కార్పొరేట్ పాలిటిక్స్

by Viswanth |   ( Updated:2022-09-03 18:43:02.0  )
కార్పొరేట్ పాలిటిక్స్
X

కార్పొరేట్ ఫార్మింగ్‌లాగానే ఇప్పుడు కార్పొరేట్ పాలిటిక్స్ మొదలయ్యాయి. దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న రాజకీయ నేతలకూ ఇప్పుడు వ్యూహకర్తల అవసరం ఏర్పడింది. నేతలకు ఓట్లు కావాలి. ఎన్నికలలో గెలవాలి. వ్యూహకర్తలకు చేతిలో డబ్బులు పడాలి. ఇదే వారి మధ్య ఒప్పందం. భాషరాని వ్యూహకర్తలు ఇప్పుడు పార్టీల వ్యూహాన్ని డిసైడ్ చేస్తున్నారు. ప్రవేశపెట్టాల్సిన పథకాలకు సూచనలిస్తున్నారు. ఎన్నికలలో ఎలా కొట్లాడాలో నేర్పుతున్నారు. మేనిఫెస్టోలో ఏముండాలో డిసైడ్ చేస్తున్నారు. చివరకు టికెట్ ఎలాంటివారికి ఇస్తే బాగుంటుందో కూడా వారే ఫైనల్ చేస్తున్నారు. ఎన్నేండ్లు రాజకీయాలలో ఉన్నా వ్యూహకర్తలపై ఆధారపడక తప్పడం లేదు. ఎలాంటి రాజకీయ పూర్వానుభవం లేనివారు వ్యూహకర్తల పేరుతో సీనియర్ పొలిటీషియన్లకు దారి చూపుతున్నారు.

జాతీయ, ప్రాంతీయ పార్టీలనే తేడా లేకుండా దేశమంతా చక్రం తిప్పుతున్నారు. డబ్బులిస్తే ఏ పార్టీకైనా పనిచేస్తారు. వారికి పార్టీ లైన్‌తో సంబంధం లేదు. ప్రజలకు సర్వీస్ చేయాలనే ఆలోచనా అవసరం లేదు. అంతా కాంట్రాక్టు పద్ధతే. ఒకసారి ఒక పార్టీకి వ్యూహం డిసైడ్ చేస్తారు. మరో ఎన్నికలో ఇంకో పార్టీకి పనిచేస్తారు. అంతకుముందు పనిచేసిన పార్టీని ఓడిస్తారు. ఒక పార్టీ వీక్‌నెస్‌ను మరోసారి ఇంకో పార్టీకి వాడేస్తారు. ప్రజల తలరాతను పార్టీల నేతలు మారుస్తుంటే, వీరి తలరాతలను వ్యూహకర్తలు డిసైడ్ చేస్తున్నారు.

ప్రజలకు దూరంగా పార్టీ నేతలు

రాజకీయ నాయకులనగానే మనకు ఠక్కున ప్రజా ప్రతినిధులు అనే భావన ఏర్పడుతుంది. ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ప్రతినిధి చేతిలో భవిష్యత్తును పెట్టేస్తున్నారు. పేరుకే ప్రజాప్రతినిధులు. కానీ ఇటీవలి కాలంలో అది ఒక హోదాగా మారిపోయింది. బాధ్యత పక్కకుపోయింది. ప్రజల మధ్య తిరుగుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించడం వారి డ్యూటీ. కానీ, ఐదేండ్లకోసారి మాత్రమే ప్రజల ముఖం చూసే ఈ నేతలు వందలాది ఎకరాల భూములను సంపాదించుకుంటున్నారు. కోట్లాది రూపాయలను పోగేసుకుంటున్నారు. స్వంత ఆర్జనపైనే దృష్టి పెడుతున్నారు. డాబు దర్పం ప్రదర్శిస్తూ నిత్యం పోలీసు పహరాలో ఉంటున్నారు. ప్రజలలోకి వెళ్లడం మానేశారు.

