- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహార సంక్షోభానికి నాంది
'అమ్మా... చలి వేస్తున్నదే.. కొంచెం కుంపటి వెలిగించవా?
కుదరదు కన్నా, బొగ్గులు లేవు, నాన్నకు ఇప్పుడు పని లేదుగదా!
నాన్న ఉద్యోగం ఎందుకు పోయిందమ్మా?
బొగ్గుల నిల్వలు ఎక్కువ ఉన్నాయంట, అవి అయిపోయే వరకు పని ఉండదన్నారు
బొగ్గు నిల్వలు ఎక్కువుంటే మరి మన ఇంటిలో ఎందుకు లేవమ్మా?'
పెట్టుబడిదారీ సమాజంలో 'డిమాండ్-సప్లయ్' మధ్య అంతరాలను అర్థం చేయించే రష్యన్ కథలోని సన్నివేశం ఇది. ఇప్పుడు మన కండ్ల ముందు తెలంగాణ సమాజంలో వడ్ల కొనుగోళ్ల అంశం కూడా ఇలాగే ఉంది. ఐదేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయనే పేరుతో కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది. కానీ, ఇంకా రూపాయి బియ్యం కోసం కోట్లాది మంది నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. చివరకు రైతులు పండించిన పంటను అమ్ముకునే మార్గమూ లేదు. గతంలో ఖండసారి చక్కెర విషయంలోనూ ఇన్సెంటివ్‌లకు కోత పెట్టడంతో ఇలాంటి సంక్షోభమే నెలకొన్నది. చివరకు చెరకు పండించే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు వరి విషయంలో అదే పునరావృత్తం కానున్నది. భవిష్యత్తులో వరి పండించాల్సిన అవసరం లేదనే ఆంక్షలు ఆ కోవలోనివే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదు. సాగు ప్రణాళికలపై దూరదృష్టి లేదు. సరైన విధానాన్ని రూపొందించుకోలేకపోతున్నాయి. పరిస్థితులకు తగినట్లుగా ఆలోచించలేని ప్రభుత్వాల అసమర్ధత, వైఫల్యానికి ఇవి నిదర్శనం.
ఎఫ్‌సీఐని నిర్వీర్యం చేసే పథకం
బియ్యం కయ్యం ఇప్పట్లో ఆగేలా లేదు. వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల డ్రామా ఆసక్తికరంగా సాగుతున్నది. ఒకదాన్ని మరొకటి బూచీగా చూపించుకుంటున్నాయి. చివరికి రెండు ప్రభుత్వాలూ చేతులు ఎత్తేస్తున్నాయి. రైతుల నడ్డి విరుస్తున్నాయి. 'తిలపాపం తలా పిడెకెడు' చందంగా రైతులను, పేదలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ధాన్యం సేకరణ మాత్రమే ప్రశ్నార్థకంగా మారింది. భవిష్యత్తులో సబ్సిడీ బియ్యం పథకానికీ ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. చౌక ధరల దుకాణాలూ మూతపడే అవకాశం ఉన్నది. ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న భారత ఆహార సంస్థను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చాపకింద నీరులా జరిగిపోతున్నాయి. అందులో భాగమే ఇప్పుడు వరి కొనుగోళ్ల విషయంలో ఏర్పడిన సంక్షోభం. దేశ ప్రజల అవసరాలకు మించి బఫర్ స్టాక్ ఉన్నదని, ఐదేళ్లకు సరిపోయే నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అందువల్లనే బియ్యం సేకరణపై ఆంక్షలు విధించుకోక తప్పలేదని అంటున్నది. నిజానికి ఈ ఆంక్షల ప్రక్రియపై ఆరేళ్ల క్రితమే వ్యూహ రచన జరిగింది. కేంద్ర మాజీ మంత్రి శాంతకుమార్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఎఫ్‌సీఐ పునర్ వ్యవస్థీకరణపై 2015లోనే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. 1960వ దశకంలో ఎఫ్‌సీఐ ఏర్పాటుకు ఉద్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించలేకపోయిందని పేర్కొన్నది. కుక్కను చంపేముందు 'పిచ్చిది' అనే ముద్ర వేయడం కొత్తదేమీ కాదు. ఇప్పుడు ఎఫ్‌సీఐ విషయంలోనూ అదే జరుగుతున్నది.
సంస్కరణల పర్వం
ఆర్థిక సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యక్ష నగదు బదిలీని ఒక విధానంగానే అమలుచేస్తున్నాయి. వంట గ్యాస్ సబ్సిడీ తరహాలో కిలో బియ్యం పథకం కూడా అమలుకానున్నది. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలలో డబ్బులు పడతాయి. ప్రైవేటు దుకాణాల నుంచి కొనుక్కోవాలి. మార్కెట్‌లో బియ్యం ధరతో సంబంధం ఉండదు. సబ్సిడీని మాత్రమే వేస్తుంది. పది లక్షలకు పైబడి జనాభా ఉన్న నగరాలతో మొదలుపెట్టి దశలవారీగా దేశమంతా ఈ విధానాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తున్నది. అంత్యోదయ కార్డులను ప్రామాణికంగా తీసుకుని ఎంఎస్‌పీలో 50 శాతం మేర ప్రత్యక్ష నగదు బదిలీకి అంకురార్పణ చేయాలనుకుంటున్నది. ప్రస్తుతం దేశ జనాభాలో సుమారు 67 శాతం మందికి అందుతున్న సబ్సిడీ ఆహార పదార్ధాలను ఇకపైన 40 శాతం మందికి కుదించాలనుకుంటున్నది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లీకేజీలను సాకుగా చూపి ఆంక్షలను ప్రతిపాదిస్తున్నది. రైతులు కూడా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకారం ఎవ్వరికైనా విక్రయించుకోవచ్చు. ప్రైవేటు బయ్యర్లు కొంటారో లేదో తర్వాతి సంగతి. సేకరణతో ఎఫ్‌సీఐకి సంబంధం ఉండదు. కేవలం బఫర్ స్టాక్ నిర్వహణకు మాత్రమే పరిమితం కానున్నది. రైతులు మోసపోతే ప్రభుత్వాలకు బాధ్యత ఉండదు.
ప్రభుత్వాల వ్యాపార దృక్పథం
భారత ఆహార సంస్థ నిర్వహణను కేంద్ర ప్రభుత్వం వ్యాపార దృక్పథంతోనే చూస్తున్నది. లోడింగ్, అన్‌లోడింగ్, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు ఇలా అన్నింటికీ ఎంతెంత ఖర్చవుతున్నదో లెక్కలు వేసింది. ఒక్కో లోడర్‌కు నెలకు సుమారు 80వేల జీతం, డైరెక్ట్ పేమెంట్ వర్కర్లకు రూ. 26వేల చొప్పున మొత్తం 42వేల మందికి ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్లు తేల్చింది. దేశవ్యాప్తంగా గోదాముల నిర్వహణకు రూ. 33 వేల కోట్లు ఖర్చు అవుతున్నది. ఈ ఖర్చులను తగ్గించుకోడానికి సంస్కరణల బాట పడుతున్నది. గోదాములను ప్రైవేటుకు అప్పజెప్పే ఆలోచన చేస్తున్నది. యూరియా, ఎరువులు, పురుగుమందులకు సగటున ఏటా రూ. 72 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తేలింది. దీంతో ఇకపై ఎకరానికి సంవత్సరానికి ఏడు వేల రూపాయలను ఇస్తే చాలని లెక్కలు వేసింది. చౌక ధరల దుకాణాలను పూర్తిగా ఎత్తివేయడమో లేక రెగ్యులరైజ్ చేయడమో అని ఆలోచన చేస్తున్నది. ప్రతీ నెలా బియం ఇవ్వడానికి బదులు ఖరీఫ్, రబీ సీజన్ సేకరణ సమయంలో ఒకేసారి ఆరు నెలలకు ఇవ్వడంపైనా కసరత్తు చేస్తున్నది. దీంతో నిల్వ, రవాణా ఖర్చులను ఆదా చేసుకోవచ్చన్నది ఆలోచన. కేంద్రం నిర్ణయించిన ఎంఎస్‌పీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ఇస్తున్నట్లయితే ధాన్యం సేకరణను నిలిపివేయాలన్న భావనకూ వచ్చింది.
నీరుగారుతున్న లక్ష్యం
ఎఫ్‌సీఐ పెట్టిన ఉద్దేశమే రైతులు పండించే పంటలకు ఎంఎస్‌పీ భరోసా కల్పించడం, పేదలకు ఆహార భద్రత కల్పించి సబ్సిడీ ధరలపై బియ్యం అందించడం, మార్కెట్ స్థిరీకరణకు తగినట్లుగా ఆహార ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం. కానీ, సంస్కరణల కారణంగా ఈ లక్ష్యాలు నీరుగారుతున్నాయి. రైతులు పండించిన పంటను కొనడం, అమ్మడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. కేంద్రం కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నది. ఉద్యోగుల జీత భత్యాలు, రవాణా ఖర్చులు, గోదాముల నిర్వహణ భారం లాంటి అంశాలను విశ్లేషించి ఖర్చును తగ్గించుకోవాలనుకుంటున్నది. దేనికెంత ఖర్చవుతున్నదో లెక్కలు వేసింది. చివరకు సంస్కరణలతో ఎఫ్‌సీఐ పరిధిని కుదించాలనుకుంటున్నది. చివరకు రైతుల ఎంఎస్‌పీ, పేదల ఆహార భద్రత ప్రమాదంలో పడనున్నది. రెండు ప్రభుత్వాలూ ధాన్య సేకరణ బాధ్యత నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పుకుంటున్నాయి. 'రైతే రాజు, రైతు సంక్షేమం' ఇవన్నీ మాటల వరకే. వడ్ల కొనుగోళ్ళలో ఏర్పడిన తాజా సంక్షోభం ఆ రెండు ప్రభుత్వాల పాపమే. ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటూ రైతులను మభ్యపెడుతున్నాయి. గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి నాంది పలుకుతున్నాయి.
ఎన్. విశ్వనాథ్