ఏరంచు ఊరు... ఏవి సాగునీరు?

by Ravi |   ( Updated:2024-10-12 01:30:19.0  )
ఏరంచు ఊరు... ఏవి సాగునీరు?
X

ఏడు దశాబ్దాల స్వాతంత్ర పాలనలో పది సంవత్సరాల స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించినట్లు గా కనిపించవచ్చు కానీ అందుకు భిన్నంగా అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్న ప్రాంతం అమ్రాబాద్. ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేవి దట్టమైన నల్లమల అడవి, అరుదైన జంతుజాలం, ఔషధ మొక్కలు, విప్లవ ప్రజా పోరాటాలు, ఆదివాసీ చెంచులు, ఊట వాగులు, జలపాతాలు, పరుగులు తీస్తున్న కృష్ణమ్మ. కానీ ఆలోచించి చూస్తేనే ఆ ప్రాంత రైతుల అవస్థలు కనిపిస్తాయి.

వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న రైతాంగం ఉన్న ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురవక, అకాల వర్షాలు పడటం, విపరీతమైన ఎండకు పూత కాయలు లేకుండా మాడిపోవడం ఒకవేళ అన్నీ తట్టుకుని పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, వీటికి తోడు కల్తీ విత్తనాలు, పెరుగుతున్న ధరలు, పన్నుల భారంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాటిని తట్టుకోలేక కొంత మంది భూములను అమ్ముకోవటం, మరికొందరు బీడు భూములగా వదిలేయడం జరుగుతుంది. ఇక వేసవి కాలంలో ఇక్కడ మనుషులు బ్రతకడమే కష్టమైన పని అలాంటిది వారు సాదుకునే పశువులకు మేత, నీళ్లు పెట్టడం మరింత కష్టం. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయట పడేందుకు ప్రజలు స్థానిక అధికారులను మొదలుకొని ముఖ్యమంత్రి దాకా ఎంత మందికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఆలకిస్తలేరు.

పరీవాహక ప్రాంతం అవసరాలు తీర్చితేనే..

నదీతీరాల వెంబడే నాగరికత అభివృద్ధి చెందిందని, జనావాసాలు ఏర్పడ్డాయని మనం చరిత్రలో చదువుకుంటాం, అది వాస్తవం. కానీ నాగర్ కర్నూల్ జిల్లాలో దానికి విరుద్ధంగా జరుగుతుంది. దేశంలో నాల్గవ పెద్ద నది కృష్ణా. ఈ నది మన రాష్ట్రంలో 400 కిలోమీటర్లు ప్రవహిస్తే, ఒక నాగర్ కర్నూల్ జిల్లా అంచుగుండానే 190 కి.మీలు పారుతుంది. అందులో అమ్రాబాద్ ఉమ్మడి మండలం చుట్టూ 80 కి.మీ.లకు పైగా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో పడే వర్షపు నీరు పదర, అమ్రాబాద్ మండలాల్లో ఉన్న పది వాగుల గుండా ప్రవహిస్తుంటే ఈ వాగులపై ఎలాంటి (మినీ రిజర్వాయిర్) డ్యామ్‌లు లేకపోవడంతో నీరంతా నిరుపయోగంగా కృష్ణానదిలో కలుస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. ఏరంచున ఊరున్నా సాగునీరు లేక భూములు సత్తువ కోల్పోయి సత్తుబండలుగా మారుతున్నా సమస్యను పరిష్కరించలేదు.

నాటి ట్రిబ్యునల్ పంపకాలు..

కృష్ణానది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. అందువల్ల చట్టం దీనిని అంతర్రాష్ట్ర నదిగా గుర్తించింది. ఈ రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకం కోసం బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది కేంద్ర జనవనరుల శాఖ. అయితే కృష్ణానదికి మూడు పరీవాహక రాష్ట్రాలు ఉన్నట్లుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదికి మూడు పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన 800 టి. ఎం.సిల నీటిలో 377 టి.ఎం.సిలు కోస్తా ఆంధ్రకు, 267 టి. ఎం.సిలు తెలంగాణకు 123 టి.ఎం.సిలు రాయలసీమకు దక్కాయి. ఇందులో వర్షపాతం, భూగర్భ జలాలు అధికంగా ఉన్న కోస్తా జిల్లాకే నదీ జలాలు అధిక కేటాయింపు జరగడానికి, కరువు చాలా తీవ్రంగా ఉండే తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు అంత తక్కువ కేటాయించడం వెనుక అనేక చారిత్రక,రాజకీయ కోణాలు లేకపోలేదు. 2000 సంవత్సరం మే నెలతో 1976 లో ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యునల్ గడువు తీరిపోయింది. కానీ తెలంగాణకు కేటాయించిన నీటిలో మాకు దక్కాల్సిన వాటా ఎంత, ఎక్కడ?

