రసకందాయంలో రాజకీయం

by Viswanth |   ( Updated:2022-09-03 18:46:11.0  )
రసకందాయంలో రాజకీయం
X

రాష్ట్రంలో రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో పొలిటికల్ లీడర్లు అంచనా వేయలేకపోతున్నారు. ఇంతకాలం హెచ్చరికలు, సవాళ్లు, భారీ డైలాగులు వినిపించాయి. ఇప్పుడు యాక్షన్ షురూ అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయే జైలుకు వెళ్లారు. 'టచ్ చేసుడు పక్కా' అని ఈ మధ్య కేసీఆర్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ, టచ్ చేయకముందే కేసీఆర్ తన పవర్ ఏంటో చూపించారు. ఈ ఘటనతో దృష్టంతా బండి సంజయ్ చుట్టూ మళ్లింది. కాంగ్రెస్ పార్టీ ఊసులో లేకుండాపోయింది. ఇదే కేసీఆర్ కోరుకున్నది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు తరహాలో పొలిటికల్ డ్రామా ఆసక్తికరంగా సాగుతున్నది. అటెన్షన్ డైవర్షన్ చేయడంలో కేసీఆర్ రూటే సెపరేటు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు తర్వాత ఈ స్ట్రాటజీ మొదలైంది. ప్రజలలో టీఆర్ఎస్ ఓటమిపై చర్చే లేకుండా చేయగలిగారు. అంతకంటే ఎక్కువగా ఈటల హైలైట్ కాకుండా టాపిక్ డైవర్ట్ అయింది. ఆ తర్వాత మొత్తం ఫోకస్ ఎమ్మెల్సీ ఎన్నికలు, దాని తర్వాత వడ్ల కొనుగోళ్లు, కేంద్రాన్ని ఇరుకునపెట్టడానికి పార్లమెంటు సమావేశాలలో నిరసనలు, వారం రోజులపాటు ఢిల్లీలో మకాం, ఇవన్నీ హుజూరాబాద్‌ను, ఈటలను మర్చిపోయేలా చేశాయి. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో చెన్నయిలో భేటీ కూడా ఆ కోవలోనిదే.

ఒక దెబ్బకు రెండు పిట్టలు

ఇప్పుడు అవన్నీ సద్దుమణిగాయి. కొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే బండి సంజయ్‌ను అరెస్టు చేయడం. దీంతో అందరి దృష్టీ ఇటువైపు మళ్ళింది. నిజానికి బండి సంజయ్ ఇంతగా హైలైట్ అవుతారని ఆ పార్టీ నేతలూ అనుకోలేదు. ఆయన చేపట్టిన జాగరణ దీక్ష జైలుకు పంపాల్సినంత పెద్దదేమీ కాదనే అభిప్రాయమూ వ్యక్తమైంది. ఈ అరెస్టు వెనక టీఆర్ఎస్‌కు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, బండి సంజయ్‌ను హీరో చేసి ఈటలను అప్రాధాన్యం చేయడం. రెండోది బీజేపీతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి దోస్తానా లేదనే సందేశాన్ని జనంలోకి పంపడం. ఈ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహంతో కాంగ్రెస్‌ సైడ్‌లైన్ అయిపోయింది. అసెంబ్లీలో కనిపించకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యమంటూ ఈటల రాజేందర్ పలు సందర్భాలలో తన గురించి చెప్పుకున్నారు. మరో రెండు నెలలలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో! ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతున్నది. ఈటలను సైడ్‌లైన్ చేయడం కోసమే బండి సంజయ్ అరెస్టు డ్రామా జరుగుతున్నదని బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అటెన్షన్ డైవర్షన్ అంశాలన్నీ ఇందులో భాగమేనన్న వాదనలూ ఆ పార్టీ నేతలలో వ్యక్తమవుతున్నాయి. అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు, జాతీయ స్థాయి నేతల ఖండనలు, జైలులో పరామర్శలు, ఇవన్నీ కొన్ని రోజుల పాటు డ్రామాను మరింతగా రక్తి కట్టిస్తాయి.

