుంది! అలాగే ఎన్నికల వ్యూహంలో భాగంగానే రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు, ఈ టెక్స్ టైల్ పార్క్ కేటాయించారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చుతున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రకటనలు తెలంగాణాలో ఎన్నికల ప్రచార ప్రకంపనలు సృష్టించాయి.

అందుకే ఈ వరాలు..

తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని మోడీ స్పష్టం చేయడం వెనుక ఆంతర్యాన్ని గమనిస్తే ఎన్నికల్లో లబ్ది కోసమేనని అర్థమవుతుంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్.. తాను పసుపు బోర్డు ఏర్పాటు చేయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీని ఏర్పాటు గురించి అక్కడి రైతులకు బాండ్ కూడా రాసిచ్చారు. కానీ అర్వింద్ ఎంపీగా గెలిచి నాలుగేళ్ళు దాటినా, పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడంతో అక్కడి రైతులు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా పసుపు రైతులు ఉద్యమాలు చేశారు. పలు పర్యటనలను అడ్డుకున్నారు. ఈ అంశం అర్వింద్‌కు పెద్ద ఇబ్బందికరంగా మారింది. దీంతో మోదీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధానిచే ప్రకటన చేయడంతో అర్వింద్‌కు, బీజేపీకి రాజకీయంగా మేలు జరిగే అవకాశం ఉంది. అలాగే కేసీఆర్ ఇటీవల ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా పాల‌మూరు ఎత్తిపోత‌ల కూడా మూడు నాలుగేళ్ల కింద‌నే పూర్త‌యితుండే. కానీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఉండే గ‌త్త‌ర బిత్త‌ర నాయ‌కులు ప్రాజెక్టు ప‌నుల‌ను అడ్డుకున్నారని పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజాకర్షక పథకాలు ప్రకటించిన సంగతి మరిచి ఇప్పడు బీజేపీ పై విమర్శనాస్త్రాలు సంధించడం ఎంతవరకూ సబబు అని ఇరుపక్షాలు అరోపణలు చేసుకుంటున్నాయి.

నిజామాబాద్ ఇందూరు వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు ప్రధాని మోడీ. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ కల సాకారమైందని అలాంటి రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి ఎన్డీయేలో చేరుతామని వచ్చారని కానీ నేను వ్యతిరేకించానని రహస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాని మోడీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రాజకీయ ప్రయోజనాల కోసం..

తెలంగాణా రాబోతోంది త్వరలో ప్రకటన వచ్చేస్తుంది దీనికి సంబంధించి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అనుకున్న టైంలో తెరాస అధినేత సోనియాని కలవడం కుటుంబ సమేతంగా ఆమెతో దిగిన ఫోటోలు ఇంకా మనకి గుర్తు ఉండే ఉంటాయి. కాంగ్రెస్‌లో విలీనానికి టీఆర్ఎస్‌ని సిద్దం చేసిన కేసీఆర్ ఆఖరి నిమిషంలో ఆ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవడం తెలిసిందే.. టీఆర్ఎస్‌ని కాంగ్రెస్ విలీనం చేస్తానని మోసం చేశారని కాంగ్రెస్ పదే పదే చెప్పిన విషయం బీజేపీ ప్రస్తావించటం బట్టి ఛీటర్ ఎవరో తేల్చుకోవాలని బీజేపీ నాయకులు ఎదురు దాడి చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, మహిళా బిల్లు జి.20 సమావేశాల సమర్థ నిర్వహణతో మోదీ ఓ ప్రపంచ నాయకుడిగా, అవినీతిని ఎదిరించే ఫైటర్‌గా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు అన్నది బీజేపీ మాట.

కేంద్ర నిధులు ఇవ్వకపోయినా, కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టులు పూర్తి, రైతు బంధు, వైద్య కళాశాలలు మొదలైన ఎన్నో ప్రజా ప్రయోజన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ అభివృద్ధి పధంలో నడిపిన ఉద్యమ నేత పోరాటయోధుడు కేసీఆర్. కేంద్రం నిధులు ఇవ్వకుండా పక్షపాత వైఖరితో వివక్షత చూపుతోందని, కక్ష సాధింపు చర్యలకు కేంద్ర సంస్దలని వినియోగించుకుంటుందని బీఆర్ఎస్ వర్గాల మాట. అక్టోబర్ చివరి నాటికల్లా నోటిఫికేషన్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో పార్టీలన్నీ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. మరిన్ని వ్యూహాలు, ప్రణాళికలపై దృష్టి సారించాయి. రాజకీయ వ్యూహాల పరంగా ఎలా ఉన్నా, ప్రజాసొమ్మును ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఒకరి మీద ఒకరు నిందవేసుకోవడానికి ఖర్చు చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Advertisement

Next Story

Most Viewed