స్వరాష్ట్రంలోనూ చెంబెడు నీళ్లు ఇవ్వలేదు

మన వాటా మనకు పూర్తిస్థాయిలో దక్కాలని నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో తెలంగాణ ఉద్యమం సాగించాం. అప్పుడు పాలమూరు జల గోస ఒక ఇంధనంగా పనిచేసింది. అందులో పదే పదే అమ్రాబాద్ ప్రాంతంలో ఏర్పడిన నీటి ఎద్దడి గురించి ఎత్తి చూపారు. దాంతో స్వరాష్ట్రంలో అమ్రాబాద్ మండలానికి తొలి ప్రాధాన్యతతో న్యాయం చేస్తారని ప్రజలంతా నమ్మారు. కోరుకున్న విధంగానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఉద్యమంలో ముందు వరుసలో నిలబడిన కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి కాగలిగారు కానీ ప్రజల అవస్థల్లో మార్పును తేలేకపోయారు. భూమినే నమ్ముకున్న రైతుల కన్నీళ్లను ఆపలేకపోయారు. సాధించుకున్న తెలంగాణలో ఉత్తర తెలంగాణ కరువును జయించి కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాలను మినహాయిస్తే పాలమూరు జిల్లా ప్రాంతాలపై నేటికీ కరువు కన్నెర్ర చేస్తూనే ఉంది. ఈ ప్రాంతానికి ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ అధికారం కోసం అప్పర్ ప్లాట్ ప్రాంతానికి సాగునీరు అందిస్తాం, మద్దిమడుగు సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపడతామంటూ కపట ప్రేమను చూపిస్తూ ఎన్నో చెప్పారు. కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పాలకులు గాని నేడు స్వరాష్ట్రంలో పదేండ్లు పాలించిన గత పాలకులు గాని అమ్రాబాద్ ప్రాంతానికి చెంబెడు నీళ్లు ఇవ్వలేదు. కరువు బారిన పడిన ఆ ప్రాంతానికి ప్రత్యామ్నాయం చూపేందుకు ప్రయత్నం చేయలేదు. మొదటి నుండి పక్షపాత ధోరణితో వ్యవహరించిన పాలకులే తప్ప చిత్తశుద్ధితో నిస్వార్థంగా పని చేసిన పాలకులు కరువయ్యారు.

శంకుస్థాపనలు చేశారే తప్ప..

గత ప్రభుత్వం 2024 ఎన్నికల కోడ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి లిఫ్ట్ ఇరిగేషన్, చంద్రసాగర్ రిజర్వాయర్ల ప్రస్తావన తెరమీదికి తెచ్చింది. హడావిడిగా శంకుస్థాపనల పేరుతో శిలాపలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారే తప్ప అందుకు సంబందించిన పనులు ప్రారంభించలేదు. ఇక నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతమనే నెపంతో దుందుభి నదిపై నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు సమీపంలో డ్యాం కట్టాలనే ప్రతిపాదన ఉన్న ప్రాజెక్టును ఉద్దేశ పూర్వకంగానే అనేక సాకులు చెబుతూ దిగువకు తీసుకెళ్లి డిండి దగ్గర కట్టి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందిస్తున్నారు. అదీకాక నార్లాపూర్ - డిండి లింక్ పథకం ద్వారా నల్లగొండ జిల్లాకు నీటిని తరలించాలనే ఉద్దేశంతో రిజర్వాయర్, కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. దీని వలన అచ్చంపేట ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని ముందే గుర్తించారు.

ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు?

గతంలో కె.ఎల్.ఐ పథకం ద్వారా అమ్రాబాద్, బల్మూరు మండలాలకు సాగునీరు అందించాలనే సదుద్దేశంతో 3.5 టి.ఎం.సిల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మిస్తే ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించి ఎగువ ప్రాంతంలో ఉన్న 66 వేల ఎకరాల సాగు భూములతో పాటు వందలాది ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని అంచనా వేశారు, అయినా ఎండ బెడుతున్నారు. కానీ అదే సమయంలో ఎస్.ఎల్.బి.సి - శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం జలాల నుంచి నల్లమల కొండల కింద నుండి 43 కిలోమీటర్ల పొడవైన భూగర్భ సొరంగం ద్వారా 30 టి.ఎం.సిల నీటిని తరలించి నక్కలగండి రిజర్వాయర్ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కృషి చేస్తున్నారు. మరి అదే నల్లమల కొండల మీద ఉన్న 66 వేల ఎకరాలకు 3.5 టి.ఎం.సిల సాగునీరు అందించే ఆలోచన, ప్రయత్నం ఎందుకు చేయట్లేదు?

మూడు తరాల తండ్లాట

మా ఓట్ల కోసం వచ్చిన నాయకులకు చెప్పుకున్నాం, గెలిచిన ప్రభుత్వాలను వేడుకున్నాం, ప్రతిపక్ష నాయకులను ప్రాధేయపడ్డాం కానీ ఏ నాయకుడు మా బీడు భూములకు చుక్క నీరు అందించలేక పోయారు. అయినా ఆశ చావక సాగునీటి కల సాకారమయ్యే రోజుకోసం మూడు తరాల నల్లమల ప్రజలు ఎదురు చూస్తున్నారు. మాకు జరిగిన అన్యాయం ప్రకృతి ప్రళయం వల్ల జరిగింది కాదు. పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. మాకు దక్కాల్సిన నీళ్లు దక్కనీయకుండా దగా చేస్తున్నరు... ఇంకెంత కాలం ఈ తడారిన నేలలో ఎడారి బతుకులు? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. నల్లమల ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి. మూలన మూలుగుతున్న అమ్రాబాద్ సంబంధిత ఎత్తిపోతల పథకాలను, కొత్తగా శంకుస్థాపన చేసి రాళ్లు పాతిన లిఫ్ట్ స్కీములను పునఃపరిశీలన చేసి సంబంధించిన పనులను ప్రారంభించి సముద్ర మట్టానికి దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించాలి. అలాగే బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన పనులను వేగం పెంచి పూర్తి చేయాలి.

- ఎనుపోతుల వెంకటేష్

95733 18401

Advertisement

Next Story