- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోరంత హామీ..కొండంత రుణం
ప్రపంచ కుబేరుల్లో ఆకస్మికంగా రెండో స్థానానికి రెండేళ్లలో ఎగబాకి, అంతకన్నా అనూహ్యంగా కేవలం రెండు వారాల వ్యవధిలో రెండంకెల స్థానానికి దిగజారిన భారతీయ పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారం నేడు దేశాన్ని కుదుపుతోంది. పార్లమెంటు ఉభయసభలు ఆ వ్యవహారంపై చర్చ కోసం పట్టుబడుతున్న ప్రతిపక్షాలు, అవసరం లేదంటున్న అధికార పక్షాల వైఖరి వల్ల ఏ చర్చలూ జరగకుండానే వాయిదాలు పడుతున్నాయి. స్టాక్ మార్కెట్ విపరీతమైన కుదుపులకు లోనవుతుంది. అదానీ సంస్థల్లో షేర్ల ధరల పతనంతో కోట్లాది రూపాయలు ఆవిరౌతున్నాయి. ఆ షేర్లలో మదుపుపెట్టిన కోట్లాదిమంది నష్టపోతున్నారు. దేశ సంపద ఆవిరి అవ్వడమే కాకుండా విదేశీ, స్వదేశీ మదుపరుల్లో మన మార్కెట్‌పై నమ్మకం సడలే అవకాశం ఉంది. అది ఆర్థిక వ్యవస్థకు మరింత చేటు. అదానీ వ్యవహారంలో మనలాంటి సామాన్యులకు తెలిసిన దానికన్నా తెలియనిదే ఎక్కువ. అర్ధమైందానికన్నా అర్థం కానిదే ఎక్కువ.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ అదానీ పరిశ్రమల విలువ ఎదుగుదలలో కుంభకోణం ఉంది అంటూ కొన్ని ఆధారాలను బయటపెట్టింది. ఈ దేశ చట్టాలకు వ్యతిరేకంగా విదేశాల్లో కొన్ని షెల్ కంపెనీలను ఏర్పరిచి, వాటి ద్వారా లావాదేవీలు జరిపి,షేర్ ధరల్ని ఇబ్బడిముబ్బడిగా (ఓవర్ వేల్యూ)పెంచి, మళ్ళీ వాటిని బ్యాంకుల్లో కుదువబెట్టి మరింతగా రుణాల్ని పొందినట్టు ఆరోపణ. తద్వారా గోరంత హామీ చూపించి కొండంత రుణాలు పొందినట్టు అభియోగం. ఈ తరహా కార్యకలాపాల్ని నియంత్రించాల్సిన సెబీ గానీ, పర్యవేక్షించిన సంస్థలు గానీ జవాబు చెప్పాల్సిన తీవ్ర అభియోగాలు ఇవి. అదానీ సంస్థలు కూడా తీర్చాల్సిన సందేహాలు. ఆయా జవాబుదారీ వ్యవస్థలు సమాధానాలతో ముందుకు రానంతవరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజాధనం లక్షల కోట్లమేరకు ఆవిరి అయిపోతుంది. బ్యాంకులు మునిగిపోవడమే కాకుండా మదుపరుల విశ్వాసం కోల్పోయి మార్కెట్ కూడా నష్టపోతుంది. ఆరోపణ చేసిన సంస్థ నిఖార్సయిన సంస్థ కాకపోవచ్చు. దాని స్వంత ఎజెండా దానికి ఉండొచ్చు. అయితే ఆ నివేదిక తెచ్చిన కుదుపుని దృష్టిలో పెట్టుకొని అయినా ప్రభుత్వం స్పందించాలి. నిజానిజాలు తేల్చేలా చర్యలు తీసుకోవాలి.
డా. డి.వి.జి.శంకర రావు
94408 36931
Also Read...
తిరుపతి లడ్డు గిఫ్ట్ ప్యాక్ చేయాలి