అంతరంగం:మాయమవుతున్న చదువరి

by Ravi |   ( Updated:2022-06-27 07:11:46.0  )
అంతరంగం:మాయమవుతున్న చదువరి
X

గ్రంథాలయాలకు పోయి చదవడం, పుస్తకాలు కొని చదవడం అటుంచి ఇంటికి ఒక్క వార పత్రిక కూడా తెప్పించి చదువరు. ఇంగ్లిష్ పేపర్లు కూడా చదివే సమయం లేదు. రాజకీయాలు ఎట్లా అర్థం అవుతాయి? అంతా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చిన పోస్ట్‌ల ఆధారంగానే ఆలోచిస్తారు. ఇంజనీరింగ్ విద్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన తర్వాత మేనేజ్‌మెంట్ వ్యాపార విద్య దానికి తోడై కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు విస్తృతంగానే పొందుతున్నారు. కానీ, సామాజికశాస్త్రాలు చదివేవారే కరువయ్యారు.

ధ్యయనం రానూ రానూ తక్కువ అయిపోతున్న కాలం. అవసరమైన పుస్తకాలు తప్పితే, ఇతర పుస్తకాలు తెరువుకు ఈనాటి తరం పోవడం లేదు. ఒకప్పుడు విద్యాలయాల చదువులతో పాటు ఇతర కళా, సామాజిక శాస్త్రాలు విరివిగా చదివేవారు. మండల కేంద్రంలోని గ్రంథాలయంలో పుస్తకాలు తీసుకొని చదివేందుకు సభ్యత్వం కార్డు ఉండేది. ఇప్పుడు గ్రంథాలయాలలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు చదివేందుకు మాత్రమే ఎక్కువ మంది పోతున్నారు. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాల్సిందే కానీ, మిగతా జనాలు మిగతా పుస్తకాలు మర్లేయడం లేదు. పుస్తకాలే కదా విజ్ఞానాన్ని అందించేవి, పుస్తకాలే కదా చరిత్రను సంస్కృతిని చెప్పేవి, పుస్తకాలే కదా మానవీయ కళాశాస్త్రాలు చెప్పేటివి.

కవిత్వం, కథలు, నవలలు, చారిత్రక గాథలు, పురాణాలు, భారత రామాయణ, భగవద్గీత కావ్యాలు చదవకుంటే మనిషి తన పూర్వ చరిత్ర ఎట్లా తెలుసుకుంటాడు. తన సంస్కృతిని ఎట్లా కొనసాగిస్తాడు. అనేక పుస్తకాలు అనేక భాషలలో ప్రపంచవ్యాప్తంగా వచ్చినవాటిని ఆయా ఇష్టాలను బట్టి గతంలో ఇంటింటికీ చదువరులు అంతా చదివేవారు. అందరూ పిల్లలు, మహిళలు ఆనాటి చదువుకున్న వృద్ధులకు కూడా పుస్తకాల పట్ల ప్రేమ ఉండేది. జీవితంలో స్థిరపడ్డవాళ్లు కూడా చదువనిది నిద్రపోని వాళ్లు కూడా ఉంటారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి అస్తిత్వ చరిత్రలు ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవం మతాల చరిత్ర గ్రంథాలు కూడా చదివేవారు. అసలు ఇప్పుడు అట్లా చదివేవాళ్ళు ఎక్కడ ఎవరు కనిపిస్త లేరు. గతంలో డిటెక్టివ్ నవలలు ఇతర పుస్తకాలు కిరాయికి ఇచ్చే దుకాణాలు కూడా ఉండేవి.

వాటి పట్ల అవగాహనేది?

అయితే, కాలం మారుతున్నది. తనకు అవసరం లేనిది ఎందుకు చదవడం? సామాజిక విషయాలు మాకెందుకు? అనే తరం తయారైంది. ఇదంతా ప్రపంచీకరణ తర్వాత విద్యారంగంలో వచ్చిన మార్పులు. ఆ కాలంలో ఒక ముఖ్యమంత్రి చరిత్ర పుస్తకాలు ఎందుకు? అన్నీ ఇంజనీరింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. నిజమే, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఇంజనీరింగ్, ఎంబీఏ లాంటి విద్యార్థులకే ఉన్నాయి. కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్ రంగంలో వచ్చిన అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. అయినా ఇతర సామాజిక, కళాశాస్త్రాల పట్ల అవగాహన లేకుంటే ఎట్లా ఉంటది? ఉద్యమాల ఫలితంగా రోజుకు ఎనిమిది గంటలే కార్మికులు పని చేయాలనే నిబంధన అంతర్జాతీయంగా వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు 12,13 గంటలు కంప్యూటర్ల ముందు తలలు పెట్టి బయటకు తీస్తలేరు. శని, ఆదివారాలు సెలవు అయినా ఏదో ఒకసారి మళ్లీ అదే పనిలోనే ఉంటారు.

