- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగమంటే ఎందరికి తెలుసు?
రాజ్యాంగాన్ని సవరించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అనేక రాజకీయ పార్టీల నేతలు ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. అంబేద్కర్‌నే అవమానించారంటూ ఆరోపించారు. దేశద్రోహి అన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలనుకుంటున్నారా? అంటూ విమర్శించారు. ఏ సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది అప్రాధాన్యమైపోయింది. వారం రోజులైనా ఈ వివాదం చల్లారలేదు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సవరించాయి. ఆ పార్టీల నేతలే ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమనడం విశేషం. రాజ్యాంగాన్ని సవరించడం కొత్తేమీ కాదు.
అది ఉనికిలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకూ 105 సార్లు సవరణలు జరిగాయి. ఇందులో ఎక్కువసార్లు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. బీజేపీ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. వాజ్‌పేయి హయాంలో ఏకంగా రాజ్యాంగాన్ని సవరించడం, సమీక్షించడం కోసం జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఒక కమిటీయే ఏర్పాటైంది. 2002లో రిపోర్టు కూడా ఇచ్చింది. 58 సిఫారసులనూ చేసింది. 86 శాసనపరమైన మార్పులు అవసరమని సూచించింది. ఆ తర్వాత కేంద్రంలో అధికార మార్పిడి జరగడంతో ప్రభుత్వాలు ఆ నివేదికను పట్టించుకోలేదు. నిజానికి రాజ్యాంగాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకునే అధికారం 368వ అధికరణంలోనే ఉన్నది.
పొలిటికల్ కలర్
రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడంలో అన్ని పార్టీలూ ఘనమైనవే. ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం, నోట్లు పంచిపెట్టడం, చట్టాలలోని లొసుగులను స్వంత ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవడం, రాజకీయ అవసరాల కోసం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఇవన్నీ పార్టీల నేతిబీరకాయ తీరుకు నిదర్శనం. రాజ్యాంగాన్ని ఎంత చిత్తశుద్ధితో అమలుచేస్తున్నాయో వాటి ఆచరణ ద్వారా అర్థమవుతుంది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల విషయంలో అన్ని పార్టీలదీ ఒకే తీరు. 'దొంగే దొంగ' అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేయలేని, చిత్తశుద్ధి లేని పాలకులు ఇప్పుడు సవరణకు పట్టుబట్టడం విడ్డూరం.
ఇప్పుడు రాజ్యాంగ సవరణ గురించి సీఎం కేసీఆర్ చేసిన ప్రస్తావనకు పొలిటికల్ కలర్ వచ్చింది. కేసీఆర్‌ను దేశద్రోహి అంటూ స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామెంట్ చేశారు. మోడీ నేతృత్వంలో 2017లో జీఎస్‌టీ చట్టం కోసం చేసిన రాజ్యాంగ సవరణ గురించి నోరెత్తడంలేదు. ఆ తర్వాత మరికొన్ని సవరణలూ జరిగాయి. రాజ్యాంగానికి సవరణలు అవసరమంటూ ప్రతిపాదన చేయడమే దేశద్రోహమైతే జీఎస్‌టీ కోసం సవరించిన ప్రధాని మోడీపై ఏ కేసు పెట్టాలి? గతంలో సవరించిన కాంగ్రెస్ నేతలపైనా ఎన్ని కేసులు నమోదు చేయాలి?
దేనికోసం సవరణలు?
నిజానికి జీఎస్‌టీ సవరణకు మద్దతు ఇవ్వాల్సిందిగా స్వయంగా బీజేపీయే టీఆర్ఎస్ చీఫ్‌ను, ఎంపీలను కోరింది. అప్పటి స్నేహ సంబంధాలతో టీఆర్ఎస్ తనదైన తీరులో స్వామిభక్తిని ప్రదర్శించింది. మరే రాష్ట్రంకంటే ముందుగానే అసెంబ్లీలో మద్దతు పలికింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే దూకుడును ప్రదర్శించింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం ప్రత్యేకంగా ప్రశంసించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉభయసభలు పార్లమెంటులో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి హోదాలో 2015లో రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై దుమారమే రేగింది. రాజ్యంగం పీఠికలో తొలుత 'సెక్యులర్', 'సోషలిస్టు' అనే పదాలు లేవని, ఆ తర్వాత వచ్చి చేరాయన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో 'సెక్యులరిజం' అనే పదం విస్తృతంగా దుర్వినియోగమవుతున్నదన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగానే వ్యతిరేకించారు. రాజ్యాంగానికి చేసే సవరణలు మెజారిటీ ప్రజల హక్కులకు విఘాతంగా మారకూడదు. వాటికి మరింత భరోసా, గ్యారంటీ కల్పించేవిగా ఉండాలి. ఆ హక్కులను కాలరాచే విధంగా ఉండొద్దు. పెనం మీద నుంచి కుంపటిలో పడే పరిస్థితి రావద్దు. రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ మారకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోడానికి అభ్యంతరం అవసరంలేదు. పిడికెడు మంది ప్రయోజనాల కోసం జరిగే సవరణగా మారకూడదు. రాష్ట్రాలకు ఉండాల్సిన హక్కులకూ గ్యారంటీ ఉండాలి. వాటికి భంగం కలిగించే పాలసీలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్నది. తాజా బడ్జెట్‌లో నదుల అనుసంధానం, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు లాంటి అంశాల విషయంలోనే కేసీఆర్ రాజ్యాంగ సవరణ అవసరం అనే అంశాన్ని నొక్కి చెప్పారు. రాజ్యాంగం ద్వారా రాష్ట్రాలకు సంక్రమించిన హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని, ఇందుకోసమే రాజ్యాంగాన్ని రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ప్రజల హక్కుల సంగతేంటి?
