సంపద మేటలు.. పేదరికం మోతలు

by Vinod kumar |   ( Updated:2023-04-06 23:30:39.0  )
సంపద మేటలు.. పేదరికం మోతలు
X

భారతదేశంలో ఒక శాతం మంది దగ్గర నలభై శాతం సంపద వుందని ఒక సర్వే చెబుతోంది. ఐదు శాతం కుబేరుల చేతిలో అరవై రెండు శాతం సంపద వుందని ఆక్స్‌ఫామ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. దేశంలో ఆకలితో వున్న వారి సంఖ్య 2018లో 19 కోట్ల నుంచి 2022 నాటికి 35 కోట్లకు పెరిగిందని చెప్పారు. నిజానికి ఆకలిగొనడం, అనారోగ్యం, పనిలేనితనం, వలసతో నివాసంలేని జీవితంలో 60 కోట్ల మంది కునారిల్లుతున్నారు. మరో ప్రక్క అరవై శాతం మంది పేదరికంలో, అస్పృశ్యతలో, వృత్తి శైధిల్యంలో బతుకుతున్నారు. క్వారీల్లో రాళ్ళు గొడుతున్న పిల్లలు, హోటళ్ళలో పాచి పట్టిన చేతులతో కప్పులు కడుగుతున్న పిల్లలు, భర్త చనిపోయాక అభాగ్యవతులై పిల్లలను పోషించలేక దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్న వితంతువులు, మరోపక్క జీవన సంక్షోభాన్ని అనుభవిస్తున్నారు.

ప్లాట్‌ఫాంల మీద నిద్రిస్తున్న పిల్లలు, రైల్వేస్టేషన్‌లలో పోలీసుల దెబ్బలు తింటూ పడుకోవడానికి చోటులేని పిల్లలు, చలికి దుప్పటి లేక ఒకరికొకరు పెనవేసుకొని హాస్టల్‌లో పడుకొంటున్న పిల్లలు పౌష్టికాహారం లేక కాళ్లు సన్నబడి, పొట్టలు ఉబ్బి, కళ్లు పీక్కపోయి నరాల శక్తిలేక బందాడుతున్న పిల్లలు, మోకాళ్లలో మూలిగ లేక వంగి రోడ్ల మీద తచ్చాడుతున్న ముసలివాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. నిజానికి 2011 లో భారతదేశ జనాభాలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు 9 శాతంగా నమోదు కాగా, ఇప్పుడు పన్నెండు శాతంకు పెరిగింది. 2036 కి వీరి సంఖ్య 18% అవుతుంది. వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఎక్కువమంది చూసేవాళ్ళు లేక బాధపడుతున్నారు. చాలామంది వృద్ధులు డిప్రెషన్‌లో వున్నారు.

దేశంలో ధనవంతులు స్టార్ హోటళ్లలో తిన్న ఆహారంలో వదిలి పెట్టినవి లారీల్లో తెచ్చి రొయ్యల చెరువులకు వేస్తున్నారు. ధనవంతులు కొవ్వుతో కూడిన ఆహారం అమితంగా తినడం వల్ల, కొవ్వు తీసే యంత్రాలకు పని పెరిగింది. పేదవాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు ఒకేసారి అటు పనికి, ఇటు బడికి వెళ్ళవలసి రావడంతో దళిత విద్యార్థులు అన్నం తినకుండానే బడికి వెళుతున్నారు. మధ్యాహ్న భోజనం వరకు ఆకలితో ఉంటున్నారు. ఎక్కువ మంది అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అటు కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, యాపిల్, కమలాలు, బిస్కెట్స్ పెడుతున్నారు. దళిత ఆడపిల్లలు రజస్వల అయ్యాక కూడా కొబ్బరి బెల్లం పెట్టలేని పరిస్థితుల్లో దళిత కుటుంబాలు ఉన్నాయి.

పేదరికం నిర్మూలనకు ఎజెండా..