అసలు ఆలోచన అదే

ఉద్యమకారులు, ఆత్మగౌరవం పేరుతో ఈటల రాజేందర్ సెంటిమెంట్ రగులుస్తారనే భయం టీఆర్ఎస్‌లో లేకపోలేదు. అసంతృప్తితో ఉన్న గులాబీ నాయకులు చేజారిపోతారేమోననే భయమూ వెంటాడుతున్నది. ఈటలతో డేంజర్ ఉంటుందనేది బలమైన అభిప్రాయం. అందుకే ఆయనను కట్టడి చేయడం అవసరం. హుజూరాబాద్‌లో గెలుపు తర్వాత అసైన్‌డ్ లాండ్ దర్యాప్తు మొదలైంది. గెలిచిన సంతోషం ఆయనకు ఎంతోసేపు లేకుండాపోయింది. బీజేపీలో ఒకింత ప్రాధాన్యత పెరుగుతున్నది. ఇది టీఆర్ఎస్‌కు ముప్పుగా మారే అవకాశముందని గ్రహించింది. కరీంనగర్ జిల్లాలో తనకున్న పట్టుతో టీఆర్ఎస్ లీడర్లను లాగేసుకుంటారన్న అనుమానమూ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్‌సింగ్ వెనక ఈటల పాత్రను సందేహించింది. చివరకు ఆ ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తపడింది. సంజయ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం ద్వారా ఈటలకు ప్రాధాన్యత లేకుండా చేయవచ్చన్నది కూడా టీఆర్ఎస్ ప్లాన్. నిజానికి ఈటల రాజేందర్ గెలుపు టీఆర్ఎస్‌ను డైలమాలో పెట్టింది. కేసీఆర్‌కు నైతికంగా ఝలక్ ఇచ్చినట్లయిందనేది బహిరంగ రహస్యం. ఈటల సైతం తనను అధికార పార్టీ ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నదనే భావనతో ఉన్నారు. వ్యాపారాలన్నీ కుదేలు కావడంతో ఒకింత టెన్షన్‌లోనే ఉన్నారు. అన్ని రకాలుగా ఈటలను ఇరుకున పెట్టడం, హైలైట్ కాకుండా చూడడం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి నైతికంగా చాలా అవసరం. ఎలాగూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏ పోరాట రూపాన్ని తీసుకున్నా ఆదిలోనే బ్రేక్ పడుతున్నది. గృహనిర్బంధంతో గడప దాటి బైటకు వెళ్లలేకపోతున్నారు. మొన్న నిరుద్యోగుల జంగ్ సైరన్, నిన్న 'రచ్చబండ' నిరసనలకు ఇదే జరిగింది. కారణాలేవైనా కాంగ్రెస్ కార్యకలాపాలు పాపులర్ కావద్దనేది టీఆర్ఎస్ ఆలోచన.

ఉమ్మడి ప్రయోజనాల కోసం

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఎంత ఉధృతంగా రాజకీయ ఘర్షణ జరిగితే అది ఆ మేరకు రెండు పార్టీలకూ ప్రయోజనం. ఇద్దరికీ ఉమ్మడి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ అప్రాధాన్యం అవుతుంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు సరేసరి. జగ్గారెడ్డి లేదా కోమటిరెడ్డి లేదా భట్టి విక్రమార్క లాంటి నేతలు తెరపైకి వస్తారు. ఒక వివాదాస్పద కామెంట్ చుట్టూ చర్చ జరుగుతుంది. అవసరమైతే ఆ పార్టీ అధిష్టానానికి లేఖలు వెళ్తాయి. నాయకత్వం, పార్టీ శ్రేణులు డీమోరల్ అయ్యే అంశాలు హాట్ టాపిక్‌గా మారుతాయి. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని ఇంటా బైటా ఉక్కిరిబిక్కిరి చేయడం ఆ రెండు పార్టీలకూ అవసరం. అందుకే ఆయన పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి చందంగా మారింది. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేకున్నా రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కింది. ఇప్పటి నుంచే పార్టీలు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాయి. పథకాల పేరుతో అధికార పార్టీ దూకుడు పెంచుతున్నది. ప్రభుత్వ వైఫల్యాల పేరుతో ప్రతిపక్షాలు రోడ్డెక్కుతున్నాయి. కాంగ్రెస్‌తోనే ఎక్కువ డేంజర్ అనేది టీఆర్ఎస్ భావన. అందుకే ఆ పార్టీ శ్రేణులను నైతికంగా నీరుగారుస్తున్నది. 'వంద జాకీలు పెట్టినా లేవదు' అనే కామెంట్లు చేస్తున్నది. దీనికి తోడు కాంగ్రెస్‌లో కోవర్టుల చర్చ సరేసరి. బీజేపీ, టీఆర్ఎస్‌లు కొట్టుకుంటూ కాంగ్రెస్‌ను తెర వెనకనే ఉంచాలన్నది ఉమ్మడి వ్యూహం. ఏకకాలంలో కాంగ్రెస్‌ను అప్రాధాన్యం చేయడం, ఈటలను ద్వితీయ శ్రేణి లీడర్‌ పాత్రకు మాత్రమే పరిమితం చేయడం టీఆర్ఎస్ లక్ష్యం. ఇప్పటివరకు పలు చర్యలతో సక్సెస్ అయింది. భవిష్యత్తు పరిణామాలు పార్టీల లీడర్ల అంచనాకు అందడంలేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే కేసీఆర్ రాజకీయ చాణక్యం మున్ముందు ఎలాంటి మలుపులకు కారణమవుతుందో!

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story

Most Viewed