- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భ్రమలో బతుకుతున్న మనిషి!
మన దేశంలో 90 శాతం మంది ప్రజలు భ్రమలో బతుకుతున్నారు. ఎవరో చెప్పిన మాటలను విని వాస్తవాలు ఆలోచించక, తెలుసుకోలేక భ్రమలో బతుకుతున్నారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా కపట వేషధారులైన స్వామీజీలు, బాబాలు చెప్పిన మాటలు విని, తలలూపుతూ వారు చెప్పినట్టు నడుచుకుంటున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. శాస్త్రవేత్తల కన్నా స్వామీజీలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు గౌరవిస్తున్నారు. మనిషి వాస్తవాలను చూస్తూ, వింటూ ఎవరో చెబుతున్నారని మన కంటి ముందు కనిపించని వాటిని కూడా పిచ్చిగా నమ్మేస్తున్నాడు. ఒక్కొక్కసారి భ్రమపడడం సహజమే. భ్రమ పడినటువంటి విషయం ఒక్కొక్కసారి నిజం కావచ్చు, కాకపోవచ్చు అందుకోసం ఈ విషయాన్ని మనం స్వయంగా ప్రశ్నించి, మన జ్ఞానేంద్రియాలతో దానిని పరిశీలించి, ప్రయోగాల ద్వారా సాక్ష్యాధారాల ద్వారా ధ్రువ పరుచుకొని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి.
జ్ఞానేంద్రియాలు చెప్పేదే సత్యం!
కొందరు మనం దేవుని బిడ్డలం, దేవునికి జన్మించాము అంటుంటారు. మరికొందరు దేవుడున్నాడని ఆయన మన పాపాలను లెక్కకడుతున్నాడని, పాపాలు ఎక్కువైతే నరకంలోకి పంపిస్తాడని, పుణ్యాలు ఎక్కువైతే స్వర్గంలోకి పంపిస్తాడని కొందరు అంటుంటారు. కానీ ఇవేవీ నిజాలు కావు అన్ని అబద్ధాలే. తమ పొట్టకూటి కోసం కొందరు స్వార్ధపరులు ఇలా చెప్పి తమ పబ్బం గడుపుకొని విలాసంగా బతుకుతున్నారు. ఒక విషయం గురించి కొందరు కొన్ని అబద్ధాలు చెప్తారు. కొందరు ఇతరులు చెప్పిన దానిని చెబుతారు. కొందరు వాస్తవాలు చెబుతారు. అబద్ధం తొందరగా ఆకర్షింపబడుతుంది. ఇద్దరు మనుషులు వేరువేరుగా చెప్పినప్పుడు, అది నిజమో కాదో అని సందేహంలో ఉంటాడు మనిషి. మనము దారి వెంబడి వెళుతున్నప్పుడు దూరంగా వంకలు తిరిగిన తాడు కనబడితే ఒక్కొక్కసారి మనం దాన్ని పాము కావచ్చని అనుకుంటాం. కానీ దగ్గరికి వెళ్లిన తర్వాత అది తాడు అని తెలుస్తుంది. రాత్రిపూట మనం గ్రామాల్లో బయటకు వెళ్ళినప్పుడు ఈత చెట్టు లాంటివి విరబోసుకుని నిలబడ్డట్టుగా కనిపిస్తాయి వాటిని దెయ్యం అని భ్రమపడతారు కొందరు.
మన దేహంలో ఆత్మ ఉందని కొందరు చెబుతున్నారు.... ఆత్మ నీటిలో నానదు, అగ్నితో దహింపదు. ఏ అస్త్ర శస్త్రాలు ఛేదించవు. ఆత్మకు చావు లేదని చెప్తుంటారు. దానికోసమై ముమ్మరంగా పరిశోధనలు జరిగాయి. డాక్టర్లు చనిపోయిన మానవ శరీరాన్ని కోసి చూశారు కానీ అందులో ఆత్మ అనే పదార్థం కనబడలేదు. కొందరు స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్తుంటారు. ఉన్నాయి నమ్మండి అంటారు అది కేవలం నమ్మకం మాత్రమే కానీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. మన జ్ఞానేంద్రియాల ద్వారా చిక్కితే అది ఉన్నట్టే. లేకుంటే వాళ్ళు అబద్ధం చెపుతున్నారని గ్రహించాలి. అలాగే గత జన్మలు, మరుజన్మలు ఉన్నాయని మనమంతా కర్మఫలం అనుభవించే వారమేనని కొందరు బాబాలు స్వామీజీలు చెప్తుంటారు. దానిని మనము నిజమా కాదా అని పరిశీలించి, విశ్లేషించి ప్రయోగాల ద్వారా సాక్ష్యాధారాల ద్వారా ధృవ పరుచుకుని నిజానిజాలను నిగ్గు తేల్చుకోవాలి.
