ఈ కాలపు విలక్షణ చిత్రం ‘విసరనై’

by Ravi |   ( Updated:2023-03-17 18:45:21.0  )
ఈ కాలపు విలక్షణ చిత్రం ‘విసరనై’
X

 కళయినా వర్తమాన సమాజానికి అద్దం పడుతుంది. విశ్లేషిస్తుంది. ధిక్కారంతో కామెంట్ చేస్తుంది. అప్పుడే ఆ కళ లక్ష్యం నెరవేరుతుంది. కళ భావోత్తుంగ తరంగాల నడుమ తన బాధ్యతను నెరవేర్చినట్టవుతుంది. సినిమా కూడా కళగా తన బాధ్యతను నెరవేరుస్తూ వుంది. అత్యధిక శాతం వ్యాపార లక్ష్యాలతో సాగే సినిమా రంగం ఉత్తమ చలన చిత్రకారుల చిత్రాల ద్వారా తన బాధ్యతను కొనసాగిస్తూనే వుంది.

సామాన్య మనిషి పట్ల వ్యవస్థ తీరు..

ప్రధానంగా వ్యవస్థ గురించి అందులోని అవలక్షణాలు దాష్టీకాల గురించి సినిమా అనేకసార్లు వివరిస్తూనే వుంది. సమాజంలో అధికారం, బలం, ధనంగల వాళ్ళు పేదల పట్ల బడుగు జీవుల పట్ల వ్యవహరించే తీరుని మంచి సినిమా పట్టించుకుంటూనే వుంది. ఈ మొత్తంలో ప్రధానమయిన పోలీస్ వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుంది? కింది వర్గాల పట్ల ఏ తీరున పని చేస్తుందన్నది ఇప్పటికే భారతీయ సినిమా రంగం అనేక చిత్రాల్లో దృశ్యీకరించింది. అర్ధ సత్య మొదలు పలు సినిమాల్లో పోలీసుల దాష్టీకాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇటీవలి మోహన్‌లాల్ ‘దృశ్యం’, కమలహాసన్ ‘పాపనసమ్’ లాంటి సినిమాల్లో పోలీసుల తీరు తెన్నుల్ని చిత్రీకరించారు. అలాంటి మరో మంచి ప్రయత్నమే తమిళ సినిమా ‘విసరనై’ (Interrogation).

వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జాతీయ అవార్డులను అందుకోవడమే కాకుండా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో పాల్గొని ఆస్కార్ పోటీల్లో విదేశీ విభాగంలో భారతీయ సినిమాగా ఎంపికయి అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో బాలు మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘నిరీక్షణ’ లో పోలీసుల తీరును చూపించినట్టే విసరనైలో కూడా పోలీసు వ్యవస్థ సామాన్య మనిషిని ఎట్లా చూస్తుందో వారిపట్ల ఎలా వ్యవహరిస్తుందో వాస్తవికంగానూ హృద్యంగానూ ఆవిష్కరించారు. తమిళనాడు నుంచి ఆంధ్రాకు వలసవచ్చిన నలుగురు కూలీల పట్ల పోలీసుల అక్రమ అరెస్ట్, దుర్మార్గపు థర్డ్ గ్రేడ్ విచారణ అన్నీ వాస్తవికంగా ఆవిష్కరించారు. రచయితగా మారిన కొయంబత్తూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఎం. చంద్ర కుమార్ తాను ఎదుర్కొన్న భయంకరమైన అనుభవంతో రాసిన ‘లాకప్’ అన్న నవలలోని ప్రధాన అంశాన్ని తీసుకుని విసరనై నిర్మితమయింది.

కథేంటంటే

నలుగురు కూలీలు గుంటూరుకు వచ్చి కూలి పని చేస్తూ బ్రతుకుతుంటారు. అదే ప్రాంతంలో డబ్బు అధికారం వున్న ఒక పెద్ద మనిషి ఇంట్లో దొంగలు పడతారు. పై నుంచి వచ్చిన ఒత్తిడితో ఎట్లాగయినా దొంగల్ని దొరకబుచ్చుకుని నేరాంగీకారాన్ని పొందాలనే ఆలోచనతో పోలీసులు అమాయకులైన ఈ నలుగురు కూలీలు పాండి( దినేష్), మురుగన్( మురుగదాస్), అఫ్జల్(శిలంబరసన్ ), కుమార్(ప్రదీష్) లను అరెస్టు చేస్తారు. దొంగతనం నేరాన్ని అంగీకరించమని తీవ్రమైన హింసకు గురిచేస్తారు. ఆ కూలీలు బడుగు వర్గానికి చెందిన వారు, నోరు లేని వారు కావడంతో ఆ నలుగురు హింసను తాళ లేక నేరాన్ని అంగీకరిస్తారు. ఇదిలా వుంటే మరోవైపు కేకే అనే ఒక వైట్ కాలర్ నేరస్థుడిని ఎయిర్ కండిషన్ గదిలో ప్రశ్నిస్తూ వుంటారు. ఈ రెండింటి విచారణల నడుమ వున్న వైవిధ్యాన్ని దర్శకుడు వాస్తవికంగా చూపిస్తాడు. ఈ మొత్తం కథా కథనంలో లంచగొండులైన పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు వారి అధికార ప్రతిపక్ష పార్టీలూ, వాటి ప్రమేయాలు, స్వార్థ పరత్వాలూ అన్నీ చూపిస్తాడు దర్శకుడు. న్యాయం కొంత, ఉద్యోగ బాధ్యత కొంత అని న్యాయంగా పనిచేసిన ముత్తు వేల్ అన్న పోలీస్ అధికారి కూడా ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల స్వార్థానికి బలైపోతాడు. ఉత్త పుణ్యానికి ఏమీ తెలియని కూలీలను కూడా బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారు. సినిమా మొత్తం వాస్తవ కోణంలో విలక్షణమయిన చిత్రీకరణ శైలిలో నిర్మించారు. వ్యాపార లక్షణాలున్నప్పటికీ పోలీసు వ్యవస్థ అసలైన రూపాన్ని ఆవిష్కరించారు దర్శకుడు. పోలీసు హింసను కూడా సూత్రప్రాయమైన ప్రతీకల ద్వారా చూపించి తన ప్రతిభను ప్రదర్శించాడు దర్శకుడు వెట్రిమారన్. తమిళ నటుడు ధనుష్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు అందుకుంది. నటులుగా దినేష్ రవి, సాముద్రికరన్ గొప్ప నటన ప్రదర్శించారు. సమస్తం వ్యాపారమే అయిన ఈ కాలపు సినిమా రంగంలో వచ్చిన విలక్షణ చిత్రం విసరనై.

సినిమా: విసరనై, దర్శకుడు: వెట్రిమారన్, సంగీతం-జి.వి.ప్రకాష్

వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story

Most Viewed