రాజ్యాంగం పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించింది. కేసీఆర్ కూడా ఆ స్వేచ్ఛతోనే రాజ్యాంగాన్ని సవరించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సీఎం హోదాలో ప్రజలకు సంక్రమించిన స్వేచ్ఛను హరిస్తున్నారన్నది చర్చనీయాంశం. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదు. జవాబుదారీతనం లేదు. గొంతు నొక్కేయడం సర్వసాధారణం. భావ ప్రకటనా స్వేచ్ఛ లేదు. నిరసన తెలిపే అవకాశాలూ లేవు. ధర్నా చౌక్‌ను ఎత్తివేయడంతో న్యాయస్థానానికి వెళ్ళి పొందాల్సి వచ్చింది.
రాష్ట్ర హక్కులకు భంగం కలిగినందుకు బాధపడుతున్న కేసీఆర్ తన రాష్ట్రంలోని ప్రజల హక్కులను హరిస్తున్న అంశం గురించి పట్టింపు లేకపోవడం గమనార్హం. ఏ దళితుల గురించి ఇటీవల అక్కర చూపిస్తున్నారో ఆ సెక్షన్ ప్రజలకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడడం లేదు? సమర్థనకు కారణాలను చూపించుకోవచ్చు. ప్రజల మెదళ్ల నుంచి నేరెళ్ల సంఘటన, మరియమ్మ లాకప్‌డెత్ లాంటి సంఘటనలను తుడిపేయలేరు. రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కుల విషయంలోనూ కస్టోడియన్‌గా గవర్నర్, పరిపాలనా పెద్దగా ముఖ్యమంత్రి మౌనంగానే ఉన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టాలను తు.చ. తప్పకుండా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్షపాతంతోనే వ్యవహరిస్తున్నాయి.
కేంద్రం అధికార పెత్తనం
కేంద్ర ప్రభుత్వం సైతం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నది. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించేవారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. దర్యాప్తు సంస్థలను తన స్వప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటున్నది. రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నది. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విధాన నిర్ణయాలు చేస్తున్నది. నదుల అనుసంధానం, అఖిల భారత సర్వీసు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్) నిబంధనలలో మార్పులకు ఒత్తిడి తెస్తున్నది. గవర్నర్లుగా తనకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకుంటున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం కాంగ్రెస్, బీజేపీ ఇవే సాగిస్తున్నాయి.
రాజ్యాంగం ఒక బ్రహ్మపదార్థం
రాజ్యాంగం ఉనికిలోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా దానిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందులోని హక్కులను, అంశాలను వివరించడానికి ఆసక్తి చూపలేదు. అవగాహన కలిగించలేదు. అందుకే ప్రజలలో రాజ్యాంగం అనేది ఒక బ్రహ్మపదార్థంగానే మిగిలిపోయింది. రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాశాడనేంత వరకే ప్రజలలోకి రీచ్ అయింది. రోడ్లమీద మనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతలాంటి మత గ్రంథాలను ఉచితంగా పంచిపెట్టడం కనిపిస్తుంది. లేదా తక్కువ ధరకు అమ్మడం చూస్తుంటాం. ఈ తీరులో రాజ్యాంగాన్ని పంచిపెట్టడం మనకు కనిపించదు. లేదా దాన్ని సరళతరం చేసి ప్రజల చైతన్య స్థాయికి తగినట్లుగా అర్థం చేయించడమూ ప్రభుత్వాలకు పట్టదు.
రాజ్యాంగంలో ఏమున్నదో చాలామందికి తెలియదు. అందుకే సవరణ అనగానే దాన్ని భూతంగా చూపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి రాజ్యాంగం గురించి తెలిస్తే ప్రజలు ప్రశ్నించడం మరింత పెరుగుతుందనేది రాజకీయ పార్టీల, ప్రభుత్వాల భయం. ఈ కారణంగానే అది కొద్దిమంది మేధావులకే మాత్రమే పరిమితమైంది. పొలిటికల్ సెక్షన్, లాయర్లు లాంటివారికే చెందినదిగా గుర్తింపు పొందింది. మెజారిటీ ప్రజలకు అంతుచిక్కని సబ్జెక్టుగానే మిగిలిపోయింది. ఇప్పటికీ రాజ్యాంగం మీద పూర్తి అవగాహన, పట్టు ఉన్న న్యాయవాదులు చాలా తక్కువ. తల్లిదండ్రులు నడక నేర్పినట్లుగా చిన్న తరగతుల నుంచే రాజ్యాంగం గురించి చెప్పడం నేటి అవసరం.
ఎన్. విశ్వనాథ్
99714 82403