వరి సాగు మీద కిరికిరి?

by Viswanth |   ( Updated:2022-03-10 11:06:18.0  )
వరి సాగు మీద కిరికిరి?
X

రైతును రాజును చేయడమే ధ్యేయమని కేసీఆర్ చెబుతారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం టార్గెటని ప్రధాని మోడీ అంటారు. కానీ, ఇద్దరూ ఆ లక్ష్యసాధనలో విఫలమయ్యారు. వ్యవసాయమే పట్టుగొమ్మ అని చెబుతూనే అన్నదాతను వెన్నెముకను విరిచేస్తున్నారు. అసలే ప్రకృతి ప్రతికూల ప్రభావాలతో, కరువు కాటకాలతో ఆగమై ఉన్న రైతు, ఇప్పుడు సమృద్ధిగా పంటలు పండినా దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత రైతును అయోమయంలోకి నెట్టింది. కష్టపడి పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకోలేని నిస్సహాయ స్థితికి చేర్చింది. బీజేపీ, టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల సంగతి ఎలా ఉన్నా చివరకు అది రైతుకు శాపంగా మారింది. రెండు పార్టీలూ రైతు జపమే చేస్తున్నా ఆదుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఒకదానిపై మరొకటి రాజకీయంగా పైచేయి సాధించడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. సవాళ్లు విసురుకుంటున్నాయి. ప్రజలు అసహ్యించుకునే భాషలో మాట్లాడుకుంటున్నాయి. ఒకదాని తప్పులను మరొకటి బైటపెట్టుకుంటున్నాయి. ఇవేవీ రైతుకు ఉపశమనం ఇవ్వడంలేదు. భవిష్యత్తుపై భరోసా ఇవ్వడంలేదు. రెండు పార్టీల మధ్య రైతులు నలిగిపోతున్నారు.

కేసీఆర్ వర్సెస్ బండి

ఇప్పుడు తెలంగాణలో రైతు చుట్టూ రాజకీయం నడుస్తున్నది. రైతు బాంధవులం తామేనంటూ ఇటు సీఎం కేసీఆర్ అటు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఒకరి లోపాలను మరొకరు బైట పెట్టుకుంటున్నారు. హుజూరాబాద్ ఫలితం తర్వాత పొలిటికల్ హీట్ మొదలైంది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతును వాడుకుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నా రాష్ట్రస్థాయిలో మాత్రం రాజకీయాన్ని ఆసక్తిగా నడిపిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలుపై క్లారిటీ రాలేదు. ఇద్దరూ రైతుకు భరోసా కల్పించలేకపోతున్నారు. వచ్చే యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుపై ఇద్దరి మధ్యా, రెండు పార్టీల మధ్యా వాదనలు తారస్థాయికి చేరుకున్నాయి. రోడ్ల మీద కుప్పలుగా పేరుకుపోయిన వానాకాలం పంట కొనుగోలు మీద ఇద్దరూ బాధ్యత లేకుండానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో బస్తాలకొద్దీ ధాన్యం తడిచి ఎందుకూ పనికిరాకుండా పోయింది. రైతులు గుండెలు ఆగి చనిపోతున్నారు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను పలకరించడానికి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి వీరికి టైమ్ దొరకలేదు. కానీ, ఇద్దరూ రైతుల పక్షపాతినంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.

విధానాల లోపం.. రైతులకు శాపం

వ్యవసాయ ఆధారిత దేశానికి స్పష్టమైన విధానాలు కరువయ్యాయి. ఒకవైపు రూపాయి బియ్యం కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. మరోవైపు గోదాములలో కోట్లాది టన్నుల ధాన్యం మూలుగుతున్నది. అవసరాలకు తగిన విధాన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర సర్కారు విఫలమవుతున్నది. సరైన మార్కెటింగ్ విధానాలు లేవు. ఎగుమతి-దిగుమతి పాలసీపై స్పష్టత లేదు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడానికి కమిషన్లు, కమిటీలు అధ్యయనం చేశాయి. సిఫారసు చేశాయి. అమలుకు నోచుకోకుండా 'ఎక్కడి గొంగళి అక్కడే' తరహాలోనే ఉండిపోయాయి. అతివృష్టి, అనావృష్టి సమయాలలో రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర సర్కారు విఫలమవుతున్నది. అకాల వర్షాలతో పంటలు మునిగిపోతే ఆరు నెలల తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన, అధ్యయనం చేసి చేతులు దులుపుకుంటున్నది. విధానాలు, నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నది. మొత్తం దేశ పరిస్థితిని విశ్లేషించి రైతులను గైడ్ చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకున్నది. ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోయినప్పుడు వాటికి వ్యాల్యూ ఎడిషన్ కల్పించడం, అందుకు తగిన పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పడం, తగిన మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడంపై గంభీరంగా చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి.