ప్రజలను దగ్గరకు రానివ్వడంలేదు. వారి సమస్యలను తెలుసుకునే ఆసక్తీ లేదు. ప్రజలు అర్జీలు పెట్టుకునే వాతావరణమూ లేదు. చివరకు గెలుస్తానో లేదోననే అపనమ్మకంతో బతుకుతున్నారు. సర్వేలపై ఆధారపడుతున్నారు. ప్రజల నాడిని తెలుసుకోడానికి ఆ దారి వెతుక్కుంటున్నారు. సేవ చేస్తే ప్రజలకు దగ్గర కావచ్చనే మౌలిక సూత్రాన్ని మర్చిపోతున్నారు. తాయిలాలతో ప్రజలకు దగ్గర కావాలనే తత్వం పెరుగుతున్నది. సరిగ్గా ఈ వీక్‌నెస్‌నే వ్యూహకర్తలు సొమ్ము చేసుకుంటున్నారు. ఓటర్లతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. అనవసర అడ్డదార్లను సూచిస్తున్నారు.

ఈవెంట్ మేనేజ్‌మెంట్

ఒక ఆడియో ఫంక్షన్ నిర్వహించాలంటే సినీ నిర్మాతలు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు అప్పజెప్తారు. ఇప్పుడు గంపగుత్తగా ఒక పార్టీ మొత్తం వ్యూహకర్తలకు అప్పజెప్తున్నది. ఎన్నికలలో పార్టీని గెలిపించడమే వారి మధ్య కుదిరే కాంట్రాక్టు. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీతో కాంట్రాక్టు కుదుర్చుకున్న వ్యూహకర్త తిరిగి 2024 ఎన్నికలలో ఆ పార్టీనే ఓడించడానికి మరో పార్టీతో ఒప్పందానికి ప్రయత్నించారు. చివరి నిమిషంలో అది బెడిసికొట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో డీఎంకేతో ఒప్పందం కుదుర్చుకున్న అదే వ్యూహకర్త 2021 ఎన్నికలలో ప్రత్యర్థిగా ఉన్న అన్నాడీఎంకేకు పనిచేశారు. 'డామిట్.. కథ అడ్డం తిరిగింది' తరహాలో ఫెయిల్ అయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీ‌పీని అధికారంలోకి తేవడానికి ఇలాంటి వ్యూహకర్తలే పని చేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ అధికార పార్టీ టీఆర్ఎస్‌కు అలాంటి కాంట్రాక్టే కుదిరింది. ఏ పార్టీతో ఎక్కువ ప్యాకేజీ దొరుకుతుందో అక్కడ కాంట్రాక్టు కుదుర్చుకోవడమే వ్యూహకర్తల పని. ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేయడమే వీరి బిజినెస్. వీరికి ఏ బాధ్యతా అవసరం లేదు. ఫక్తు కార్పొరేట్ సంస్థలాగానే ధనార్జనే వీరి ఏకైక లక్ష్యం.

పాలకుల బాధ్యతారాహిత్యం

ప్రజలకు సేవ చేస్తున్నాం అంటూ పొలిటీషియన్స్ చాలా గొప్ప డైలాగులు వల్లిస్తారు. ఎమ్మెల్యే, ఎంపీ లాంటి పదవులను హోదాలుగానే భావిస్తున్నారు. చుట్టూ గన్‌మెన్, కార్యకర్తలు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అంత గొప్ప నేతగా ఎదిగామని సంబరపడుతుంటారు. బహిరంగసభలలో ప్రజలను వందల మీటర్ల దూరంలోనే పెట్టేస్తారు. పోలీసు పహరాతో వారిని దగ్గరకు కూడా రానివ్వరు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు. వారి సమస్యలను పట్టించుకునే స్పృహ ఉండదు. ప్రజలకు దగ్గరైతే ఏ వ్యూహకర్త అవసరం లేకుండానే గెలుస్తామనే ఆలోచనే రాదు. డబ్బులతో గెలుస్తామనేదే వారి ధీమా. నిత్యం అభద్రతా భావంతో ఉండే వీరు వ్యూహకర్తలపై ఆధారపడుతుంటారు. ప్రజల బాధలను తెలుసుకోడానికి గతంలో ప్రజాదర్బార్‌లాంటివి అమలయ్యేవి.

