- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటుకు ఆధార్ లంకె ఎందుకు?
ఇటీవలి కాలంలో అన్నింటికీ ఆధార్ కార్డే ఆధారం. మొబైల్ సిమ్ కార్డు మొదలు బ్యాంకు ఖాతా వరకు అది తప్పనిసరి. 'నిర్బంధం కాదు, కేవలం స్వచ్ఛందమే' అని ప్రభుత్వాలు బుకాయిస్తున్నా ఆచరణలో మాత్రం అది 'తప్పనిసరి'గానే మారింది. ఆధార్ లేకుంటే చాలా పనులు జరగవు. ఈ కోవలోకే ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డూ వచ్చి చేరింది. అయితే, ఇది తెచ్చే చేటు ఏ స్థాయిలో ఉంటుందనే భయాలు, ఆందోళనలు లేకపోలేదు. రాజకీయ పార్టీల మధ్యనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వ్యక్తుల ప్రైవసీ బహిరంగమవుతుందనేది ప్రధాన చర్చ. డూప్లికేట్, బోగస్ ఓటర్లను ఏరివేయడానికే ఈ సంస్కరణ అని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికేనని కూడా సమర్ధించుకుంటున్నది. కానీ, అంతకు మించిన లక్ష్యాలే ఉన్నాయి. నిర్దిష్టంగా ఏ ఓటరు ఎక్కడ ఉంటున్నారు? ప్రభుత్వం తరఫున ఎలాంటి పథకాలు అందుకుంటున్నారు? నగదు బదిలీ కింద ఏ మేరకు సాయం అందుతున్నది? ఇలాంటివన్నీ ఈ కొత్త విధానంతో పసిగట్టడానికి మార్గం సుగమం అయింది. దానికి తగినట్లుగా ఓటర్లను ఆకర్షించే పనులకు పార్టీలు సాన పెట్టవచ్చు. భవిష్యత్తులో ఓటు వేయనివారిని పథకాల నుంచి దూరం చేయాలన్న ఆలోచనా లేకపోలేదు.
చేటు తేనున్న ఓటు
ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం లేదని తరచూ వింటుంటాం. 'ఓటు హక్కే లేకపోతే చచ్చిపోయినవారితో సమానం' అని ప్రజలకూ ఒక అభిప్రాయం ఉన్నది. ఒక్క ఓటే మన తలరాతను మారుస్తుందనేదీ వాస్తవం. ప్రతీ ఎన్నికల టైమ్‌లో లక్షలాది ఓట్లు జాబితా నుంచి గల్లంతవుతూ ఉంటాయి. పార్టీలు మొత్తుకుంటూ ఉంటాయి. మనకు తెలియకుండానే మన ఓటు మాయమవుతుంది. అధికారులకు చెప్పినా అది అరణ్య రోదనే అవుతుంది. ఇన్ని లొసుగులను, లోపాలను సరిదిద్దుకోవడంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టదు. నోటుతో ఓటు కొనుక్కుంటున్నా, ఓటర్లు అమ్ముడుపోతున్నా, క్యాంపు రాజకీయాలు నడుస్తున్నా కమిషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉంటున్నారు. వీటిని సంస్కరించే బాధ్యత నుంచి తప్పుకున్న స్వతంత్ర వ్యవస్థ ఇప్పుడు ఆధార్‌పైన దృష్టి పెట్టింది. ఏ ఓటుతో ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుని చట్టసభలకు పంపించామో వారు ప్రేక్షకులుగానే మిగిలిపోయారు. వారి ప్రమేయం లేకుండానే పార్లమెంటు ఉభయ సభలలో 'ఓటరు కార్డు- ఆధార్ కార్డు లంకె' బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదంతో అది నేడో రేపో చట్టంగానూ మారనున్నది. ఇప్పుడు ఎంత చర్చించుకున్నా ప్రయోజనం లేదు. అది అరణ్య రోదనే అవుతుంది. ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి చెప్పుకునే ఆ చట్టసభలో విపక్షాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా అధికార పార్టీ మందబలంతో పాస్ అయిపోయింది. ఇకపై ఈ సంస్కరణ ఓటర్లకు ఎలాంటి చేటు తెస్తుందనేది కాలక్రమంలో వెల్లడవుతుంది.
దుర్వినియోగం కాదనే గ్యారంటీ ఏది?
నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆశించినట్లుగా ఈ కొత్త విధానంతో బోగస్ ఓటర్లను ఏరివేయడం సాధ్యం కావచ్చు. కానీ, ఆధార్ వివరాలను అందుకే వినియోగిస్తారనే గ్యారంటీ లేదు. నోట్ల రద్దు సమయంలో అన్ని బ్యాంకులూ పాత నోట్లను కొత్తవాటితో మార్చడానికి ఆధార్ కార్డు జిరాక్సు కాపీని వాడుకున్నాయి. ఒక్క జిరాక్సు కాపీని పదేపదే వాడుకున్నాయి. ఆ విషయం ఆధార్ కార్డు వ్యక్తికి కూడా తెలియలేదు. మొబైల్ సిమ్ కోసం ఇస్తున్న జిరాక్సు కాపీలూ అదే తరహాలో దుర్వినియోగమవుతున్నాయి. ఇప్పుడు ఓటరు కార్డుతో ఆధార్‌ను లింక్ చేస్తే దుర్వినియోగాన్ని గుర్తించేదెవరు? బోగస్ ఓట్లను తొలగించడంలో విఫలమైన ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఈ దారి ఎంచుకున్నది. ప్రధానమంత్రి వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ఈ మధ్య హాకింగ్‌కు గురైంది. కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లకూ అదే జరిగింది. టెక్నాలజీని ఎంత విస్తృతంగా వినియోగిస్తూ ఉంటే సవాళ్లూ అంతే స్థాయిలో ఎదురవుతున్నాయి. వ్యక్తుల ప్రైవసీకి సంబంధించి దేశవ్యాప్తంగానే చర్చ జరుగుతున్నది. ఓటర్ల జాబితా వివరాలు వెబ్‌సైట్ నుంచి చోరీకి గురైతే వాటితోపాటు ఆధార్ వివరాలూ లీక్ అవుతాయి. మొబైల్, ఈ-కామర్స్ లాంటి అనేక సంస్థలు వ్యక్తుల డాటాను దొడ్డిదారిన అమ్ముకుంటున్నాయి. ఇప్పుడు వాటితో పాటు ఆధార్ వివరాలూ చేరిపోతాయి. ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఆధార్‌లో నిక్షిప్తమై ఉంటుంది. తస్కరించిన సంస్థ లేదా కొనుక్కున్న సంస్థ ఏ అవసరానికి వాడుకుంటుందో ఊహించలేం.