స్వర్గం, నరకం... రెండూ బోగస్!
ఒక అబద్ధం చెప్పినప్పుడు దాన్ని సమర్థించడానికి వంద అబద్ధాలు కూడా ఆడాల్సి వస్తుంది. ఉదాహరణకు, దేవుడున్నాడని ఒక అబద్ధం చెబితే దానిని సమర్థించడానికి, దాన్ని ఉనికిలో ఉంచడానికి ఎందరో స్వాములు ఉన్నవి లేనివి కల్పించి, ప్రవచనాలు చెప్పాలి. ఎందరో పూజారులు పూజలు చేయాలి. వీధివీధిన గుడులు కట్టాలి. అక్కడ విగ్రహాలు పెట్టి పూజలు జరిపించాలి. సైన్సుతో తయారైన ప్రచార సాధనాలు ఉపయోగించాలి. కొందరు స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్తుంటారు. ఉన్నాయి నమ్మండి అంటారు. అది కేవలం నమ్మకం మాత్రమే. మన జ్ఞానేంద్రియాల ద్వారా చిక్కితే అది ఉన్నట్టే. లేకుంటే వాళ్ళ అబద్ధం చెపుతున్నారని గ్రహించాలి. ఇంతవరకు ఏ ఒక్క మనిషి కూడా అక్కడికి వెళ్లి చూసి వచ్చినవాడు లేడు కాబట్టి, దానిని నమ్మకూడదు. అది లేనట్టే అని మనం గ్రహించాలి. మనిషి తన చుట్టూ ముసురుకుంటున్న అజ్ఞానమే హాయిగా ఉందని ఆ భ్రమలోనే బతుకుతున్నాడు. దేవుడు ఉన్నాడని స్వర్గ నరకాలు ఉంటాయని ఆత్మ ఉంటుందని చనిపోయిన పితరులకు పిండ ప్రదానాలు చేస్తే, వారి ఆత్మ శాంతిస్తుందని, ఈ విధమైన మూర్ఖత్వంలో అజ్ఞానంలో మనిషి జీవితాన్ని సాగిస్తున్నాడు. తనలో అంతర్గతంగా ఉన్న హేతుత్వాన్ని, హేతువాద దృక్పథాన్ని అణచివేస్తున్న ఇలాంటి వాటికి బానిసై బతుకుతున్నాడు.
ప్రస్తుతం మనుషులలో ఆలోచన శక్తి నశించింది. అనులోచనా పెరిగింది. అన్ని ఆలోచిస్తున్నాడు కానీ హాని కలిగిస్తున్న మతాలు, మత గ్రంథాలు, దైవ భావన, స్వర్గ నరకాలు, ఆత్మ ఉనికి వంటి వాటి గురించి నిశితంగా ఆలోచించకుండా, కపట వేషధారుల మాటలు విని నష్టపోతున్నారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం తగ్గిపోయింది. తన స్నేహితులు చెప్పారని, తల్లిదండ్రులు చెబుతున్నారని, గురువులు బోధిస్తున్నారని చెప్పుడు మాటలు వినడమే అలవాటుగా చేసుకున్నాడు. సైన్స్ ప్రకారంగా చూస్తే దేవుడు, ఆత్మ,స్వర్గ నరకాలు, గత జన్మ మరుజన్మలు లేవని తేలిపోయింది.ఇప్పటివరకు వాటికి సాక్ష్యాధారాలు లేవు. అవన్నీ అబద్ధాలే. దోపిడీదారుల కల్పిత మాటలే, కల్పితగాథలే తప్ప వాస్తవమైనవి కావు. వాటిని ఎవరూ చూసినవారు లేరు. చూసి మరల వచ్చిన వారు లేరు. కాబట్టి మనిషి వీటిని ప్రశ్నించి, పరిశీలించి వాటి వల్ల తనకు ఏదైనా అనుభవం కలిగితేనే నమ్మాలి. చెప్పుడు మాటలు చేటు అని ఒక సామెత ఉంది. చెప్పుడు మాటలు విని మోసపోకండి.
అడియాల శంకర్
అధ్యక్షులు, తెలంగాణ హేతువాద సంఘం
70930 62745