ఆదిత్యుని అధ్యయనానికి... ఆదిత్య ఎల్‌-1

by Ravi |   ( Updated:2023-09-03 00:16:06.0  )
ఆదిత్యుని అధ్యయనానికి... ఆదిత్య ఎల్‌-1
X

అంతరిక్ష వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి, సౌర సంఘటనల పరిజ్ఞానం కీలకం. విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాల సమాహారం. ఈ నక్షత్రాలు నిరంతరం శక్తిని విడుదల చేస్తుంటాయి. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోడానికి నక్షత్రాలే, ప్రధాన ఆధారం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే, విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సూర్యుడి లాంటి నక్షత్రాల్లో ఉండే పరిస్థితులను భూమ్మీద సృష్టించి, వాటిపై పరిశోధనలు చేయడం అసాధ్యం. అందుకే నేరుగా సూర్యుడిపైనే పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే సూర్యుడి గురించి తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేసిన ప్రయోగమే ‘ఆదిత్య ఎల్‌-1. విశ్వంలో ప్రతి వస్తువుకు మూలమైన, ఆదిత్యుని ఆధ్యయనం చేయటానికి 'ఆదిత్య ఎల్‌-1 ను నిర్ణీత కక్ష్యలోనికి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో.

ప్రయాణం ఇలా..

ఇస్రో నమ్మిన బంటు, విజయాశ్వం పీఎస్‌ఎల్‌వీ-సి57. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న 'ఎల్‌1' (లెగ్రాంజ్‌) పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశంలోకి భారత్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. తొలుత ఆదిత్య-ఎల్‌1ను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌.. భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టింది . ఆ తర్వాత దాన్ని మరింత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపుతారు. ఆదిత్య-ఎల్‌1లోని రాకెట్లను ఇందుకు ఉపయోగించారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్‌వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం కీలమైన క్రూజ్‌ దశ ప్రారంభమవుతుంది., ఆదిత్య ఎల్‌-1 సూర్యుని వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి సుమారు 125 రోజులపాటు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి లాగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యను చేరుకోనుంది. గురుత్వాకర్షణ శక్తులను సమతుల్యం చేయడం.. అంతరిక్ష నౌకకు ఇంధన వినియోగాన్ని తగ్గించడం వల్ల అక్కడి వస్తువులు కదలకుండా అలాగే ఉంటాయి. సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న లాగ్రాంజ్జ్ పాయింట్ వన్ దగ్గర దీనిని ప్రవేశ పెట్టబోతున్నారు కాబట్టి ఈ మిషన్‌కి ఆదిత్య ఎల్‌-1 అని పేరు పెట్టింది.

లాగ్రాంజ్ పాయింట్ అంటే

రెండు ఖగోళ పదార్థాల మధ్య రెండింటి గురుత్వాకర్షణ శూన్యంగా ఉండే ప్రదేశాలు ఐదు ఉంటాయి. వాటినే లాగ్రాంజ్ పాయింట్ అంటారు. గురుత్వాకర్షణ శూన్యంగా ఉండే ప్రదేశాలు ఐదు ఉంటాయి. ఇటాలియన్-ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు జోసెఫ్-లూయిస్ లాగ్రాంజ్ పేరు మీద ‘ఆ ప్రదేశానికి లాగ్రాంజ్ అని పేరు పెట్టారు.

తొలిసారి సూర్యుడిపై అధ్యయనం

ప్రచండ భానుడిపై అధ్యయనం చేయడానికి సంకల్పించింది. తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రాకెట్‌ను పంపించనుంది. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే కానుండటం విశేషం. ఆదిత్య-ఎల్‌1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. అందులోని ప్రధాన సాధనమైన విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ).. రోజుకు 1,440 చిత్రాలను పంపుతుంది. అంటే.. నిమిషానికి ఒక ఫొటో అన్నమాట! ఇది ఆదిత్య-ఎల్‌1లో సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనం. వీఈఎల్‌సీ బరువు 190 కిలోలు. అది ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇంధన వినియోగ తీరునుబట్టి అది మరింత ఎక్కువకాలం పనిచేసే అవకాశం కూడా ఉంది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. వీటి వల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని మానవ నిర్మిత ఉపగ్రహాలని, ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని 'ఆదిత్య ఎల్‌-1 మిషన్ దాదాపు 5 సంవత్సరాల పాటు సూర్యునిపై అధ్యయనం చేస్తుంది. ' యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. ఆదిత్య ఎల్‌-1 పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో చేపడుతున్నది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను అభివృద్ధి చేశాయి.