గ్రంథాలయాలకు పోయి చదవడం, పుస్తకాలు కొని చదవడం అటుంచి ఇంటికి ఒక్క పత్రిక వీక్లీ కూడా తెప్పించి చదువరు. ఇంగ్లిష్ పేపర్లు కూడా చదివే సమయం లేదు. రాజకీయాలు ఎట్లా అర్థం అవుతాయి? అంతా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చిన పోస్ట్‌ల ఆధారంగానే ఆలోచిస్తారు. ఇంజనీరింగ్ విద్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన తర్వాత మేనేజ్‌మెంట్ వ్యాపార విద్య దానికి తోడై కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు విస్తృతంగానే పొందుతున్నారు. కానీ, సామాజికశాస్త్రాలు చదివేవారే కరువయ్యారు. మొదటి నుంచి ఒక్కటే గోల్ సోసైటి విద్య దాని కోసం ప్రాథమిక స్థాయి నుంచి ఇంజనీరింగ్ ప్రిపరేషన్ అమెరికా అంతే అయిపోయింది. వైద్య విద్యకు కూడా ప్రాధాన్యత ఉన్నది. ఉద్యోగాలలో స్థిరపడిన తర్వాత కూడా ఇతర కళా సాహిత్య రంగాలలోకి తొంగి చూడటం లేదు.

భావి తరాల కోసం

గతంలో ఇప్పుడున్న 60, 70 ఏండ్ల తరం గ్రంథాలయానికి వెళ్లి చదువుకునేది. ఇంటికి తెచ్చుకునేది. ఆ తరమే ఇప్పుడు ఇళ్లలో గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఆ పుస్తకాలు అనంతర కాలంలో ఏం కావాలి? అనే ఆలోచన వస్తుంది. ఇటీవల నేను మంథనిలో 86 ఏళ్ల వృద్దుడైన ఒక రచయిత, రిటైర్డ్ ప్రిన్సిపాల్‌ను కలిసాను. ఆయన దగ్గర వేలాది ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, తెలుగు, మరాఠి, సాహిత్య పుస్తకాలు ఉన్నాయి. తన యవ్వన కాలం నుంచి సేకరించినవి. విలువైన అలంకార శాస్త్రాలు మొదలు కాళిదాసు, కబీరు ఇంకా ఎందరో రాసిన పుస్తకాలు ఉన్నాయి. తన తర్వాత ఆ పుస్తకాలు ఏం కావాలి? అని మదన పడుతున్నారు.

ఏ కవికైనా రచయితకైనా తమ వారసులైన పిల్లలకు సాహిత్యం పట్ల ఆసక్తి ఇష్ట కొనసాగింపు లేకుంటే ఎట్లా! ఆ పుస్తకాలను ఎలా భద్రపరచడం? భావితరాలకు ఎలా అందించడం? అనేది ఆయన ఆందోళనగా అన్పించింది. ఇలాంటి పుస్తకాలను ఏదైనా విశ్వవిద్యాలయానికో లేదా గ్రంథాలయాలకో ఇవ్వవచ్చు. కానీ, అక్కడా అవి షెల్ఫ్‌లో పెట్టి భద్రంగానే ఉంటున్నాయి. కానీ, ఏ నాటికైనా రిఫరెన్స్ కు ఉపయోగపడవచ్చునేమో! పుస్తకాలు చదవడం తక్కువ అయినా, ఈ కాలంలో యూట్యూబ్, వాట్సాప్ విపరీతంగా చూస్తున్నారు. కొందరు కిండిల్ ఈ-బుక్‌లో చదువుతున్నారు. తరం మారింది, టెక్నాలజీ మారుతోంది. అయినా, ఇంకా చదవాల్సిన సాహిత్యం, శాస్త్ర విజ్ఞాన గ్రంథాలు యువతరం చదవడం లేదు. అవసరమైన మేరకు అవసరమైనంత చదువులకే ఉద్యోగం వస్తుంది. అవసరం తీరినవాళ్లతో, అవసరం లేనివాళ్లతో వాళ్లు సంబంధ బాంధవ్యాలు కొనసాగించకపోవచ్చు.

-అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed