నానాటికి ధీమా సడలుతున్నదా?

by Viswanth |   ( Updated:2022-03-10 11:24:55.0  )
నానాటికి ధీమా సడలుతున్నదా?
X

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్‌కు ఒక గుర్తింపు ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 'ఫక్తు రాజకీయ పార్టీ'గా మారిపోయిందని అధినేత కేసీఆర్ చెప్పుకోవచ్చు. కానీ, ప్రజలు మాత్రం దాన్ని ఇప్పటికీ ఉద్యమ పార్టీగానే భావిస్తున్నారు. అందుకే ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ తరచూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యమ ద్రోహులకే పెద్ద పీట వేస్తున్నట్లు కేసీఆర్‌పైనా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన మాటను శిరోధార్యంగా భావించేవారు లక్షలాది మందే ఉన్నారు. ఎదురు తిరగడానికి ధైర్యం చేయరు. 'బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్' అనుకుంటూ ఉంటారు. కేసీఆర్ కూడా అదే కోరుకుని ఉండొచ్చు. ఏడేళ్ల ఆయన వ్యవహారశైలి చూస్తే అదే నిజమనిపిస్తుంది. క్రమంగా ఆ భావన తొలగిపోతున్నది. ఎదురుతిరగడం మొదలైంది. గొంతు విప్పడం ప్రారంభమైంది. మొన్న హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌, నిన్న కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్‌ అందుకు ఉదాహరణ. ఇంకా బైటపడని నేతలు చాలామందే ఉన్నారు. సమయం, సందర్భం కోసం వేచి చూస్తున్నారు. 'జీ హుజూర్' అంటూ ఇంతకాలం పల్లకీ మోసినవారే ఇప్పుడు సవాళ్లు విసురుతున్నారు. అటు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వంత పార్టీ కార్యకర్తలను జారిపోకుండా కాపాడుకోడానికి పార్టీ భారీ స్థాయిలోనే ఖర్చుచేసింది. క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలని చెప్తూనే డబ్బులతో వారిని సర్దుబాటు చేయక తప్పలేదు.

పెరుగుతున్న ధిక్కార స్వరం

పార్టీ అధినేతగా కేసీఆర్ తన కేడర్‌ను, లీడర్లను కంటి చూపుతోనే కంట్రోల్ చేయగలిగారు. పార్టీ టికెట్లు, మంత్రివర్గంలో స్థానం మొదలు నామినేటెడ్ పదవుల వరకు ఆయన చెప్పిందే వేదం. ఆశించడం వరకే తప్ప డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఎంతటివారైనా 'ఎస్ బాస్' అనాల్సిందే. ఇక ప్రతిపక్షాల సంగతి సరేసరి. అసెంబ్లీ వేదికగా ప్రశ్నించడాన్ని, విమర్శించడాన్ని కేసీఆర్ సహించలేదు. నయానో, భయానో విపక్ష నేతలను లాగేసుకున్నారు. ఏకంగా కాంగ్రెస్, తెలుగుదేశం శాసనసభా పక్షాలనే తన పార్టీలో విలీనం చేయించగలిగారు. రాజకీయ చాణక్యంలో తనకు తానే సాటి అనే ధోరణిని ప్రదర్శించగలిగారు. శివుడాజ్ఞ లేనిదే తరహాలో ఆయన ఒకే అంటేనే ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ. చివరకు మంత్రులకూ ఇది తప్పలేదు. అనుమతి లేకుండా ప్రగతి‌భవన్‌లోకి ఏ స్థాయివారికైనా ప్రవేశం లేదు. అడిగితే తప్ప పార్టీ నాయకులు పెదవి విప్పే సాహసం చేయరు. అధినేతపై బహిరంగంగా కామెంట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఏడేళ్లుగా జరుగుతున్న ఈ పరిస్థితి ఇప్పుడు క్రమంగా మారిపోతున్నది. హ్యుమిలియేషన్‌కు గురవుతున్నవారు నర్మగర్భంగా సందర్భానుసారం గొంతు విప్పుతున్నారు. అందరూ ఈటల రాజేందర్‌లు, రవీందర్‌సింగ్‌లు కాకపోవచ్చు. కానీ, సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాలన్న భావనతో ఉన్నారు. క్రిందిస్థాయిలో ఉన్న స్థానిక సంస్థల కౌన్సిలర్లు సైతం ఇప్పుడు అధినేతకు ఎదురు చెప్పడానికి వెనకాడడంలేదు.

