అసలు ప్రయారిటీ కార్పొరేట్ మాత్రమే!

by Viswanth |   ( Updated:2022-09-03 18:18:23.0  )
అసలు ప్రయారిటీ కార్పొరేట్ మాత్రమే!
X

పాలకులెవరైనా సంపన్నులకు సేవచేసేవారే. పార్టీలేవైనా వారి సేవలో తరించేవే. పెట్టుబడిదారులకు, రాజకీయ నాయకులకు మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా బంధం బలపడింది. ఒకరి ప్రయోజనాలను మరొకరు నెరవేర్చడమే వారి మధ్య ఉండే అవగాహన. 'నాకెంత, నీకెంత' అనేదే వారి మధ్య ఈక్వేషన్. దానికి తగినట్లుగానే ప్రభుత్వ విధానాలు ఉంటాయి. అవి బడ్జెట్‌లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సైతం అందుకు మినహాయింపేమీ కాదు. నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోలు ధరల కట్టడి, స్వయం ఉపాధికి ప్రోత్సాహం, సంక్షేమం, సబ్సిడీ ఇలాంటివేవీ ఈ బడ్జెట్‌లో కనిపించలేదు. అందుకే దేశంలో ప్రాధాన్య రంగాలుగా చెప్పుకునే వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమంలాంటివన్నీ తాజా బడ్జెట్‌లో అప్రాధాన్యమైపోయాయి. రోడ్లు, రైల్వే, డిఫెన్స్‌లాంటివి మాత్రమే ప్రాధాన్య రంగాలుగా మారాయి. వీటితో పాటు మౌలిక సదుపాయాల రంగానికీ భారీ స్థాయిలోనే నిధులను కేటాయించింది. రానున్న కాలంలో ఈ రంగాలలో వారికే అవకాశాలు కల్పించడం, మరింత సంపన్నులను చేయడం, అందుకు ప్రతిగా వారి నుంచి పార్టీ ఫండింగ్‌ను అందుకోవడం, ఇవే వారి మధ్య కంటికి కనిపించని సంబంధం.

ఊరట లేదు, ఊరింపులు లేవు

సాధారణంగా బడ్జెట్ అనగానే అన్ని సెక్షన్ల ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదైనా లబ్ధి కలిగే పథకం ఉంటుందేమోనని ఆశిస్తుంటారు. ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని ఉద్యోగులు, టాక్స్ పేయర్స్ ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ఏమైనా ఉంటుందేమోనని పేదలు ఆశ పడుతుంటారు. ఉద్యోగాలకు అవకాశాలేమైనా ఉంటాయేమోనని నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటారు. సబ్సిడీలు, సంక్షేమం లాంటి వరాలేమైనా సర్కారు కురిపిస్తుందేమోనని రైతులు కోరుకుంటారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి వరాలకు జనం అలవాటుపడ్డారు. ఈసారి బడ్జెట్‌లో అవేవీ లేవు. వాటిని ఆశించడం తప్పా రైటా అనేది వేరే చర్చ. దేశ జనాభాలో ఇప్పటికీ సగానికి పైగా దారిద్ర్య రేఖకు దిగువ బతుకుతున్నవారేనని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం 60 కోట్ల మందికి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా ప్రతీ నెలా ఐదు కిలోల బియ్యం/గోధులను ఉచితంగా ఇచ్చినట్లు చెప్పుకున్నది. అదే సమయంలో మన దేశంలోని సంపన్నుల సంపద మరింతగా పెరిగి విదేశీ బిలియనీర్లకు దీటుగా ఎదిగారన్న రిపోర్టులూ వస్తున్నాయి. పేద-ధనిక అంతరాన్ని తగ్గించడానికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి పాలసీ లేదు. వారి జీవన ప్రమాణాలను పెంచడానికి ఊతమిచ్చే విధాన నిర్ణయాలూ లేవు. పెరిగిన ధరలతో బతుకు భారమైన మెజారిటీ ప్రజలకు ఆర్థిక పరిపుష్టి కలిగించే విధానమేదీ ఈ బడ్జెట్‌లో లేదు.

ఆదుకున్న వ్యవసాయంపై నిర్లక్ష్యం

గతంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2022 సంవత్సరాన్ని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది. అది ఒక అట్టర్ ఫ్లాప్ పథకంగానే మిగిలిపోయింది. అందరికీ గృహ వసతి కల్పిస్తానన్న హామీ కూడా నీటి మూటగానే మిగిలిపోయింది. ఇక స్వచ్ఛభారత్, స్మార్ట్ సిటీల పేరుతో వేలాది కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కుమ్మరించింది. అవేవీ ఇప్పుడు ఊసులోనే లేకుండా పోయాయి. ఆ డబ్బుతో ఏం స్వచ్ఛత చేకూరిందో, ఎన్ని వైఫై సౌకర్యాలు సమకూరాయో ప్రజలకు తెలియందేమీ కాదు. కరోనా కష్టకాలంలో కోట్లాది మందిని వ్యవసాయ రంగం ఆదుకున్నది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎకనమిక్ సర్వే సైతం అతి తక్కువగా ప్రభావితమైన రంగం అంటూ కితాబునిచ్చింది. అన్ని రంగాలూ లాక్‌డౌన్ కాలంలో కుప్పకూలితే 3.9 శాతం వృద్ధి సాధించిందంటూ ప్రశంసలు కురిపించింది. చివరికి బడ్జెట్‌లో ఈ రంగం నాన్ ప్రయారిటీ అయిపోయింది. ఉత్తరాది రైతుల ఆందోళనతో సాగు చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే డిమాండ్‌పై హామీ లేదు. పకడ్బందీగా ఎం‌ఎస్‌పీ అమలయ్యేందుకు స్పష్టమైన విధానం లేదు. కష్టపడి పండించిన పంటకు మార్కెటింగ్‌పై రైతులకు భరోసా లేదు.