మిషన్ లక్ష్యాలు

“సౌర ఎగువ వాతావరణ డైనమిక్స్ అధ్యయనం చేయడం. క్రోమోస్పిరిక్ కరోనల్ హీటింగ్, పాక్షికంగా అయనీకరణం చేయబడిన ప్లాస్మా కరోనల్ మాస్ ఎజెక్షన్స్, ఫ్లేర్స్ ప్రారంభ అధ్యయనం చేయడం. సూర్యుడి నుండి కణ డైనమిక్స్ అధ్యయనం కోసం పార్టికల్, ప్లాస్మా వాతావరణాన్ని గమనించడం. సౌర కరోనా యొక్క భౌతిక నిర్మాణ విధానం. కరోనల్, కరోనల్ లూప్స్ ప్లాస్మా యొక్క డయాగ్నోస్టిక్స్ ఉష్ణోగ్రత, వేగం, సాంద్రత. బహుళ పొరలలో సౌర విస్ఫోటనం, సౌర తుఫానుల తాకిడి సంఘటనలకు దారితీసే (క్రోమోస్పియర్, బేస్, ఎక్స్‌టెండెడ్ కరోనా) సంభవించే ప్రక్రియల క్రమాన్ని గమనించి గుర్తించడం. సౌర కరోనాలో మాగ్నెటిక్ ఫీల్డ్ టోపోలాజీ, మాగ్నెటిక్ ఫీల్డ్ కొలతలు. కొలవడం. అంతరిక్ష వాతావరణం కోసం సోలార్ విండ్ డ్రైవర్లు, కూర్పు, డైనమిక్స్. అధునాతన ట్రై-యాక్సియల్ హై రిజల్యూషన్ డిజిటల్ మాగ్నెటోమీటర్లు ఈ మాగ్నెటోమీటర్లు ఆదిత్య L1 అంతరిక్ష నౌక చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. మాగ్నెటోమీటర్లు ట్రై-యాక్సియల్, అంటే అవి అయస్కాంత క్షేత్రాన్ని మూడు కోణాలలో కొలవగలవు. ఆదిత్య ఎల్ 1 పంపిన సమాచారం అక్కడి పరిస్దితుల విశ్లేషణ రానున్న రోజుల్లో మరింత కీలకంగా మారి సూదూర తీరాన ఉన్న గ్రహాల పరిశోధనకు ఊతమిస్తుంది. సౌర శక్తి, సౌర తుఫానుల ప్రభావాన్ని అంచనా వేయడానికి దోహదకరమౌతుంది. విశ్వ రహస్యాల ఛేదనలో కీలకఘట్టంగా ఆవిష్కృతమవుతుంది.

మనకు ఏదైనా పని నెరవేరాలంటే దానికి దృఢమైన సంకల్పం ఉండాలి.. ఆ సంకల్పం కూడా సత్సంకల్పమై ఉండాలి. యఙ్ఞ కర్మలలో ఆపస్సు వంటి కర్మలను ఎందుకు చేస్తారో, బుద్ధిమంతుల ప్రార్థనలో ప్రాధాన్యమైనదేదో, ఆరాధనీయమైనదేదో ఏదైతే లోకకల్యాణం కోసం దోహదపడుతుందో... అటువంటి సత్సంకల్పం కలిగేలా నా మనసుకు ప్రేరేపించు అన్న ఉపనిషత్ వాక్కుల ప్రేరణతో చంద్రయాన్ 3 సాధించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో, ఆత్మ నిర్బరంతో, స్వదేశీ సాంకేతిక విజ్ఞానంతో, ఆదిత్యుని ఆధ్యయనం చేయటానికి నిర్దేశించిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం కావాలి. ఇస్రో మరో గగన ఘన విజయాన్ని అందుకోవాలి.

శ్రీధర్ వాడవల్లి

9989855445

Advertisement

Next Story

Most Viewed