ఇప్పుడు ఆ వ్యవస్థ అటకెక్కింది. ప్రజలతో కనెక్ట్ కావడమే తగ్గిపోయింది. సంక్షేమ పథకాల పంపిణీ, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలన్నీ ఈవెంట్‌ తరహాలోనే నడుస్తున్నాయి. ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం బందయ్యింది. ప్రజలకు కూడా మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసే మార్గాలు లేవు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేండ్ల అలుపెరుగని పోరాటం అంటూ చాలా సందర్భాలలో కేసీఆర్ గొప్పగానే చెప్పుకుంటూ ఉంటారు. ప్రజలు పడే బాధలను కళ్లారా చూశాను కాబట్టే సంక్షేమ పథకాలను తీసుకొచ్చాను అంటూ ఒకింత గర్వంగానే ప్రకటించారు.

ఆదుకోని సంక్షేమ పాలన

దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే ఉన్నాయంటూ విపక్షాల నోళ్లు మూయిస్తున్నారు. కానీ, ఈ సంక్షేమ పథకాలేవీ తిరిగి గెలిపిస్తాయనే నమ్మకాన్ని ఆ పార్టీలో కలిగించలేకపోయాయి. చివరకు వ్యూహకర్తలపై ఆధారపడక తప్పలేదు. 'నీళ్లల్లో చేపలా' ప్రజలలో కలిసిపోవాలన్న కేసీఆర్ మాటలేవీ ఆచరణలోకి రాలేదు. మైండ్ గేమ్, వ్యూహ ప్రతివ్యూహాలపైనే ఆధారపడక తప్పడంలేదు. ప్రజలలోంచి పుట్టుకొచ్చిన నాయకులకు ఇప్పుడు వ్యూహకర్తలే దిక్సూచి అవుతున్నారు. అధికారంలోకి రావడం, కొనసాగడం, ఎంతకాలం ఉండాలనేదే పాలకుల ధ్యాసంతా. నిజాయితీగా సేవ చేస్తే, హామీలను అమలు చేస్తే, ప్రజలకు దగ్గరైతే ఏ వ్యూహకర్తా అవసరం లేదన్న ప్రాథమిక అంశమూ వారికి పట్టదు.

గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో పాలకులకు తెలియదు. ఇంటెలిజెన్స్ ద్వారా ఆరా తీస్తారు. అనుకూలంగా వస్తేనే శాంతిస్తారు. లేదంటే తూచ్... అంటూ ఆ నివేదికను కొట్టిపారేస్తారు. ప్రజలను కలవకపోవడంతో వాస్తవిక పరిస్థితిని తెలుసుకోలేకపోతున్నారు. సర్వేలపై ఆధారపడుతున్నారు. అందుకే పదుల సంఖ్యలో సర్వే సంస్థలు, వ్యూహకర్తల పేరుతో సంస్థలూ పుట్టుకొస్తున్నాయి. నేల విడిచి సాము చేస్తున్న పాలకుల తీరు ఇలా కొనసాగినంత కాలం వ్యూహకర్తల బిజినెస్ మూడు పువ్వులు.. లాగానే ఉంటుంది.ప్రజలకు సేవ చేసే డైలాగుల సంగతేమోగానీ అధికారంలోకి రావడమే పార్టీల లక్ష్యం. డాబూ, దర్పం, హోదాలు, ప్రోటోకాల్, లగ్జరీ లైఫ్.. అన్నింటినీ మించి సంపదను పోగేసుకోవడమే పొలిటీషియన్ల టార్గెట్. పార్టీలను గెలిపించడమే వ్యూహకర్తల పని. వారికి అధికారం... వీరికి కాంట్రాక్టు ప్యాకేజీ.

ఎన్. విశ్వనాథ్

Advertisement

Next Story

Most Viewed