ఆదాయంపైనే దృష్టంతా

మరోవైపు ఎరువులపై సబ్సిడీకి కోతపడింది. ఇంకోవైపు ఎరువుల ధరలు పెరిగిపోయాయి. ఫుడ్ సెక్యూరిటీ పథకం కింద బడ్జెట్ కేటాయింపులూ తగ్గిపోయాయి. కష్టకాలంలో ఆదుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికీ నిధులను పెంచలేదు. ఏడాదికి 200 పనిదినాలను పెంచాలన్న డిమాండ్‌పైనా పెదవి విప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఎలాగూ ఉపాధి అవకాశాలను కల్పించలేకపోయింది. ఆదుకుంటుందనుకున్న ఉపాధి హామీ పథకంపైనా ఆశలు సన్నగిల్లుతున్నాయి. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉన్నదంటూ చెప్పుకునే ప్రభుత్వం బడ్జెట్ ద్వారా దిశానిర్దేశం చేయడంలో విఫలమైంది. ఉత్పత్తిరంగాన్ని పరిపుష్టం చేసి ఉద్యోగ కల్పన చేయాలన్న దృష్టి కొరవడింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలన్నదే ప్రభుత్వానికి ప్రయారిటీగా మారింది. ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా ఎంత సొమ్మును ఖజానాకు చేర్చాలన్నది తక్షణ కర్తవ్యంగా మారింది. చివరకు పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడంపైనే ఫోకస్ పెట్టింది. ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు అప్పగించే పనిని దిగ్విజయంగా పూర్తిచేసినట్లు ఒకింత గర్వంగానే చెప్పుకున్నది. ఇప్పుడు లాభాలలో నడుస్తున్న ఎల్ఐసీని ఖతం చేయాలని కంకణం కట్టుకున్నది. ఈ ఏడాదిలోనే దాని సంగతీ చూస్తామని నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో ఘనకార్యంగా చెప్పుకున్నారు.

డిజిటల్ మంత్రం వెనక వ్యూహం

రోడ్లు, రైల్వే రంగాలకు భారీ కేటాయింపులు చేయడం వెనక ప్రభుత్వానికి పెద్ద వ్యూహమే ఉన్నది. ఇప్పుడు పెట్టే పెట్టుబడులతో వ్యాల్యూ ఎడిషన్ చేసి తర్వాత ప్రైవేటు సంస్థలకు ఎక్కువ రేటుకు అమ్ముకోవాలనేది ఈ బడ్జెట్‌‌లో అంతర్లీనంగా కనిపిస్తున్నది. వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచడం, కార్గో టెర్మినళ్ళను ఏర్పాటు చేయడం కూడా అందులో భాగమే. ఇప్పటికే అదానీ, అంబానీలాంటి చాలా మంది పెట్టుబడిదారులు ఆహార పదార్ధాల మొదలు అనేక రకాల సరుకులను నిల్వ చేసుకోడానికి, రవాణా చేసుకోడానికి మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఈ బడ్జెట్‌‌లో అలాంటి దీర్ఘకాలిక వ్యూహమూ కనిపిస్తున్నది. నిర్మల బడ్జెట్‌లో డిజిటల్ రంగంపై భారీ ప్రకటనలే ఉన్నాయి. ఈ విధానం ద్వారా వీలైనంత ఎక్కువగా పన్నులను వసూలు చేయడం ప్రభుత్వ లక్ష్యం. డిజిటల్ పేమెంట్ విధానంతో ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించి టాక్స్ పరిధిలోకి తేవడం దీని వెనక ఉద్దేశం. అల్పాదాయవర్గాలూ వీటిని కొనే పరిస్థితిని సృష్టించి జీఎస్‌టీ రూపంలో ఆదాయాన్ని పెంచుకోవడమూ ఒక అవసరం. గ్రామాలలో ఈ-సేవలను కల్పించే పేరుతో బ్రాడ్‌బ్యాండ్, 5-జీ నెట్‌వర్క్ లాంటివాటి ద్వారా ప్రైవేటు సంస్థలకు లాభాలు చేకూర్చి పెట్టాలన్నది మరో ఆలోచన.

ప్రజల సంగతి వారికి పట్టదు

మెజారిటీ ప్రజల ఆర్థిక స్థితిని, జీవన ప్రమాణాలను పెంచడంపై సర్కారుకు దృష్టి లేదు. వీలైనన్ని రూపాలలో ప్రైవేటు సంస్థలకు లాభాలు ఆర్జించిపెట్టడం, ప్రభుత్వరంగ సంస్థల బాధ్యత నుంచి తప్పుకుని 'ఆరోగ్యకరమైన పోటీ' పేరుతో ప్రైవేటుకు ధారాదత్తం చేసే ప్రక్రియ మున్ముందు తీవ్రం కానున్నది. చివరకు వ్యవసాయరంగం సైతం కార్పొరేట్ సంస్థల చేతిలో బందీ కానున్నది. ప్రజా సంక్షేమం, ఉపాధి కల్పన లాంటివన్నీ గాలికొదిలేసి సంపదను కొద్దిమంది దగ్గరకు చేర్చడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రయారిటీ.

ఎన్. విశ్వనాథ్

Advertisement

Next Story

Most Viewed