భారత ఆర్థిక వ్యవస్థలో కులం దాగుంది. కులం వల్లే పేదరికంలో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అస్పృశ్య వాడల్లో ఒకసారి, ధనిక వాడల్లో ఒకసారి మనం సంచరిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. అంటరానితనం, అంటరానితనం వల్ల వచ్చిన పేదరికం అలానే ఉన్నాయి. నిజానికి భారతదేశంలో 40 కోట్ల మందికి త్రాగే నీరు లేదు. మురికి నీరు తాగుతున్నారు. ‘‘ఒక ఆర్థిక సంస్థగా కులం చాలా ప్రమాదకరమైనది. మానవుని సహజమైన శక్తులను అణచివేసి, సాంఘిక జీవన నియమాల పతనానికి కులం కారణమవుతుంది.’’అన్నారు డా. బీఆర్.అంబేద్కర్. ఇది బలమైన మాట. ఎంతో ప్రతిభ ఉండి, విద్యాభ్యాసం కొనసాగించలేక, డ్రాప్ అవుట్ అవుతూ పెయింటర్స్‌గా, బేలుదారులుగా, రాడ్ బెండింగ్ చేసేవారుగా, డిగ్రీలు చదివిన దళితులు గ్రామాల్లో జీవిస్తున్నారు.

ఈ రోజు ఒక్క శాతం మంది ధనవంతుల్లో నలభై శాతం సంపద ఉందంటే మిగిలిన అరవై శాతంలో దళిత బహుజన మైనార్టీలు ఎక్కువని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే డా.బీఆర్. అంబేద్కర్ ‘దళితులు సంపద చేజిక్కించుకోకుండా హిందూ ధర్మ శాస్త్రాలు ఆంక్షలు విధించాయి. బలవంతంగా రుద్దిన ఈ పేదరికం ప్రపంచంలో ఇంకెక్కడా కనబడదు. అందుకే నేను భారత రాజ్యాంగం లో శూద్రులకు, అతిశూద్రులకు, ఆదివాసీలకు పోరాడే హక్కు సాధించానని’ అన్నారు. సంపద కొన్ని కులాల్లోనే ఎందుకు పెరుగుతుంది? ప్రాజెక్టులు, పరిశ్రమలు, భూమి, సంస్థలు, రాజకీయ పార్టీలు ఐదు కులాల్లోనే ఎందుకు ఉన్నాయి? ఈ కుల ఆధిపత్య వ్యవస్థను దళితులారా మీరు ఎదిరించాలంటే మీరు మీ స్వీయ ఎజెండాను అమలు పరచాలని అంబేద్కర్ చెప్పారు. ‘మీకు రాజ్యాధికారం రాకుండా మీ కులం పోదు, మీ పేదరికం పోదు.’ అని చెప్పాడు అంబేద్కర్.

గురిపెట్టిన చూపుడు వేలు..

భారతదేశంలో సాంఘిక విప్లవాన్ని, కుల నిర్మూలనను ‘ఆర్థిక సమతా వాదులు’ విస్మరించినట్లయితే వారికి విప్లవం సుదూరంలో ఉండక తప్పదు. ఒకవేళ సాంఘిక వ్యవస్థలో వున్న అంతరాల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తే చివరకు వారి విప్లవ సాధనలో కూడా కుల వ్యవస్థ యొక్క దుష్ఫలితాలు ప్రతిఫలించక తప్పదు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఆర్థిక సమతావాదులు, సామాజిక ఆర్థిక వాదులు వీరందరూ దేశ సంపదను అందరికీ పంచే విషయంలో ఏకమవ్వాలి. సంపదను పంచడమే కాదు, అట్టడుగున ఉన్న దళితులకు, ఆదివాసులకు సంపద ఎక్కువ భాగం ఇవ్వాల్సిన చారిత్రక అవసరం ఉంది.

ఈ దేశానికి మూల శక్తులైన వారు దారిద్య్రంలో వుంటే దేశం అభివృద్ధి చెందడం అసాధ్యం. ఈ విజ్ఞత పాలకులకు ఉండి తీరాలి. డా.బీఆర్.అంబేద్కర్ తన రాజ్యాంగంలో ఆర్థిక సమతను, సామాజిక సమానతను, సాంస్కృతిక ప్రగతిని విద్యా విప్లవాన్ని సమతుల్యంగా సమన్వయించారు. వాటన్నింటిని సాధించుకోవాల్సిన బాధ్యత ఈ తరానిదే. అందుకే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన చూపుడు వేలు మానవ హక్కుల పోరాటానికి మనకు జ్ఞాపకం చేస్తుంది. పోరాడే వాడే విజేత. చరిత్రతో నడవడమే కాదు, చరిత్రను మార్చే శక్తులుగా మనం ముందుకు నడవాలి.

డా. కత్తి పద్మారావు

దళిత ఉద్యమ నేత

9849741695




Advertisement

Next Story