అనుమానాలతోనే అభ్యంతరాలు
ఆధార్ కార్డు వివరాలు నిక్షిప్తమయ్యే వెబ్‌సైట్ సైతం సైబర్ దాడులకు అతీతమేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం. తీగ లాగితే డొంకంతా కదిలిందనే చందంగా ఇప్పుడు ఒక్క ఆధార్ కార్డు వివరాలు లీకైతే సమస్తం తెలుసుకోడానికి వీలవుతుంది. నిజానికి ఆధార్ కార్డు వ్యక్తుల నివాసానికి గుర్తింపుగా వాడేది. ఓటరు కార్డు మాత్రం ఈ దేశ పౌరులుగా ఓటు వేయడానికి వినియోగించేది. ఇప్పుడు ఈ రెంటికీ లింకు పెట్టడమే అర్థరహితమనే వాదన ఉన్నది. క్రెడిట్, డెబిట్ కార్డు సహా కాదేదీ నకిలీకి అనర్హం. ఆధార్ కార్డూ అందుకు మినహాయింపేమీ కాదు. అందుకే సుమారు యాభై వేల బోగస్ ఆధార్ కార్డులను తొలగించినట్లు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం గతేడాది తేటతెల్లం చేసింది. డూప్లికేట్, బోగస్ ఓటర్లను ఏరివేయడానికే ఈ కొత్త విధానాన్ని వాడుకున్నట్లయితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ, దాని వెనక విపరీత ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలకు సమాధానం కరువైంది. అందువల్లనే అభ్యంతరాలూ, ఆందోళనలు వ్యక్తమవుతున్నది. ఓటు ఏ పార్టీకి వేశారో, అసలు వేశారో లేదో తెలుసుకుని కక్షసాధింపు చర్యలకు రాజకీయ పార్టీలు వాడుకుంటాయనేది బలమైన అనుమానం. సంక్షేమ పథకాలను కత్తిరించడం కోసమే ఈ కొత్త విధానం అనేదీ బలంగా వినిపిస్తున్నది. ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తున్నది మరొకటి అని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వ ఉద్దేశం మీద అనుమానాలు పొడసూపుతున్నాయి. ఇప్పుడు ఓటరు-ఆధార్ కార్డు లింకు వెనక కూడా పార్టీలకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది బలమైన అభియోగం.
వారి తలరాత ప్రశ్నార్థకం
పార్లమెంటు సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీ గతేడాది మార్చిలోనే తన నివేదికలో ఆధార్ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానం చేయాలనే సిఫారసు చేసింది. ఆధార్ కార్డు ఏ చిరునామాతో ఉంటే అక్కడే ఓటు హక్కు ఉండేలా ఆ కమిటీలో చర్చలు జరిగాయి. ఇకపైన నివాసం మారినప్పుడల్లా ఆధార్ కార్డు అప్‌డేషన్‌తో పాటు ఓటరు కార్డునూ మార్చుకోవడం తప్పనిసరి. లేదంటే ఓటు హక్కు ఉండదు. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలుచేసినా సుప్రీంకోర్టు ఆదేశంతో అర్ధంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత వివరాలు ఇప్పుడు ఒక్కొక్కదానికి లింకు పెట్టడంతో మొత్తం బహిరంగం అవుతున్నాయి. విస్తృత స్థాయిలో చర్చలు జరిగి అన్ని వైపుల నుంచి వచ్చే అభిప్రాయాలకు అనుగుణంగా జరగాల్సిన నిర్ణయాలు చట్టసభలలో ఏకపక్షంగానే జరిగిపోతున్నాయి. ఏ ఓటుతో ప్రజా ప్రతినిధిని అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపుతున్నారో ఇప్పుడు ఆ ఓటే వారి తలరాతను, చరిత్రను ప్రశ్నార్థకం చేస్తున్నది. బోగస్ ఓట్లను ఏరివేయడంలో విఫలమైన ఎన్నికల కమిషన్ తన చేతకానితనాన్ని ఈ కొత్త విధానంతో అధిగమించాలనుకుంటున్నది. కోడ్ ఉల్లంఘనలు, విచ్చలవిడి డబ్బు పంపిణీ, మద్యం ప్రలోభాలులాంటివి జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం పాలు చేసింది. ఇప్పుడు బోగస్ ఓటర్ల ప్రక్షాళన కోసం ఆధార్ లింకును మార్గంగా ఎంచుకున్నది. అందుకే ఆధార్ కార్డు మనదే.. కానీ దాని వినియోగం మన చేతిలో లేదు. దుర్వినియోగాన్ని ఆపడంపైనా మనకు నియంత్రణ లేదు.
ఎన్. విశ్వనాథ్
99714 82403