ఆచరణ కొరవడిన రాష్ట్ర సర్కారు

ఏడు దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీకి వ్యవసాయ రంగంపై ముందుచూపు కొరవడిందని సీఎం కేసీఆర్ అంటున్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ రంగం ప్రస్తుత పరిస్థితిని, ప్రజల అవసరాలను విశ్లేషించారు. ఏ పంట ఎంత పండుతున్నది, ఎంత అవసరం ఉన్నది, మిగిలినదానిని ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తే రైతులకు ఎలా ప్రయోజనం కలుగుతుంది, స్వయం సహాయక మహిళా బృందాలకు ఎలా లాభం వస్తుంది, జీఎస్‌డీపీ ఎంతగా వృద్ధి చెందుతుంది ఇలా అనేక అంశాలను విస్తృతంగా చర్చించారు. వ్యవసాయ వర్సిటీ నుంచి ఆహార ఉత్పత్తి, వినియోగంపై సమగ్ర డాటాను అధ్యయనం చేసి వ్యవసాయ రంగం భవిష్యత్తులో ఎలా ఉండాలో నిర్దేశించారు. నియంత్రిత సాగు, క్రాప్ కాలనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలలాంటి అంశాలను తెరపైకి తెచ్చారు. ఇవేవీ ఆచరణలోకి రాలేదు. నియంత్రిత సాగును ప్రోత్సహించారు. 'తెలంగాణ సోనా' పండిస్తే తిరుగులేదన్నారు. వెద సాగు ద్వారా అధిక దిగుబడి వస్తుందన్నారు. పత్తికి అంతర్జాతీయ మార్కెట్ ఎక్కువగా ఉంది కాబట్టి దాని సాగు పెంచాలన్నారు. ఇవన్నీ ఒక్క ఏడాదికే రివర్స్ అయ్యాయి. ఇకపై ప్రభుత్వం ఎలాంటి సలహాలు ఇవ్వబోదని, రైతులు ఇష్టం వచ్చిన పంటను పండించుకోవచ్చని సెలవిచ్చారు.

తాజాగా ప్రత్యామ్నాయ పంటలనే రాగాన్ని అందుకున్నారు. ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేయాలో చెప్పలేదు. రైతుబంధు సమితులు, రైతువేదికలు నిర్వీర్యమయ్యాయి. వ్యవసాయ విస్తరణాధికారులు ఉత్సవ విగ్రహాలయ్యారు. కరోనాలో ఆదుకున్నది వ్యవసాయ రంగమేనంటూ సీఎం గొప్పగా చెప్పుకున్నా, రైతుబంధుతో ఆదుకుంటున్నామని గర్వంగా ప్రకటించుకున్నా మార్కెటింగ్ విషయంలో రైతుల అవసరాలను తీర్చలేకపోయారు. మిల్లర్ల, బయ్యర్ల దోపిడీని అరికట్టడంలో విఫలమయ్యారు.

కేంద్ర సర్కారు మొసలి కన్నీరు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే సంగతేమోగానీ కేంద్ర ప్రభుత్వం వారిని మరింత అగాధంలోకి నెట్టేస్తున్నది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికిపైగా ధర్నా చేస్తుంటే పట్టించుకోవడం లేదు. చనిపోతున్నా, ఆత్మహత్య చేసుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉన్నది. తెలంగాణలో వానకాలం ధాన్యం కొనుగోలు సంక్షోభాన్ని నివారించడానికి ముందుకు రాలేదు. స్వంత పార్టీ మంత్రులు, నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా సాగు చట్టాలపై పున:సమీక్ష లేదు. రైతుల పట్ల అక్కర ఉందని చెప్పుకుంటూనే వారి ఆందోళనకు పరిష్కారం కనుగొనడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. కార్పొరేట్ కౌగిటకు వ్యవసాయ రంగాన్ని నెట్టేసి చోద్యం చూస్తున్నది. మొత్తం వ్యవసాయ రంగమే సంక్షోభంలోకి కూరుకుపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మోతాదుకు మించి ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. కనీస మద్దతు ధరకు అమ్ముకోలేక రైతులు విలవిల్లాడుతున్నారు. బియ్యం సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిమాండ్-సప్లయ్ సమతుల్యానికి తీసుకుంటున్న చర్యలు శూన్యం. అసమర్థత, నిర్లక్ష్యం, నిస్సహాయత చివరకు అన్నదాతల జీవితాలను, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. అధిక నిల్వల సంగతేమోగానీ సమీప భవిష్యత్తులో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదాలు లేకపోలేదు. ఏ ఓటు బ్యాంకు కోసం పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయో చివరికి అదే గుదిబండగా మారనున్నది.

ఎన్. విశ్వనాథ్

Advertisement

Next Story

Most Viewed