క్యాంపులు పెట్టినా క్రాస్ ఓటింగ్

ఇంతకాలం ఏది చెప్తే అదే నడిచిన పార్టీలో ఇప్పుడు పట్టు సడలుతున్నది. నాయకత్వానికీ ధీమా సన్నగిల్లుతున్నది. క్రమశిక్షణ కలిగిన 60 లక్షల మంది సైన్యం ఉందంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సందర్భాల్లో గొప్పగా చెప్పుకున్నారు. ఆ క్రమశిక్షణ కలిగినవారినే ఇప్పుడు చేజారిపోకుండా చూసుకోవాల్సి వస్తున్నది. క్రాస్ ఓటింగ్ జరగకుండా క్యాంపులకు, రిసార్టులకు తరలించాల్సి వచ్చింది. రోజూ లక్షలాది రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చింది. దైవదర్శనాలకు తీసుకెళ్లాల్సి వచ్చింది. చివరకు సెంటిమెంట్‌గా దేవుని మీద ప్రమాణాలు చేయించాల్సి వచ్చింది. పసుపు, కుంకుమలనూ వాడక తప్పలేదు. అయినా క్రాస్ ఓటింగ్‌ను నివారించలేకపోయింది పార్టీ నాయకత్వం. కరీంనగర్‌లోగానీ, ఖమ్మంలోగానీ, చివరకు మెదక్‌లోగానీ ఇదే ప్రతిబింబించింది. విపక్ష పార్టీలు వాటికి ఉన్న స్వంత బలంకంటే ఎక్కువ ఓట్లను సంపాదించగలిగింది. టీఆర్ఎస్‌కు చెందిన ప్రజా ప్రతినిధులే ఈ ఓట్లు వేశారన్నది బహిరంగ రహస్యం. సాక్ష్యాలూ, ఆధారాలు లేకపోవచ్చు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నట్లయితే క్యాంపులకు, రిసార్టులకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలకు సమాధానం దొరకదు. వారిపై నమ్మకం లేదనేది తేటతెల్లం. డబ్బుతో కంట్రోల్ చేయక తప్పలేదు. ఇంతకాలం విపక్ష పార్టీల నుంచి లాగే అఫెన్స్ ఎత్తుగడలను అమలుచేసింది. కానీ 'డామిట్.. కథ అడ్డం తిరిగింది' తరహాలో ఇప్పుడు ఢిపెన్స్ మోడ్‌లోకి వెళ్ళింది. స్వంత పార్టీని విడిచి అవతలి పక్షంలోకి వెళ్ళకుండా కేడర్‌ను కాపాడుకోడానికి 'ఆత్మరక్షణ' అనివార్యమైంది.

అసెంబ్లీ ఎన్నికలకు ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో కేవలం నాలుగు వేల పైచిలుకు ఓట్ల కోసం క్యాంపు రాజకీయాలను చేపట్టాల్సి వచ్చింది. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడలేదు. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, సీనియర్ నేతలను వారి వెంట 'టీమ్ లీడర్'లుగా పంపినా క్రాస్ ఓటింగ్ నుంచి తప్పించుకోలేకపోయింది. నిన్నటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో స్వంత పార్టీ ఓట్లను కూడా పొందలేకపోయింది. పైగా వందకు మించి బలం లేని కాంగ్రెస్ ఏకంగా 242 ఓట్లను పొందగలిగింది. టీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ వైపు మళ్లిందనేది స్పష్టం. సరిగ్గా దీన్నే సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్య 'పార్టీ లోతుగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించక తప్పలేదు. గెలిచిన అభ్యర్థికి సైతం పూర్తిస్థాయి సంతృప్తి లేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.

కేవలం నాలుగు వేల మంది ఓటర్లను చేజారిపోకుండా క్యాంపులకు తిప్పిన టీఆర్ఎస్ భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఏ వ్యూహం అవలంబిస్తుంది? సుమారు మూడు కోట్ల మంది ఓటర్లలో ఎంత మందిని క్యాంపులకు తరలించగలుగుతుంది? అది సాధ్యమేనా? స్వంత పార్టీ నేతలో పట్టు తప్పుతున్నప్పుడు ప్రజలను కంట్రోల్ చేయగలుగుతుందా? వారి మనసులను గెల్చుకోడానికి బదులుగా ప్రలోభాలతో ఆకర్షించడం సాధ్యమా? అంత భారీస్థాయిలో డబ్బుల్ని వెచ్చించగలుగుతుందా? ఏడేళ్లుగా ఏది చెప్తే అది నడిచింది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇందుకు నిదర్శనమే తాజా క్యాంపు రాజకీయాలు. ఇది నైతికమా కాదా అనేది వేరే చర్చ. ఆ మాటకొస్తే కర్నాటక సహా అనేక రాష్ట్రాలలో బీజేపీ నడిపిన క్యాంపు రాజకీయాలు ప్రజలకు తెలియందేమీ కాదు.

భవిష్యత్ ఏమిటి?

ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. హుజూరాబాద్‌లో 'దళితబంధు' లాంటి భారీ పథకాన్ని ప్రయోగించినా వ్యూహం బెడిసికొట్టింది. క్యాంపులు పెట్టినా స్వంత పార్టీ కేడర్‌ను క్రాస్ ఓటింగ్ నుంచి నివారించలేకపోయింది. వివిధ సెక్షన్ల ప్రజలలో పార్టీ, అధినేత, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. రైతుబంధు ఇచ్చినా వడ్ల కొనుగోళ్లపై రైతుల్లో అసంతృప్తి పెరిగింది. రాష్ట్రంలోని పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ప్రస్తానం వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న టీఆర్ఎస్ సవాళ్ల నడుమ స్వారీ చేస్తున్నది. పార్టీలోనే భిన్న స్వరాలు, తిరుగుబాటు, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. ఇకపై అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల ఆదరణను ఎలా చూరగొంటుందన్నది ఆ పార్టీ నేతలను వేధిస్తున్న ప్రశ్న.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story

Most Viewed